టీఆర్‌ఎస్‌ లో కొనసాగుతున్న సస్పెన్షన్లు 

Disappointments In TRS - Sakshi

టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న సస్పెన్షన్లు 

ఎన్నికలవేళ రామగుండంలో కలకలం 

అధినేత పర్యటనకు ముందు అలజడి 

పలువురు టీఆర్‌ఎస్, టీబీజీకేఎస్‌ నేతలపై వేటు

సాక్షి, పెద్దపల్లి :  ఎన్నికల సమయంలో రామగుండం టీఆర్‌ఎస్‌లో వేటు పర్వం కొనసాగుతోంది.  పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో టీఆర్‌ఎస్, టీబీజీకేఎస్‌ నాయకులను వరుసగా సస్పెండ్‌ చేస్తుండడం కలకలం సృష్టిస్తోంది. అధినేత కేసీఆర్‌ గోదావరిఖని పర్యటనకు కొన్ని గంటల ముందు పార్టీ ఈ సస్పెన్షన్ల నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

కొనసాగుతున్న సస్పెన్షన్లు 
పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు రామగుండం టీఆర్‌ఎస్‌లో అసమ్మతి వ్యవహారం మరోసారి వెలుగు చూస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో రామగుండం జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, మాజీ మేయర్‌ కొంకటి లక్ష్మీనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్‌ సాగంటి శంకర్‌ సహా 26 మందిని తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మంగళవారం సస్పెండ్‌ చేశారు. ఇదే కారణంతో టీబీజీకేఎస్‌ నాయకులు లక్కాకుల లక్ష్మణ్, జలపతి, అల్లి శంకర్‌లను సస్పెండ్‌ చేస్తున్నట్లు టీబీజీకేఎస్‌ నేత టి.వెంకట్రావు బుధవారం ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గోదావరిఖనికి రానున్న కొద్దిగంటల ముందు సస్పెన్షన్‌ల వ్యవహారం జరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది. రామగుండం నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అసమ్మతికి పెట్టింది పేరు. సంవత్సరాలుగా అసమ్మతి కార్యకలాపాలు చోటుచేసుకుంటుండడం, ప్రతిపక్ష పార్టీలకన్నా... సొంత పార్టీ నాయకులే విమర్శించుకోవడం ఇక్కడ సర్వసాధారణం. తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మాజీ మేయర్‌ కొంకటి లక్ష్మీనారాయణల నడుమ వర్గపోరు గత రెండు సంవత్సరాల నుంచి కొనసాగుతోంది.

మాజీ మేయర్‌ వర్గానికి ఎంపీ బాల్క సుమన్‌ మద్దతుందనే ప్రచారమూ జరిగింది. నగరపాలకసంస్థ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో అసమ్మతి ప్రత్యక్షపోరుకు కారణమైంది. టీఆర్‌ఎస్‌ నుంచే రెండు వర్గాలు పోటీపడగా, ఎమ్మెల్యే వర్గం పైచేయి సాధించింది. ఈ క్రమంలోనే అప్పటి మేయర్‌ లక్ష్మీనారాయణపై సోమారపు వర్గం అవిశ్వాసం ప్రకటించి పదవి నుంచి దింపేయించింది. అవిశ్వాసం సమయంలో పార్టీ అధిష్టానాన్ని సైతం తనతో వచ్చేట్లు చేయడంలో సోమారపు సఫలమయ్యారు. అవిశ్వాసాన్ని నిలిపివేయాలన్న అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకించి, ఏకంగా ఆర్టీసీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. చివరకు అధిష్టానం అంగీకరించడంతో లక్ష్మీనారాయణను పదవి నుంచి దింపి తనపంతం నెగ్గించుకున్నారు. గత ఎన్నికల తరహాలోనే ఉద్యమనాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కోరుకంటి చందర్‌ టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించారు. ఈ సారికూడా సిట్టింగ్‌లకే టికెట్‌ దక్కడంతో చందర్‌ ఆల్‌ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరో అసమ్మతి నేత పెద్దంపేట శంకర్‌ బీఎస్‌పీ నుంచి రంగంలో ఉన్నారు. రామగుండం జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి రెబల్‌గా పోటీకి సిద్ధపడ్డా.. చివరకు కోరుకంటి చందర్‌కు మద్దతుగా పోటీనుంచి తప్పుకున్నారు.

సోమారపు సత్యనారాయణ, కోరుకంటి చందర్‌లు పోటీపడుతుండడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు కూడా రెండుగా విడిపోయారు. ఇదే సమయంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి కాకుండా, రెబల్‌ అభ్యర్థికి మద్దతునిస్తున్న నాయకులపై పార్టీపరంగా చర్యలు ప్రారంభించారు. జెడ్పీటీసీ సంధ్యారాణి, మాజీ మేయర్‌ లక్ష్మీనారాయణలతో పాటు 26 మంది నాయకులను సోమారపు సత్యనారాయణ పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. బుధవారం టీబీజీకేఎస్‌ నాయకులు ముగ్గురిపై కూడా వేటువేశారు. పార్టీ అభ్యర్థినైన తనకుకాకుండా.. తిరుగుబాటు అభ్యర్థికి మద్దతుగా ఉన్న నాయకులపై పార్టీపరంగా కఠినంగా వ్యవహరించాలనే నిర్ణయంతో సోమారపు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సంవత్సరాలుగా తారాస్థాయిలో ఉన్న అసమ్మతి, కీలక ఎన్నికల వేళ సస్పెన్షన్‌లకు కారణమవుతుండడంతో, మరోసారి అసమ్మతిపై విస్తృతంగా చర్చ సాగుతోంది.   

 నియోజకవర్గ చరిత్ర కోసం మరిన్ని వార్తలు...  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top