ఆదర్శంగా ఉంటేనే మార్పు 

Collector Dharma Reddy  Road Works Start Medak - Sakshi

నర్సాపూర్‌: నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా మీరు గ్రామంలో పది మందికి ఆదర్శంగా ఉన్నప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి సర్పంచులకు సూచించారు. స్థానిక మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో సర్పంచులకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరంలో శుక్రవారం సాయంత్రం ఆయన పాల్గొని మాట్లాడారు. మీ హయాంలో మీమీ గ్రామాలలో ప్రభుత్వ పరంగా చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలపై మీ పేర్లు ఎలా శాశ్వతంగా ఉండాలని ఆశిస్తారో పనులలో నాణ్యత ప్రమాణాలు ఉండేలా శ్రద్ద తీసుకుంటేనే పనులు నాణ్యతగా ఉండటంతోపాటు మీకు మంచి పేరు వస్తుందని కలెక్టర్‌ సూచించారు.

పలు గ్రామాలలో ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్లు త్వరలోనే పాడవుతున్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. అందుకు పనులలో నాణ్యత లోపించడంతోపాటు వాటిపై నుంచి కేజీవీల్స్‌తో ట్రాక్టర్లు తిప్పడం మరో కారణమని ఆయన అన్నారు. అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో గ్రామ సర్పంచ్‌లు బాధ్యతగా వాటిని పర్యవేక్షించినపుడే పనులలో నాణ్యత సాధ్యమని ఆయన వివరించారు. చెట్లను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్‌ చెప్పారు.

మొక్కలు పెంపకాన్ని బాధ్యతగా తీసుకోండి 
జిల్లాలో హరితహారం కార్యక్రమం కింద గతంలో వంద నర్సరీలు ఏర్పాటు చేసి కోటి నుంచి కోటీ 30లక్షల మొక్కలు పెంచగా.. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 450 నర్సరీలు ఏర్పాటు చేసి సుమారు నాలుగు కోట్ల మొక్కలు పెంచుతున్నామని చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో మొక్కలు పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఇప్పటికే చెట్లను నరకడంతో అడవుల విస్తీర్ణం తగ్గి వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయని ఆయన విచారం వ్యక్తం చేశారు.

సర్పంచ్‌లు హరితహారం కార్యక్రమం పట్ల అందరూ బాధ్యతగా వ్యవహరించి మొక్కలు నాటి కాపాడేందుకు చర్యలు తీసుకున్నపుడే హరితహారం విజయవంతం అవతుందని ఆయన చెప్పారు. ఇండ్ల నుంచి పొడి, తడి చెత్తను వేరుగా సేకరించేందుకు ఏర్పాటు చేసుకోవాలని ఆయన చెప్పారు. అందుకుగాను ప్రజలలో చైతన్యం తేవాలని చెప్పారు. ప్లాస్టిక్‌తో భూమి ఎంత కలుషితమవుతుందో ప్రజలకు తెలియచేయాలని ఆయన చెప్పారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత ఏర్పాటు చేయించాలని చెప్పారు. కాగా గతంలో ఆదర్శ గ్రామాలుగా ఎంపికైన గ్రామాలకు మిమ్మల్ని తీసుకుపోయి అక్కడి పనులను మీకు చూపిస్తామని కలెక్టర్‌ చెప్పారు. సమావేశంలో డీపీఓ హనూక్, కొల్చారం జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, నర్సాపూర్‌ మండల తహసీల్దార్‌ బిక్షపతి, ఎంపీడీఓ శ్రవన్‌కుమార్, డీఏఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top