వ్యవసాయ శాస్త్రవేత్తగా రైతు బిడ్డ 

A Farmer's Child as an Agronomist - Sakshi

పల్లిపాడు యువతికి ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌లో అవకాశం

కొణిజర్ల: సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆ యువతి ప్రతిష్టాత్మక సంస్థలో కొలువు సాధించింది. ఏఆర్‌ఎస్‌ పరీక్షలో దేశవ్యాప్తంగా నాలుగో ర్యాంకు సాధించి ఢిల్లీలోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌లో శాస్త్రవేత్తగా ఎంపికైంది. కొణిజర్ల మండలం పల్లిపాడుకు చెందిన కంచేటి మృణాళిని ఈ ఘనత సాధించింది. జాతీయ స్థాయిలో అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ సైంటిస్ట్‌ ఆగ్రోనమీ విభాగంలో ఎనిమిది పోస్టులకు అవకాశం ఉండగా, అందులో జనరల్‌ కేటగిరీలో నాలుగు పోస్టులు మాత్రమే ఉంటాయి. ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువతీ యువకులు పోటీ పడుతుంటారు. ఈ పోస్టు ఎంపిక కోసం గ్రూప్స్‌ పరీక్ష మాదిరిగానే ప్రిలిమ్స్‌ , మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటాయి. ఈ పరీక్ష గతేడాది జూన్‌లో నిర్వహించగా ఈ ఏడాది మేలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి విడుదలయిన ఫలితాల్లో కంచేటి మృణాళిని ఆగ్రోనమీ విభాగంలో నాలుగో స్థానం సాధించి ప్రతిష్టాత్మకమైన కొలువు సాధించింది.  

మొదటి నుంచి అత్యుత్తమ ప్రతిభే..
పల్లిపాడుకు చెందిన కంచేటి వెంకటేశ్వరరావు, శేషారత్నం దంపతుల కుమార్తె అయిన మృణాళిని బాల్యం నుంచే చురుకుగా ఉండేది. తల్లి దండ్రులు ఉన్న కొద్దిపాటి భూమి వ్యవసాయం చేస్తూ చూసిన ఆమెకు వ్యవసాయం ఆసక్తి కలిగి అగ్రికల్చర్‌ బీఎస్‌సీలో చేరింది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఏజీ బీఎస్‌సీ పూర్తి చేసి బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో ఎంఎస్సీ అగ్రికల్చర్‌ పూర్తి చేసింది. ఎంఎస్సీ ఆగ్రోనమీ విభాగంలో 92 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. అనంతరం కడపలోని బద్వేలు వ్యవసాయ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఏడాది కాలం పని చేసింది. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆగ్రోనమీలో పీహెచ్‌డీ చేసి విశ్వవిద్యాలయ స్థాయిలో అగ్రగామిగా నిలిచింది. అత్యంత ప్రతిష్మాత్మక మైన జాతీయ స్థాయి ఆగ్రోనమీ శాస్త్రవేత్తగా మృణాళిని ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెను గ్రామస్తులు అభినందించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top