అధికారమే ‘హస్తం’ లక్ష్యం

Congress Target Clean Sweep In Telangana Elections - Sakshi

ప్రణాళికలు రచిస్తున్న కాంగ్రెస్‌

28న జిల్లాలో రెండు భారీ బహిరంగ సభలు 

మొదటి దశలో తాండూరు, వికారాబాద్‌లో పాల్గొననున్న పార్టీ జాతీయ, రాష్ట్ర నేతలు 

సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలో ఎవరో ఒకరు వచ్చే అవకాశం  

రేవంత్‌రెడ్డితో పాటు స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి 

రాష్ట్రంలో అధికారాన్ని ‘హస్త‘గతం చేసుకోవాలనుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ.. అందుకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. నేడు నామినేషన్ల ప్రక్రియ పూర్తికానుండడంతో ప్రచారాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది. జాతీయ, రాష్ట్రస్థాయి నేతలతో పాటుగా ఛరిష్మా ఉన్న నేతలతో ప్రచారం చేయించాలని భావిస్తోంది. ఈనెల 28న వికారాబాద్, తాండూరులో సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

సాక్షి, వికారాబాద్‌: కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ స్థాయిల్లోనే బహిరంగ సభలను నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఎక్కువమందిని తరలించడంతోపాటు నాయ కులు, కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపేందుకు చర్యలు తీసుకుంటోంది. సోమవారం నామినేషన్లు ముగిసిన అనంతరం బహిరంగ సభలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈనెల 23నుంచి రాష్ట్రంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సభలను ఏర్పాటుచేయాలని పార్టీ నిర్ణయించింది.

జిల్లాలోని వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల కేంద్రాల్లో 28న బహిరంగసభలను నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ అధిష్టానం జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థులను ప్రకటించింది. 28న నిర్వహించే సభల్లో సోనియాగాంధీ పాల్గొంటారా.. లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. వచ్చే నెల 2 నుంచి రెండు, మూడు రోజులపాటు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సైతం రాష్ట్రంలో ప్రచారంలో పాల్గొననున్నారు. 

ఈనేపథ్యంలో ఆయన కొడంగల్, పరిగిలో సభలను ఏర్పాటు చేసేందుకు నేతలు చర్యలు తీసుకుంటున్నారు. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి పోటీచేస్తున్న కొడంగల్‌లో నిర్వహించే సభలో రాహుల్‌గాంధీ పాల్గొనే అవకాశం మెండుగా ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈనెల 20 తరువాత రేవంత్‌ తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ప్రచారం నిర్వహించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ప్రచారం ప్రక్రియ వచ్చే నెల 5న ముగిసేవరకు నిత్యం కొనసాగనుంది.

విజయశాంతి ప్రచారం..
కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్, సినీనటి విజయశాంతి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ తదితర ముఖ్యులు ప్రచారంలో పాల్గొనని నియోజకవర్గాల్లో విజయశాంతి ప్రచారం చేసే అవకాశముందని తెలుస్తోంది. అదేవిధంగా మరికొంతమంది స్టార్‌డమ్‌ ఉన్న నేతలు, సినీ, సామాజిక రంగాల ప్రముఖులతో ప్రచారం నిర్వహించేలా పార్టీ నేతలు ప్లాన్‌ చేస్తున్నారు.

అధికార టీఆర్‌ఎస్‌ను ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. ఎన్నికలకు కేవలం 20 రోజులే సమయం ఉన్నందువల్ల ప్రచారంలో దూకుడు పెంచేవిధంగా చర్యలు తీసుకుంటోంది. జిల్లాలోని అన్ని స్థానాల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌.. ప్రచారంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఉండాలని అభ్యర్థులకు సూచిస్తోంది.

అయితే, తాండూరు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రోహిత్‌రెడ్డిపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావుతోపాటు ఆయన వర్గంనేతలను బుజ్జగించే పనిలో పార్టీ పెద్దలు నిమగ్నమయ్యారు. నారాయణరావు ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నా.. ఇతర సీనియర్‌ నాయకులు అభ్యర్థికి సహకరించకపోయినా గెలుపు కష్టమేననే సంకేతాలు ఇప్పటికే పార్టీ అధిష్టానానికి చేరినట్లు నేతలు చెబుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top