బతికి వస్తామనుకోలె..! 

Devipatnam Boat Capsize Victim With Sakshi

అంతా పది నిమిషాల్లోనే జరిగిపోయింది 

‘సాక్షి’తో బోటు ప్రమాదం నుంచి బయటపడిన బస్కే దశరథం 

కాజీపేట అర్బన్‌: తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం కచ్చులూరు సమీపంలో ఆదివారం బోటు బోల్తా పడిన ఘటనలో కడిపికొండ గ్రామానికి చెందిన 14 మందిలో ఐదుగురు సురక్షితంగా బయటపడిన విషయం విదితమే. ఈ మేరకు అక్కడి రంపచోడవరం ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం ఆ ఐదుగురిని అధికారులు హన్మకొండ తీసుకొచ్చి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో మంగళవారం చికిత్స చేయిస్తున్నారు. ఈ సందర్భంగా ఐదుగురిలో ఒకరైన బస్కే దశరథంను మంగళవారం ఉదయం ‘సాక్షి’పలకరించగా ప్రమాద ఘటన వివరాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..  కడిపికొండ నుంచి 14 మంది శుక్రవారం రాత్రి గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి రాజమండ్రి చేరుకున్నాం.  ఆది వారం ఉదయం పోచమ్మగుడి వద్ద నుంచి పాపికొండల సందర్శనకు బయలుదేరాం. మొదట్లోనే బోటు నిర్వాహకులు లైఫ్‌ జాకెట్లు ఇచి్చనా.. ఉక్కపోతగా ఉందని చెప్పడంతో ‘పర్వాలేదు తీసివేయండి.. డేంజర్‌ జోన్‌ రాగానే చెబుతాం.. అప్పుడు వేసుకోవచ్చు’అన్నారు. పోచమ్మ గుడి నుంచి కొంత దూరం ప్రయాణం చేయగానే పోలీసు అధికారులు రావడంతో తిరిగి లైఫ్‌ జాకెట్లు వేసుకున్నాం. వారు వెళ్లగానే తీసివేశాం. ఇంతలో బోటు కచ్చులూరు సమీపంలోని డేంజర్‌ జోన్‌కు చేరుకుంది. ఆ విషయాన్ని బోటు నిర్వా హకులు చెప్పలేదు. తీరా ఘటనా స్థలం రాగానే అనౌన్స్‌ చేస్తుండగానే బోటు బోల్తా కొట్టింది. 

మాకు లైఫ్‌ జాకెట్లు దొరికాయి 
బోటు ఒక్కసారిగా నీట మునగడంతో నీళ్లలో పడిన మాపై బోటు పైభాగంలో ఉన్న కూర్చున్న వారు, చైర్లు ఒక్కసారిగా మీదపడ్డాయి. అలాగే, అందరూ పక్కన పెట్టిన లైఫ్‌ జాకెట్లు కూడా పడటంతో మేం దొరకపట్టుకున్నాం. బోటుకు ఓ వైపు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటం.. మరో వైపు 60 నుండి 70 మీటర్ల దూరంలో ఒడ్డు ఉండటంతో లైఫ్‌ జాకెట్ల సాయంతో నాతోపాటు బస్కే వెంకటస్వామి, గొర్రె ప్రభాకర్, ధర్శనాల సురేష్‌, అరెపల్లి యాదగిరి ఈదడం మొదలుపెట్టాం. మాతో పాటు  టూర్‌కు వచ్చిన బస్కే అవినాష్‌ను దర్శనాల సురేష్‌ లైఫ్‌ జాకెట్‌ సాయంతో కాపాడాలని యత్నించాడు. కానీ అప్పటికే బోటు బోల్తా పడి నీళ్లలో పడిన ఆందోళనతో అవినాష్‌ నీళ్లు తాగడంతో మా నుంచి దూరమయ్యాడు. లైఫ్‌ జాకెట్‌ దొరకడంతో బస్కే రాజేందర్‌కు అందించాను. నడుముకు ట్యూబ్‌ కట్టుకుని  వెళ్లూ అని అరుస్తున్నా ఈత రాకపోవడంతో గోదావరిలో మునిగిపోయాడు.  నా సునీల్‌ అల్లుడు చాలా మంచి ఈత గాడు. అయినా లైఫ్‌ జాకెట్‌ లేకపోవడం.. వరద ఉధృతంగా ఉండడంతో మునిగిపోయాడని ఆరెపల్లి యాదగిరి చెప్పాడు. 


అవినాష్‌ అంతిమయాత్రలో రోదిస్తున్న తల్లి  

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కడిపికొండ వాసులను విషాదఛాయలు వీడలేదు.  తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకున్న బోటు దుర్ఘటనలో కడిపికొండకి చెందిన 14 మంది చిక్కుకోగా వారిలో ఐదుగురు బయటపడ్డారు. ఐదుగురి మృతదేహాలు బయటపడ్డాయి. ఈ మేరకు బస్కె అవినాష్‌ బస్కే రాజేందర్‌ మృతదేహాలు సోమవారం అర్ధరాత్రి చేరుకోగా మంగళవారం అంత్యక్రియలు పూర్తిచేశారు. అలాగే, సిద్ది వెంకటస్వామి, గడ్డమీది సునిల్, గొర్రె రాజేందర్‌ మృతదేహాలు మంగళవారం రాత్రికి చేరుకుంటాయని అధికారులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top