తొలివిడత సర్పంచ్‌ అభ్యర్థులు 23,229 మంది 

First phase of Sarpanch candidates was 23229 - Sakshi

వార్డు మెంబర్ల అభ్యర్థులు 93,501 మంది  

వివరాలు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల సంఘం 

సాక్షి, హైదరాబాద్‌: గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 4,468 సర్పంచ్‌ పదవులకు 23,229 మంది అభ్యర్థులు, 39,822 వార్డు స్థానాలకు 93,501 మంది బరిలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) తెలిపింది. ఈ మేరకు సర్పంచ్, వార్డుసభ్యుల నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు వెల్లడించింది. తొలిదశ ఎన్నికల్లో 4,479 పంచాయతీల్లో ఎన్నికల నోటీసులు జారీచేయగా, వివిధ జిల్లాల్లోని 11 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదని పేర్కొంది. 39,822 వార్డుమెంబర్‌ స్థానాలకు ఎన్నికల నోటీసులు జారీ చేయగా, 206 వార్డుమెంబర్‌ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదని తెలిపింది.  

నేడు మూడు జిల్లాల్లో నాగిరెడ్డి పర్యటన 
రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) కమిషనర్‌ వి.నాగిరెడ్డి శనివారం సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో పర్యటిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి సిద్దిపేట చేరుకుని ఉదయం 10–11 గంటల మధ్యలో అక్కడ గ్రామపంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై ఆ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారులు, సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌తో నాగిరెడ్డి సమీక్ష నిర్వహిస్తారు. తర్వాత 11.45 నుంచి 12.30 గంటల వరకు సిరిసిల్లలో ఆ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీతో కలసి పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను ఆయన సమీక్షిస్తారు. మధ్యాహ్నం 1.15 నుంచి 4 గంటల వరకు జగిత్యాల జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకు ఆ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారులు, ఎస్పీతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి సమీక్ష నిర్వహిస్తారు. తర్వాత ఎన్నికల సిబ్బందికి నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రికి హైదరాబాద్‌కు తిరిగి వస్తారు.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top