
సాక్షి, హైదరాబాద్: మిడ్‌మానేరు ప్రాజెక్టుకింద నిర్వాసితులకు పరిహార మదింపులో మళ్లీ అక్రమాల పర్వం మొదలైంది. అడ్డగోలు అంచనాలతో ముంపు గృహాలకు ఇష్టారీతిన పరిహారం లెక్కగట్టి కోట్ల రూపాయలు దండుకునేందుకు అక్రమార్కులు తెరతీశారు. వీరికి అధికారుల నుంచి సహకారం అందుతుండటంతో కోట్ల రూపాయలు కొట్టేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. గతంలో ఇదే ప్రాజెక్టు కింద పరిహారంలో భారీ అక్రమాలు జరగడంతో 24 మంది అధికారులపై చర్యలు తీసుకున్నారు.
గతం మాదిరే అక్రమాలు..
పూర్వ కరీంనగర్ జిల్లాలో 2.20 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే లక్ష్యంతో 2006లో మిడ్‌మానేరు ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టు కింద మొత్తంగా 13 గ్రామాలు ముంపు ప్రాంతాలుగా తేలగా, ఇందులో 10 గ్రామాల్లోని గృహాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయి. ముంపు కారణంగా 6,829 గృహాలకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 2013 వరకు 3,451 గృహాలకు పరిహారంగా రూ.311 కోట్లు చెల్లించారు.
తర్వాత ఈ ఏడాది 1,413 గృహాలకు మరో రూ.225.78 కోట్ల మేర చెల్లించారు. మరో 1,965 గృహాలకు రూ.250 కోట్ల మేర చెల్లింపులు జరగాల్సి ఉంది. అయితే పరిహారం చెల్లింపుల్లో అవకతవకలకు సంబం ధించి 2009 చివర్లోనే అనేక ఆరోపణలు వచ్చాయి. అనంతరం కొత్త రాష్ట్రంలో ఈ అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంతో విచారణ జరపగా, అనేక అక్రమాలు బయటపడ్డాయి.
ఇందులో కొడిముంజ గ్రామంలో గృహాలకు పరిహారాన్ని మొదట రూ.6.10 కోట్లతో అంచనా వేయగా, తర్వాత దాన్ని రూ.18.58 కోట్లకు పెంచినట్లు గుర్తించారు. శాభాష్‌పల్లిలో రూ.5.32 కోట్ల మేర పరిహారాన్ని లెక్కిస్తే దాన్ని రూ.20.49 కోట్లకు పెంచారు. ఈ రెండు గ్రామాల్లోనే మొత్తంగా 27.65 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు. ఈ అవకతవకల్లో మొత్తంగా 24 మంది అధికారుల పాత్రను విజిలెన్స్ విభాగం గుర్తించింది.
అదే గ్రామంలో మరోసారి..
కాగా తాజాగా శాభాష్‌పల్లిలో మరోసారి అక్రమాలు వెలుగుచూశాయి. ఈ గ్రామంలో 7 గృహాల పరిహారాన్ని పరిశీలిస్తే, 2008లో వాటికి చెల్లించాల్సిన పరిహారాన్ని రూ.35.10 లక్షలుగా నిర్ణయించగా, తాజాగా రూ.4.85 కోట్లకు పెంచారు. 1–26 ఇంటినంబర్ ఉన్న గృహానికి 2008లో రూ.60వేల పరిహారాన్ని ప్రతిపాదించగా, ప్రస్తుతం దాన్ని రూ.65 లక్షలకు పెంచారు.
1–17 ఇంటినంబర్ ఉన్న మరో గృహానికి గత అంచనా రూ.7.36 లక్షలుగా ఉండగా, దాన్ని ఏకంగా రూ.1.20 కోట్లకు పెంచారు. అలాగే 1–29 నంబర్‌తో ఉన్న మరో గృహ పరిహారాన్ని రూ.1.74 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచేశారు. ఇలా చాలా గృహాలకు సంబంధించి అడ్డగోలుగా పరిహార మొత్తాలను పెంచినట్లుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.
లెక్కల్లో మాయ..
గృహ నిర్మాణ కాలాన్ని నిర్ధారిం చడం, గృహాల్లో వాడిన కలప విలువ, భూమి విలువలను లెక్కించడంలో ఆర్ అండ్‌బీ, రెవెన్యూ, అటవీ అధికారులు అక్ర మాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వినిపి స్తున్నాయి. దీనిపై ఫిర్యాదులు అందడంతో విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగినట్లు తెలిసింది. దీనిపై ఇప్పటికే ప్రాథమిక విచారణ మొదలుపెట్టినట్లుగా సమాచారం. ఇక నీటి పారుదల శాఖ సైతం దీనిపై విచారణకు ఆదేశించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్ నుంచి సంబంధిత అధికారులు ఆదేశాలు వెళ్లినట్లుగా సమాచారం.