50 వేల మందికి చేప ప్రసాదం

50 వేల మందికి చేప ప్రసాదం - Sakshi


శుక్రవారం ఉదయం 9 గంటల వరకు పంపిణీ  

వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన ఆస్తమా బాధితులు

ఏర్పాట్లు పరిశీలించిన నాయిని, తలసాని, స్వామిగౌడ్‌
సాక్షి, హైదరాబాద్‌: చేపప్రసాదం పంపిణీ కార్యక్రమం గురువారం  ప్రశాంతంగా సాగింది. ఏటా మృగశిర కార్తె ప్రారంభం రోజు అందజేసే చేపప్రసాదం పంపిణీ కార్యక్రమం గురువారం ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. బత్తిని హరినాథ్‌గౌడ్, విశ్వనాథ్‌గౌడ్, శివరాంగౌడ్, సోమలింగంగౌడ్, ఉమామహేశ్వర్‌గౌడ్‌లు, వారి కుటుంబసభ్యులు చేపప్రసాదం పంపిణీ చేశారు. ఉదయం భారీ వర్షం కారణంగా కొద్దిగా ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్తమా బాధితుల సంఖ్య క్రమంగా పెరిగింది. హైదరా బాద్‌తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌కు తరలివచ్చారు. రాత్రి 10.30 గంటల వరకు సుమారు 50 వేల మందికి చేప ప్రసాదం పంపి ణీ అయినట్లు అధికారులు వెల్లడిం చారు. అయితే, గత సంవత్సరంతో పోల్చు కుంటే ఈ సంఖ్య తక్కువే. గతేడాది ఉదయం నుంచి సాయంత్రం వరకు 64 వేల మందికి పైగా చేపప్రసాదం పంపిణీ చేశారు. చేపప్రసాదం కోసం వచ్చిన వారిలోనూ తెలుగు రాష్ట్రాల వారి కంటే ఉత్తరాది రాష్ట్రాల ప్రజలే ఎక్కువ సంఖ్యలో కనిపించారు.సేవలందించిన స్వచ్ఛంద సంస్థలు

చేప ప్రసాదం పంపిణీ కోసం మొత్తం 32 కౌంటర్లను, టోకెన్లు అందజేసేందుకు మరో 40 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంత్‌నిరంకారీ గ్రూపు, ఉత్తరభారత్‌ నాగరిక్‌ సంఘ్, పంజాబీ సేవాదళ్, హైదరాబాద్‌ దేశ్‌పాల్‌ సమితి, బద్రీ విశాల్‌ పన్నాలాల్‌ ట్రస్ట్, అగర్వాల్‌ సేవాదళ్, గౌడ విద్యార్థి సంఘాలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు సేవలంద జేశారు. క్యూలైన్ల వద్ద ప్రతి ఒక్కరికీ చేపపిల్లలు, ప్రసాదం లభించే విధంగా జాగ్రత్తలు చేపట్టారు. ఆస్తమా బాధితులకు, వారి బంధు మిత్రులకు ఉచితంగా ఆహారం, మంచినీరు అందజేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఉదయం ప్రారంభోత్సవ సమయంలోనూ సాయంత్రం 4 గంటలకు రెండుసార్లు వచ్చి ఏర్పాట్లను పర్య వేక్షించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ తదితరులు చేప ప్రసాద పంపిణీ ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు.4 కేంద్రాల్లో మరో రెండు రోజులు చేప ప్రసాదం

మృగశిర కార్తె ప్రారంభం రోజున ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం స్వీక రించని వారికి బత్తిని సోదరులు నగరంలోని నాలుగు కేంద్రాల్లో చేప ప్రసాదాన్ని అందజేస్తారు. మరో రెండు రోజులపాటు ఈ కేంద్రాలు పనిచేస్తాయి. నగరంలోని కూకట్‌ పల్లి, కవాడిగూడ, వనస్థలిపురం, పాత బస్తీలో ప్రసాదాన్ని పంపిణీ చేస్తామని బత్తిని హరినాథ్‌ గౌడ్‌ పేర్కొన్నారు. నాలుగు తరాలుగా తమ వంశం చేప మందును అందజేస్తోందని చెప్పారు. ఈ ప్రసాదాన్ని మూడు రకాలుగా తయారు చేసి ఇస్తున్నా మని పేర్కొన్నారు. మాంసాహారులకు చేప ప్రసాదం, శాకాహారులకు బెల్లం ప్రసాదం, ఈ రెండూ తీసుకోనివారికి కార్తీక ప్రసాదం ఇస్తామని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top