రైతన్న కన్నెర్ర

Formers Protest Against Telangana Government - Sakshi

దుబ్బాక ఎస్‌బీఐ పరిధిలో 1,606 మంది రైతులు తీసుకున్నరూ.9 కోట్లతో పాటు వడ్డీ రూ.2 కోట్లు చెల్లించాలంటూ బ్యాంక్‌ అధికారులు నోటీసులు జారీ చేయడంతో ఆగ్రహం చెందిన అన్నదాతలు ఆందోళన చేపట్టారు. గురువారం దుబ్బాక ఎస్‌బీఐ ఎదుట దాదాపు గంట పాటు బైఠాయించి.. నిరసన తెలిపారు.

దుబ్బాక : ‘రైతులకు రుణమాఫీ అన్నారు.. రైతు ప్రభుత్వమన్నారు.. పొద్దస్తమానం అన్నదాతల జపం చేసిండ్రు.. రైతుల ఓట్లతో గెలిచిన ప్రభుత్వమే బ్యాంకు అధికారులతో రుణాలు చెల్లించాలని నోటీసులిప్పించడం చూస్తుంటే ఇదేమి ప్రభుత్వమో తెలియడం లేదు’ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాధవనేని రఘునందన్‌రావు ఆరోపించారు. బ్యాంకు అధికారులు అందించిన నోటీసులతో బీజేపీ ఆధ్వర్యంలో రైతులు ఆర్‌అండ్‌బీ నుంచి గురువారం దుబ్బాక ఎస్‌బీఐ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గంటపాటు బ్యాంకు ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక ఎస్‌బీఐ పరిధిలో 1606 మంది రైతులు రూ.9 కోట్ల పంట రుణాలు తీసుకున్నారని, అధికారంలోకి రాగానే రైతులకు పంట రుణాలన్నింటినీ దశల వారిగా మాఫీ చేస్తామని చెప్పిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాట మార్చిందని ఆరోపించారు. రూ.9 కోట్ల అసలు రుణంతో పాటు మిత్తి మరో రూ.2 కోట్లు ఇవ్వాలని సంబంధిత రైతులకు నోటీసులివ్వడం సిగ్గుచేటన్నారు.

రుణమాఫీ వర్తించదా..?
రూ.వేల కోట్లతో బ్యాంకులకు ఎగనామం పెట్టిన బడా బాబులను విడిచిపెట్టి కాయాకష్టం చేసుకుని జీవించే రైతులను బెదిరించడం బ్యాంకు అధికారులకు తగదన్నారు. నోటీసులందుకున్న రైతులు బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా తీసుకున్న రుణాలు చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పడంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని వాపోయారు. నోటీసులందుకున్న రైతులకు ప్రభుత్వమిచ్చే రుణమాఫీ పథకం వర్తించదా అని రఘునందన్‌ ప్రశ్నిం చారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం కావాలని దుబ్బాక బ్యాంకు నుంచి ముందుగా రైతులకు నోటీసులు ఇప్పించిందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు వ్యక్తిగత రుణాలు ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులు చెప్పినోళ్లకే బ్యాంకు అధికారులు వ్యక్తిగత రుణాలు ఇవ్వడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. రైతులకు రుణాలు మాఫీ అయ్యేంతవరకు బీజేపీ దశల వారీగా ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి బాలేష్‌గౌడ్, కిసాన్‌ మోర్చా రాష్ట్ర ఉపాధ్యాక్షులు తోట కమలాకర్‌రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు విభీషన్‌రెడ్డి, కోమటిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఎన్‌ చారి, మండల అధ్యక్షుడు మంద అనిల్‌రెడ్డి, నగర అధ్యక్షుడు సత్తు తిరుమల్‌రెడ్డి పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top