వ్యవసాయ మార్కెట్లలో ఈ–సేవలు 

E-Seva in agricultural markets - Sakshi

     ఇక వ్యవహారాలన్నీ ఆన్‌లైన్‌లోనే.. 

     అమలులోకి తెచ్చేందుకు మార్కెటింగ్‌శాఖ సన్నాహాలు 

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ మార్కెట్లలో ఇక నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ఈ–సేవలను అందించేందుకు మార్కెటింగ్‌శాఖ నడుం బిగించింది. మార్కెట్లలో మరింత పారదర్శకత, జవాబుదారీ తనం, వేగం పెంచేందుకు ఈ చర్య చేపడుతున్నట్లు మార్కెటింగ్‌శాఖ వర్గాలు తెలిపాయి. ఈ–సేవలకు సంబంధించి మార్కెట్‌ కమిటీ అధికారులు, సిబ్బందికి హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చా రు. వ్యాపారులకు కూడా శిక్షణ ఇస్తున్నారు.  

యాప్‌ ద్వారానే లైసెన్స్‌... 
వ్యాపారులకు లైసెన్స్‌లు, ఎగుమతుల పర్మిట్ల జారీ కోసం మార్కెటింగ్‌ శాఖ ప్రత్యేకంగా ‘ఈ–సర్వీసెస్‌’ పేరుతో మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తోంది. ఈ యాప్‌ ద్వారా రూ. 100 చెల్లిస్తే లైసెన్సు దరఖాస్తు తెరుచుకుంటుంది. దరఖాస్తును నింపి తిరిగి అప్లోడ్‌ చేసిన తర్వాత లైసెన్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం ఈ దరఖాస్తు సంబంధిత మార్కెట్‌ కమిటీ కార్యదర్శి వద్దకు వెళుతుంది. ఆయన పరిశీలించిన తర్వాత రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్‌కు పంపుతారు. డైరెక్టర్‌ ఆమోదంతో మార్కెట్‌ కార్యదర్శి డిజిటల్‌ సంతకంతో కూడిన లైసెన్స్‌ సర్టిఫికేట్‌ను మంజూరు చేస్తారు. ఇలా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు ఆమోదం పొందటంతో సమయం, వ్యయం తగ్గుతుంది.  

అన్నీ ఆన్‌లైన్‌లోనే... 
కేవలం లైసెన్సులే కాకుండా కమీషన్‌ ఏజెంట్‌ లైసెన్సులు, మార్కెట్‌ ఫీజు వసూళ్లు, ఎగుమతుల పర్మిట్లు, రాస్తామాల్‌ వసూళ్లన్నీ ఆన్‌లైన్‌లోనే నమోదు చేసే వీలుంటుంది. వ్యాపారి ఖరీదులు ఎంతుంటాయో అంత సరుకుకే ఆన్‌లైన్‌ ద్వారా ఎగుమతుల పర్మిట్‌ లభిస్తుంది. ఈ సేవలు అమలైతే చెక్‌పోస్టుల వద్ద నగదు వసూళ్లన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. అలాగే క్యూఆర్‌ కోడ్‌తో కూడిన ఎగుమతుల పర్మిట్లు, చెక్‌పోస్టు చెల్లింపుల రశీదులను జారీ చేస్తారు. దీని వల్ల నకిలీ రశీదులను సృష్టించే అవకాశమే ఉండదు.

మార్కెట్లో నిత్యం జరిగే వ్యాపార లావాదేవీలన్నింటికీ తక్‌పట్టీల ద్వారా ఈ–సేవల్లో ఎప్పటికప్పుడు మార్కెట్‌ ఫీజు లెక్కిస్తారు. ప్రస్తుతం జారీ చేసే లైసెన్సులతో రాష్ట్రంలో ఏ మార్కెట్లోనైనా ఖరీదులు చేసే వీలుంది. ఏ మార్కెట్లో ఖరీదు చేసినా ఆన్‌లైన్‌లో ఎక్కడ ఫీజు చెల్లించినా సదరు వ్యాపారి పేరిట మార్కెట్‌ ఫీజు ఆయా మార్కెట్‌ కమిటీలకే వెళుతుంది. మార్కెట్లలో ఈ–సేవలు ప్రారంభమైతే పారదర్శకత పెరుగుతుందని మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీబాయి ‘సాక్షి’కి తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top