గంజాయి.. సిటీ మీదుగా షిరిడి | Fraud Buisiness Going In Ranga Reddy | Sakshi
Sakshi News home page

గంజాయి.. సిటీ మీదుగా షిరిడి

Jan 17 2020 1:25 PM | Updated on Jan 17 2020 1:27 PM

Fraud Buisiness Going In Ranga Reddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి: విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో ఖరీదు చేసిన గంజాయిని హైదరాబాద్‌ మీదుగా మహారాష్ట్రలోని షిర్డీకి అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నించిన ముఠాకు ఎల్బీనగర్‌ జోన్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్వోటీ) పోలీసులు చెక్‌ చెప్పారు. ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసి, వీరి నుంచి 51 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ ఎం.భగవత్‌ గురువారం వెల్లడించారు. అదనపు సీపీ జి.సుధీర్‌బాబుతో కలిసి నేరేడ్‌మెట్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన  వివరాలు వెల్లడించారు.

సూర్యాపేట జిల్లాలోని పండునాయక్‌ తండాకు చెందిన ధరావత్‌ వంశీ నాయక్‌ (డ్రైవర్‌), సైదాబాషిగూడెం తండాకు చెందిన ధరావత్‌ రాజు నాయక్‌ (వంట మేస్త్రి), రామ్‌కోఠి తండాకు చెందిన జటావత్‌ రతన్‌లాల్‌ ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఈ ముగ్గురితో పాటు లాల్‌ సింగ్‌ నాయక్‌ తండాకు చెందిన అమఘోత్‌ నాగరాజు జట్టు కట్టాడు. ఈ ముఠా తరచుగా విశాఖపట్నం ఏజెన్సీ నుంచి గంజాయిని కేజీ రూ.2 వేల చొప్పున ఖరీదు చేసేది. దీన్ని వివిధ మార్గాల్లో హైదరాబాద్‌కు తరలించి సిటీతో పాటు శివార్లలో విక్రయించేది. తమ ‘రెగ్యులర్‌ కస్టమర్ల’కు కేజీ రూ.7 వేలకు అమ్మేది. ఈ నేపథ్యంలోనే వీరిపై విశాఖతో పాటు వరంగల్‌ జిల్లాలోనూ కేసులు నమోదయ్యాయి.

వంశీనాయక్‌పై వరంగల్‌ పోలీసు కమిషనర్‌ గతంలో పీడీ యాక్ట్‌ సైతం ప్రయోగించారు. వంశీ ఇటీవల తమ ముఠాతో కలిసి విశాఖ జిల్లాకు వెళ్ళాడు. అక్కడి ఏజెన్సీలోని ధరకొండ గ్రామం నుంచి 51 కేజీల గంజాయి ఖరీదు చేశాడు. దీన్ని ప్లాస్టిక్‌ కవర్లలో ప్యాక్‌ చేసి ఇన్నోవా వాహనం సీట్లలో, డోర్లలో, బాయ్‌నెట్‌లో నేర్పుగా దాచాడు. షిర్డీలో ఉండే కరణ్‌కు సరఫరా చేయడానికి రాజునాయక్, రతన్‌లాల్‌లతో కలిసి బయలుదేరాడు. వీరు వాహనం ఔటర్‌ రింగ్‌ రోడ్‌ మీదుగా వెళ్తోందని ఎల్బీనగర్‌ ఎస్వోటీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘట్కేసర్‌ పోలీసులకు కలిసి వలపన్ని పట్టుకున్నారు. ముగ్గురినీ అరెస్టు చేసి వీరి నుంచి 51 కేజీల గంజాయి, రూ.4,500 నగదు, వాహనం తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నాగరాజు, కరణ్‌ కోసం గాలిస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement