
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజారవాణాకు గుండెకాయలా ఉన్న టీఎస్‌ఆర్టీసీకి జవసత్వాలు కల్పించేందుకే నిపుణుల కమిటీని వేసినట్లు రవాణా మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఇక్కడి బస్‌భవన్‌లో మంత్రి అధ్యక్షతన నిపుణుల కమిటీ సమావేశం జరిగింది. సమాశంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ, నిపుణుల కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మంత్రి మాట్లాడుతూ సంస్థలోని లోపాల అధ్యయనానికి, సమూల మార్పులకు, లాభాలబాట పట్టించేందుకు కమిటీ పలు సూచనలు చేస్తుందని పేర్కొన్నారు. నష్టాల ఊబిలో చిక్కుకుపోయిన ఆర్టీసీని బలోపేతం చేయడం, కాలానుగుణం గా మార్పులు చేయడం, ఖర్చులు తగ్గించుకోవడం తదితర విషయాల్లో చేపట్టాల్సిన సంస్కరణల గురించి కమిటీ సిఫారసు చేస్తుందని చెప్పారు. త్వరలోనే కమిటీ సభ్యులు సీఎంను కలవనున్నట్లు తెలిపారు.
చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ సంస్థను రుణభారం నుంచి గట్టెక్కించేందుకే కమిటీ ఏర్పాటుకు సీఎం ఆదేశాలిచ్చారన్నారు. సునీల్‌శర్మ మాట్లాడుతూ త్వరలోనే గ్రేటర్‌లో సింగిల్ టికెట్ విధానంతో మెట్రో– ఆర్టీసీని అనుసంధానించే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఆర్టీసీ ఆదాయ మార్గాలు పెంచుకునేందుకు అన్ని మార్గాలను వినియోగించుకుంటున్నామన్నారు. సంస్థ సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఈ కమిటీ కార్మికుల సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని టీఎంయూ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి విజ్ఞప్తి చేశారు.
కమిటీ సభ్యులు ఏమన్నారంటే..?
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు సురక్షితమైన రవాణాను కోరుకుంటున్నారని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆధునిక, ఆకర్షణీయమైన బస్సులను నడపాలన్నారు. ఉరుకులు, పరుగుల జీవితంలో డిమాం డ్‌కు సరిపడా బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. సురక్షిత ప్రయాణమంటే ఆర్టీసీ అనే అభిప్రాయం ప్రజల్లో ఇప్పటికీ ఉన్నందున దాన్ని కాపాడుకోవాలన్నారు. ప్రజలు అధిక చార్జీలు వెచ్చించి ఆటోలు, క్యాబ్‌ల్లో రక్షణ లేని ప్రయాణం చేస్తున్నారని వాపోయారు. ప్రైవేటు రంగ పోటీని తట్టుకునేందుకు ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని తెలిపారు.