సీఎస్‌ వర్సెస్‌ డీఓ

CS Versus Do In Tenth Class Exams At Warangal - Sakshi

చెల్పూరు ఎస్సెస్సీ పరీక్ష కేంద్రంలో అధికారుల వాగ్వాదం 

మాస్‌కాపీయింగ్‌పై దుర్భాషలాడుకున్న వైనం 

విచారణ అనంతరం డీఓపై వేటు వేసిన డీఈఓ 

గణపురం(భూపాలపల్లి) : గణపురం మండలంలోని చెల్పూరు çపదో తరగతి పరీక్ష కేంద్రం నిర్వహణలో చీఫ్‌ సూపరింటెండెంట్‌(సీఎస్‌) ప్రభాకర్‌రెడ్డి, డిపార్టమెంటల్‌ అధికారి(డీఓ)నర్సింహచారి మధ్య గత రెండు రోజులుగా జరుగుతున్న గొడవలు వీధికెక్కాయి. పరీక్ష కేంద్రంలో ఒకరినొకరు దూషించుకుంటూ దాడి చేసుకునేందుకు యత్నించడంతో పరీక్షలు రాసే విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వివరాలిలా ఉన్నాయి.. ఈ నెల 16న పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాగా గణపురం మండల కేంద్రంలో రెండుసెంటర్లతోపాటు చెల్పూరు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరో సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 

ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా  జరుగుతున్న పరీక్షల్లో సీఎస్‌ ప్రభాకర్‌రెడ్డి మొదటి రోజు నుంచి సెంటర్‌లో మాస్‌  కాపీయింగ్‌ నడుస్తున్నా పట్టించుకోవడం లేదని డీఓ నర్సింహచారి ఆరోపిస్తూ గొడవకు దిగుతున్నుట్ల సమాచారం. అందులో భాగంగా సోమవారం ఇంగ్లిష్‌ మొదటి పేపర్‌ పరీక్ష జరుగుతుండగా పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్‌ చేతిలో చిట్టీ ఉండడం గమనించిన డీఓ ఆమె చేతిని లాక్కొని సీఎస్‌ వద్దకు తీసుకెళ్లాడు. అయితే ఈ పెనుగులాటలో ఆమె చేతులకు ఉన్న గాజులు పగిలిపోయి గాయాలయ్యాయి. విద్యాసంస్థల యాజమాన్యాల వద్ద« డబ్బులు తీసుకుంటూ మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్నారంటూ సీఎస్‌ ప్రభాకర్‌రెడ్డితో డీఓ నర్సింహచారి గొడవకు దిగారు. 

రెండు రోజులపాటు పరీక్ష కేంద్రంలో ఈ తంతు నడుస్తుండడంతో విషయం తెలుసుకున్న డీఈఓ శ్రీనివాస్‌ రెడ్డి సంఘటనపై విచారణ జరపాలని గణపురం ఎంఈఓ చిలువేరు సురేందర్, వెంటాపురం ఎంఈఓ శాగర్ల అయిలయ్యను ఆదేశించారు. వారిచ్చిన నివేదిక ఆధారంగా డీఓను తొలగిస్తున్నట్లు ఆదేశా>లు జారీచేశారు. ఆయన స్థానంలో కర్కపల్లి పాఠశాల ప్రధానోపాద్యాయుడు భద్రయ్యను నియమిస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. మొత్తానికి సీఎస్, డీఓల మధ్య జరిగిన గొడవతో చెల్పూరు పదో తరగతి పరీక్షా కేంద్రంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే పరీక్ష కేంద్రాల్లోకి బయటి వ్యక్తులు వచ్చి వారి సెల్‌ఫోన్లలో పరీక్ష పత్రాలను ఫొటోలు తీసుకొని వెళ్తున్నారని, మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top