‘విద్యార్థులు చెల్లించే ఫీజులను ఇకపై నగదు రూపంలో వసూలు చేయడానికి వీల్లేదు. ఆన్‌లైన్ ద్వారానే ఆయా ఫీజులను వసూలు చేయాలి.
నగదు రూపంలో తీసుకుంటే గుర్తింపు రద్దు: ఏఐసీటీఈ
సాక్షి, హైదరాబాద్: ‘విద్యార్థులు చెల్లించే ఫీజులను ఇకపై నగదు రూపంలో వసూలు చేయడానికి వీల్లేదు. ఆన్‌లైన్ ద్వారానే ఆయా ఫీజులను వసూలు చేయాలి. ఏదైనా కాలేజీ యాజమాన్యం నగదు రూపంలో ఫీజులు వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు. అవసరమైతే విద్యా సంస్థ గుర్తింపును రద్దు చేస్తాం...’ అని పేర్కొంటూ అఖిలభారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఉత్త ర్వులు జారీ చేసింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ ఉత్తర్వులిచ్చింది. ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కాలేజీల్లో చేరే విద్యా ర్థుల నుంచి నగదు రూపంలో ఫీజులను వసూలు చేయవద్దని ఏఐసీటీఈ మెంబర్ సెక్రటరీ అలోక్ ప్రకాష్ మిట్టల్ అన్ని యూనివర్సిటీలు, కాలేజీలకు ఆదేశాలిచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిజిటల్ లావాదేవీలæ రూపంలోనే ఫీజులను వసూ లు చేయాలన్నారు. అవి కూడా కోర్సులకు సంబంధించిన అన్ని సంవత్సరాల ఫీజు లను ఒకేసారి వసూలు చేయవద్దని స్పష్టం చేశారు. ప్రస్తుత సంవత్సరంలో ప్రస్తుత సెమిస్టర్‌కు సంబంధించిన ఫీజులనే వసూలు చేయాలని తెలిపారు.
పాతనోట్లు తీసుకున్నా చర్యలు
మరోవైపు కొన్ని యాజమాన్యాలు విద్యార్థులకు సంబంధించిన అన్ని సంవత్సరాల ఫీజులను వసూలు చేస్తున్నాయని, అదీ పాత రూ.500, రూ.1,000 నోట్లు తీసుకుం టున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పాత నోట్లను తీసుకోవడానికి వీల్లేదని, ఈ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు చేపడతామని, అవసరమైతే కాలేజీ గుర్తింపును రద్దు చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు వర్సిటీలు, కాలేజీల్లోనూ అన్ని లావా దేవీలు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చేయాలని హెచ్చార్డీ శాఖ స్పష్టం చేసింది.
ఆన్‌లైన్ ఫిర్యాదులు
2017–18 విద్యా సంవత్సరంలో కాలేజీల అనుమతులకు సంబంధించిన ఫిర్యా దులు, విజ్ఞప్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించేందుకు ఏఐసీటీఈ చర్యలు చేపట్టింది. దీనికి సంస్థ వెబ్‌సైట్‌లో ఇచ్చిన http://www.aicte-india.org/apformEmail.php ప్రత్యేక లింక్ ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు తమ ఫిర్యాదులు పంపించాలని సూచించింది.