దండకారణ్యానికి రహదారి మాల! 

Development Programs In Maoist Hit Areas In Telangana Border - Sakshi

మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో కేంద్రప్రభుత్వం అభివృద్ధి పనులు

తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలను కలుపుతూ రహదారులు

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో తీవ్రవాద భావజాలాన్ని తగ్గించడానికి అభివృద్ధే అసలైన ఔషధం. విద్య, వైద్యం, ప్రభుత్వ పథకాలు అందితే వారిలో మార్పు తీసుకురావచ్చు. ఇదే సూత్రాన్ని తెలంగాణలో కేంద్రం అమలు చేస్తోంది. అందుకే, మావోయిస్టు ప్రాబల్య మారుమూల దండకారణ్యాల్లోనూ రోడ్లను వేగంగా నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు  కలసి రూ.1,300 కోట్ల నిధులతో 1,300 కి.మీ.ల దూరం మేర మూడు రాష్ట్రాల దండకారణ్యాలు, మారుమూల గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేసేందుకు ప్రత్యేక ప్రాజెక్టును అమలు చేస్తున్నాయి. కిలోమీటరు రోడ్డుకు రూ.కోటి ఖర్చు చేస్తున్నాయి. 

పథకాలు చేరువ చేయడానికి.. 
తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ ఈ మూడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆది నుంచి మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అన్ని రంగాల్లో వెనకబడ్డ ఈ మూడు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలకు విద్య, వైద్యం, ప్రభుత్వ పథకాలను చేరువ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఈ మూడు రాష్ట్రాలు భౌగోళికంగా కలసే ప్రాంతాలను ఎంపిక చేసింది. 

3 రాష్ట్రాల్లోని 8 జిల్లాలను కలుపుతూ.. 
ఉత్తర తెలంగాణ, ఆగ్నేయ మహారాష్ట్ర, నైరుతి ఛత్తీస్‌గఢ్‌ పరిధిలో ఉన్న దండకారణ్యాల్లో 1,300 కి.మీ. మేర రోడ్ల నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఈ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. దీంతోపాటు మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, దంతెవాడ జిల్లాలను కలిపేందుకు రోడ్ల కోసం రూ. 1,300 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రాజెక్టులో భాగంగా 550 కి.మీ. మేర పనులకు నిధులు విడుదల కాగా, పనులు కూడా మొదలయ్యాయి.  20 రోడ్లు, 18 బ్రిడ్జిలు నిర్మించనున్నారు. ఇక మిగిలిన 750 కి.మీ.లకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారీ పనులు సాగుతున్నాయి. దీనికి ఆమోదం లభించగానే..ఆ పనులు కూడా మొదలవుతాయి. 

గోదావరిపై మూడు వారధులు.. 
ఈ రోడ్ల నిర్మాణంలో భాగంగా 3 భారీ వంతెనలు కూడా నిర్మించాల్సి ఉంది. అవి పర్ణశాల (భద్రాద్రి కొత్తగూడెం), ముక్కనూరు (జయశంకర్‌ భూపాలపల్లి) వంతెనలను గోదావరి నదిపై నిర్మించనున్నారు. ఇక గోదావరికి ఉపనది అయిన మానేరుపై ఆరింద(పెద్దపల్లి) వద్ద భారీ వంతెనలను నిర్మిస్తారు. ఈ 3 కూడా కి.మీకు పైగా పొడవుంది. వీటి నిర్మాణానికి అనుమతులు కూడా వచ్చాయి. మూడు రాష్ట్రాలను కలపడంలో ఈ వంతెనలు కీలక పాత్ర పోషిస్తాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top