కూతురి హింస ... వృద్ధుల ఆత్మహత్యాయత్నం | Daughter torture ... elderly suicide attempt | Sakshi
Sakshi News home page

కూతురి హింస ... వృద్ధుల ఆత్మహత్యాయత్నం

Apr 11 2017 1:35 AM | Updated on Sep 5 2017 8:26 AM

కూతురి హింస ... వృద్ధుల ఆత్మహత్యాయత్నం

కూతురి హింస ... వృద్ధుల ఆత్మహత్యాయత్నం

డబ్బుల కోసం కూతురు పెడుతున్న వేధింపులు భరించలేక సోమవారం ఓ వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు.

- భర్త మృతి.. చావుబతుకుల్లో భార్య
- పురుగుల మందు తాగి.. కిటికీకి ఉరి వేసుకున్న భర్త


హసన్‌పర్తి(వర్దన్నపేట): డబ్బుల కోసం కూతురు పెడుతున్న వేధింపులు భరించలేక సోమవారం ఓ వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో భర్త మృతి చెందగా.. భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఏటూరు నాగారం ప్రాంతానికి చెందిన రత్నం సత్యనారాయణరెడ్డి (70), తిరుపతమ్మ(65) దంపతులు వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తి మండలం పలివేల్పులలో స్థిరపడ్డారు. సత్యనారాయణ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవాడు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. కొంతకాలంగా  తండ్రిని కూతురు శ్రీదేవి, అల్లుడు శివకుమార్‌లు డబ్బుల విషయంలో  వేధింపులకు గురిచేస్తున్నారు. దీనిపై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది.

ఈ నేపథ్యంలో సత్యనారాయణ రెడ్డి దంపతులు సోమవారం పురుగుల మందు తాగారు.తొలుత తిరుపతమ్మ వాంతులు చేసుకుంది. తనకూ అలాగై  బతికేస్తానేమోనని భావించిన సత్యనారాయణ రెడ్డి కిటికీకి ఉరి వేసుకున్నాడు. అంతకు ముందు అతను సమీప బంధువు రమేశ్‌రెడ్డికి ఫోన్‌ చేసి ఉదయం 11.30 గంటలకు ఇంటికి రమ్మని, హైదరాబాద్‌ నుంచి తన కుమారుడు శ్రీధర్‌ కూడా వస్తున్నట్లు చెప్పాడు. మాటల్లో ఏదో తేడా కనిపించడంతో రమేశ్‌రెడ్డి దంపతులు హుటాహుటిన ఆనంద్‌నగర్‌కాలనీకి చేరుకున్నారు. దంపతులు బయట నుంచి తాళం వేసి.. తాళం చెవిని బాత్‌రూం వద్ద పెట్టారు.

ఈ విషయాన్ని రమేశ్‌రెడ్డికి ముందుగానే ఫోన్‌లో చెప్పారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చేసరికి తిరుపతమ్మ చావుబతుకుల మధ్య కనిపించింది. ఆమెను వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దంపతులు కలెక్టర్, జిల్లా న్యాయమూర్తి, నగర పోలీస్‌ కమిషనర్, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్లతో పాటు మరో నలుగురికి లేఖ రాసి పెట్టారు. తమ మరణానికి తమ కూతురు శ్రీదేవి, అల్లుడు శివకుమార్, కుమార్తె స్నేహితురాలు ఆర్‌.శ్రీదేవి, ఉపాధ్యాయురాలు వినీత కారణమని పేర్కొన్నారు. వీరితో పాటు పంచాయితీ పెద్దలుగా వ్యవహరించిన సదానందం, సమ్మయ్య కూడా కారకులని మృతుడి కుమారుడు శ్రీధర్‌ తెలిపాడు. ఈ మేరకు పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement