కాంగ్రెస్‌ కూటమికి కామ్రేడ్స్‌ గుడ్‌బై

The CPI goodbye told the Congress coalition - Sakshi

కాంగ్రెస్‌ మిత్రధర్మాన్నిపాటించలేదని మండిపడ్డ సీపీఐ

ఎంపీ ఎన్నికల్లో సీపీఎంతో కలిసి పోటీ చేయాలని నిర్ణయం

టీజేఎస్, జనసేన వంటి పార్టీలతో కలిసి పోటీకి కామ్రేడ్ల ప్రయత్నం

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పడిన ప్రజా కూటమికి సీపీఐ గుడ్‌బై చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఆ తర్వాత స్నేహధర్మాన్ని పాటించడంలో కాంగ్రెస్‌ పూర్తిగా విఫలమైందని కామ్రేడ్లు మండిపడుతున్నారు. మిత్రపక్షాల పట్ల కాంగ్రెస్‌ పూర్తి నిర్లక్ష్య, నిరాసక్త ధోరణిని కనబరుస్తోందని కొంతకాలంగా ఆగ్రహంగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాఫ్రంట్‌ కూటమి ఉనికే ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో కాంగ్రెస్‌తో స్నేహబంధాలు కొనసాగించొద్దని నిర్ణయించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా కలిసొచ్చే వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులను కలుపుకుని వెళ్లాలని సీపీఐ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో వామపక్షాల బలం పెంచుకునేందుకు ఉపయోగపడే వ్యూహాన్ని అనుసరించాలనే ఆలోచనతో ఉంది. ఇందుకోసం సహచర కమ్యూనిస్టుపార్టీ సీపీఎంతో స్నేహసంబంధాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది.

నాయకత్వంపై కామ్రేడ్ల అసంతృప్తి
రాష్ట్ర శాసనసభ ఎన్నికలపుడు కాంగ్రెస్‌ కూటమిలో సీపీఐ, బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) పేరిట సీపీఎం విడిగా పోటీ చేయడం వల్ల ఈ రెండుపార్టీల మధ్య మిత్రత్వం దెబ్బతింది. ఆ ఎన్నికల్లో వామపక్ష పార్టీలకు దారుణమైన పరాజయం ఎదురవడం.. తొలిసారి కమ్యూనిస్టుల్లేని అసెంబ్లీ ఏర్పడటంతో కామ్రేడ్లలో అంతర్మథనం మొదలైంది. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్‌తో జతకట్టడంపై సీపీఐలో, బీఎల్‌ఎఫ్‌ ప్రయోగాన్ని ఆచరణలో సరిగా అమలు చేయలేకపోయినందుకు సీపీఎంలో ఆయా పార్టీల రాష్ట్ర నాయకత్వాలపై అంతర్గతంగా విమర్శలు వెల్లువెత్తాయి. కేవలం మూడు సీట్ల కోసం కాంగ్రెస్‌తో పొత్తుకోసం సాగిలపడటంపై సీపీఐ రాష్ట్ర కార్యవర్గభేటీలో పలువురు నేతలు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తంచేశారు.

తీవ్ర విమర్శల నేపథ్యంలో పార్టీ కార్యదర్శి పదవికి రాజీనామా చేసేందుకు చాడ వెంకటరెడ్డి సిద్ధపడి.. చివరినిమిషంలో వెనక్కు తగ్గారు. పార్టీ మౌలిక విధానాలు, సిద్ధాంతాలకు భిన్నంగా బీఎల్‌ఎఫ్‌ తరఫున కులాల ప్రాతిపదికన అభ్యర్థులను పోటీకి నిలబెట్టడం, సీఎం అభ్యర్థిగా బీసీని ప్రకటించడం పట్ల రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీరును సీపీఎం కేంద్రకమిటీ తప్పుబట్టింది. బీఎల్‌ఎఫ్‌ ప్రయోగం కారణంగా రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి మద్దతుగా ఉన్న పైతరగతుల వారు దూరమయ్యారు. దీంతోపాటు ఎవరికోసమైతే బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ను తీసుకొచ్చారో ఆ కింది తరగతుల వారు సంప్రదాయ రాజకీయపార్టీలకే మద్దతివ్వడంతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ప్రత్యామ్నాయం కోసం..
శాసనసభ ఎన్నికల్లో రాజకీయంగా ఊహిం చని ఎదురుదెబ్బ తగలడంతో భవిష్యత్‌లో పార్టీ నిర్మాణంపై ఉభయ కమ్యూనిస్టు పార్టీలు దృష్టిపెట్టాయి. లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం కలిసి పోటీచేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించాయి. కామ్రేడ్ల మధ్య చర్చలు దాదాపుగా కొలిక్కి వచ్చి నట్లు తెలుస్తోంది. రెండుపార్టీలే అన్నిసీట్లకు పోటీచేసే పరిస్థితి లేదు కాబట్టి.. టీజేఎస్, జనసేన, ఎంసీపీఐ తదితర పార్టీలను కలుపుకుని పోవాల నే ఆలోచనతో ఉన్నాయి. ప్రధాన రాజకీయపార్టీల కు ప్రత్యామ్నాయంగా వామపక్ష, లౌకిక, ప్రజా తంత్ర కూటమి ఆలోచనను ప్రజల ముందుంచాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాయి. ఈ వారంలో జరగనున్న సీపీఐ, సీపీఎం మలివిడత చర్చల్లో సీట్ల సర్దుబాటు, ఇతరపార్టీలతో చర్చలకు అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించనున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top