రాష్ట్రంలో మళ్లీ క్షయ కాటు

Every year 2,500 people die with Tuberculosis - Sakshi

     ఏటా 45 వేల కొత్త కేసుల నమోదు

     ప్రతి సంవత్సరం 2,500 మంది మృత్యువాత

     రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై కేంద్రం మండిపాటు

     నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పదేళ్ల క్రితమే అంతరించిందనుకున్న క్షయ (ట్యుబర్‌కులోసిస్‌) మళ్లీ విజృంభిస్తోంది. ఏటా ప్రతి లక్ష మందిలో 119 మంది టీబీ బారినపడుతుండగా ప్రతి సంవత్సరం దాదాపు 2,500 మంది మరణిస్తున్నారు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 45,315 మందికి ఈ వ్యాధి సోకింది. క్షయ రోగులలో ఎక్కువ మంది పేదలే ఉంటున్నారు. రోగులను గుర్తించకపోవడం వల్లే వ్యాధి నియంత్రణ సాధ్యం కావడంలేదు. క్షయ నియంత్రణ కోసం ఏటా రూ. 20 కోట్లు ఖర్చు చేస్తున్నా ప్రాణనష్టం మాత్రం తగ్గడంలేదు.

క్షయ నియంత్రణ చర్యల విషయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తీరును కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తప్పుబట్టింది. 2016లో దాదాపు 34,800 కేసులను రాష్ట్ర యంత్రాంగం నమోదు చేయలేదని నిర్ధారించింది. 1,376 క్లినిక్‌లు, 1,613 ఆస్పత్రులు, 437 పరీక్ష కేంద్రాలు కలిపి రాష్ట్రంలో 3,426 ప్రైవేటు వైద్య కేంద్రాలు ఉన్నాయి. వాటిలో ఏ నిర్ధారించిన టీబీ కేసులలో ఒక్క దానిని సైతం ప్రభుత్వం ఆన్‌లైన్‌ వ్యవస్థలో నమోదు చేయలేదని విమర్శించింది. ఈ విషయంలో ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

టీబీ నివారణపై కేంద్రం ఆదేశాలు...  
- క్షయ రోగులు వ్యాధి తగ్గే వరకు కచ్చితంగా మందులు వేసుకునేలా చర్యలు తీసుకోవాలి.          
- కొత్తగా క్షయ బారిన పడుతున్న వారికి మెరుగైన మందులివ్వాలి.
- గిరిజన ప్రాంతాల్లోని క్షయ బాధితులకు ఔషధాలతోపాటు చికిత్స పొందుతున్న రోజుల్లో నెలకు రూ. 750 చొప్పున ఆర్థిక సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి.
- క్షయ నివారణ చర్యల్లో చురుగ్గా పనిచేసే సిబ్బందికి రూ. వెయ్యి చొప్పున ప్రోత్సాహకం అందించాలి. అలాగే రోగులు పూర్తిస్థాయిలో మందులు వాడేలా ప్రోత్సహించే సిబ్బందికి రూ. 1,500 చొప్పున, వ్యాధి తిరగబెట్టిన రోగులు పూర్తిస్థాయిలో మందులు వాడేలా చూసే సిబ్బందికి రూ. 5 వేల చొప్పున ప్రోత్సాహకం అందించాలి.
- రోగులను గుర్తించిన ప్రైవేటు ఆస్పత్రికి రూ. 100 చొప్పున, ఆ రోగికి చికిత్స అందిస్తే రూ. 500 చొప్పున ఇచ్చే నగదు పురస్కారంపై అందరికీ అవగాహన కల్పించాలి.
- జాతీయ క్షయ నివారణ సంస్థలో ఖాళీగా ఉన్న 17 రాష్ట్రస్థాయి పోస్టులను, జిల్లాల స్థాయిలో ఖాళీగా ఉన్న 222 పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top