హరితం.. వేగిరం

Medak Collector Review On Haritha Haram Program - Sakshi

వర్షాలు కురుస్తుండటంతో పనుల్లో వేగం

జిల్లాలో 3 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంఇప్పటి వరకు నాటినవి 24 లక్షలు మాత్రమే..

ప్రభుత్వ విభాగాల వారీగా లక్ష్యం నిర్ధారణ

అన్ని శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్షలు

రోజుకు ఒకటి, రెండు మండలాల్లో పర్యటన

పలు గ్రామాల్లో మొక్కల పంపిణీ

హరితహారం లక్ష్యసాధనపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. వర్షాలు కురుస్తుండటంతో ఇదే అదునుగా భావించిన అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. జిల్లాలో నాలుగో విడత హరితహారంలో 3 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇదివరకే ప్రభుత్వ శాఖల వారీగా టార్గెట్‌ నిర్దేశించిన కలెక్టర్‌ ధర్మారెడ్డి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అంతేకాదు.. ప్రతి రోజూ ఒకటి లేదా రెండు మండలాల చొప్పున పర్యటిస్తూ మొక్కలు పంపిణీ చేస్తున్నారు.    

సాక్షి, మెదక్‌:  ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పల్లెల్లో మొక్కల పంపణీకి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 20 మండలాల పరిధిలో 433 నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో డీఆర్డీఏ ఆధ్వర్యంలో 321 నర్సరీలు ఉండగా.. అటవీ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నవి 112 ఉన్నాయి. ఇప్పటికే అన్ని నర్సరీల్లో మొక్కలు ఏపుగా పెరిగి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఈ నర్సరీల్లో పెంచిన మొక్కలు 3 కోట్లకు పైనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

రెట్టింపునకు పైగా లక్ష్యంతో..
2018లో చేపట్టిన మూడో విడత హరితహారంలో జిల్లా వ్యాప్తంగా 1.31 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పుడు 1.15 కోట్ల మొక్కలు మాత్రమే నాటారు. ఇందులో ఎన్ని బతికాయో.. ఎన్ని పోయాయో తెలియదు గానీ ప్రస్తుతం రెట్టింపు సంఖ్యకు పైగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకనుగుణంగా అధికార యంత్రాంగం ముందుకు సాగుతోంది. అయితే.. ఎప్పటికీ జూలై 31లోపు హరితహారం కార్యక్రమం ముగిసేది. ప్రస్తుతం వర్షాలు ఆలస్యంగా కురవడంతో ఈ కార్యక్రమం ఇప్పుడిప్పుడిప్పుడే వేగం పుంజుకుంటోంది.

ఇప్పటివరకు 24,32,388 మొక్కలు 
జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖలకు హరితహారం లక్ష్యాన్ని కలెక్టర్‌ నిర్దేశించారు. ఇప్పటివరకు కేవలం ఐదు ప్రభుత్వ శాఖలు మొక్కలు నాటడం మొదలుపెట్టాయి. జిల్లాలో 3 కోట్ల మొక్కలు నాటాలనేది టార్గెట్‌ కాగా.. వ్యవసాయం, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, అటవీ, గనులు, ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వరకు 24,32,388 మొక్కలు మాత్రమే నాటారు.

కలెక్టర్‌ ప్రత్యేక నజర్‌
జిల్లాలో అటవీ శాతం పెంపు, ఇంకుడుగుంత నిర్మాణంతోపాటు పాస్టిక్‌ వ్యర్థాల నిర్మూలపై కలెక్టర్‌ ధర్మారెడ్డి ప్రత్యేక నజర్‌ వేశారు. ఈ మూడు కార్యక్రమాలను స్వయంగా ఆయనే స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులు, సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే తగని సలహాలు, సూచనలు ఇస్తున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కల పంపిణీకి మాత్రమే పరిమితం కాకుండా వాటిని సంరంక్షించే విధానంపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. మొక్కలు ఎక్కడెక్కడ ఏ శాఖల ఆధ్వర్యంలో నాటారో.. వాటి బాధ్యతను సైతం ఆయా శాఖల అధికారులకే అప్పగించారు. ఇందులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సమీక్ష సమావేశాల్లో హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ప్రజలు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు అవగాహన కల్పించారు.

త్వరలో శాఖల వారీగా కార్యక్రమం
నాలుగైదు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హరితహారం కార్యక్రమాన్ని వేగిరం చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. ప్రభుత్వ శాఖల వారీగా త్వరలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్‌ పాఠశాలలు, ఇతర సంస్థల సహకారంతో రోడ్ల వెంట, మైదానాల్లో మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది.
 
కొత్త చట్టంతో సక్సెస్‌ అయ్యేనా..
ప్రభుత్వం ఇటీవల నూతనంగా రూపొందించిన పంచాయతీరాజ్‌ చట్టంలో ప్రతీ గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేయాలని.. గ్రామస్తుల అవసరాలకు అనుగుణంగా పండ్లు, పూల మొక్కలు నాటాలని.. ఇంటింటికీ ఆరు చొప్పున మొక్కలు పంపణీ చేసి వాటిని సంరంక్షిచాలనే నిబంధనలు ఉన్నాయి. ఈ బాధ్యతల్లో విఫలమైన పక్షంలో సర్పంచ్‌తోపాటు పంచాయతీ కార్యదర్శిపై వేటు పడు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన కొత్తచట్టంతో గ్రామాల్లో హరితహారం సక్సెస్‌ అవుతుందని పలువురు అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలి. నూతన పంచాయతీరాజ్‌ చట్టం పకడ్బందీ అమలుతోపాటు గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖలు కీలకపాత్ర పోషిస్తే ఊరువాడా హరితమయమై పల్లెలు పచ్చదనంతో కళకళలాడుతాయనే భావన ప్రతిఒక్కరిలో వ్యక్తమవుతోంది. 

లక్ష్యంతో పాటు రక్షణ ముఖ్యం

మెదక్‌జోన్‌: హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతిగ్రామానికి మొక్కలు నాటేందుకు ప్రత్యేకంగా లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందని లక్ష్యాన్ని చేరుకునేందుకు  మొక్కలే నాటడం ముఖ్యం కాదని నాటిన ప్రతిమొక్కను రక్షించుకోవడమే ప్రదానమని కలెక్టర్‌ ధర్మారెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని సాయి బాలాజీ గార్డెన్‌లో హరితహారం కార్యక్రమం విజయవంతంకోసం జిల్లాలోని ఉపాధిహామీ పథకం సిబ్బంది. ఐకేపీ సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన కలెక్టర్‌ ధర్మారెడ్డి మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా నిర్వహించిన హారితహారం కార్యక్రమంలో ఆయా గ్రామాలకు ఇచ్చిన లక్ష్యాలను చేరుకునేందుకు గానూ ఇష్టానుసారంగా మొక్కలను నాటడమే జరిగిందని వాటి సంరక్షణ మాత్రం పట్టించుకోలేక పోయారని పేర్కొన్నారు. మొక్కల సంరక్షణ సరిగా జరగక పోవటానికి ఇదే ప్రధాన కారణమన్నారు.

ప్రస్తుతం తమకు నిర్దేశించిన మొక్కలను నాటామని కాకుండా నాటిన ప్రతి మొక్క రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమం విజయవంతం కావాలంటే క్షేత్రస్థాయి సిబ్బంది పాత్ర కీలకమన్నారు. ఉపాధి సిబ్బంది, ఐకేపీ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించి ప్రజల భాగస్వామ్యంతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అంతకుముందు జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ సీతారామరావు మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలను గ్రామీణాభివృద్ధిశాఖ సిబ్బంది సమష్టి కృషితో విజయవంతం చేశారని అదే స్ఫూర్తితో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసి జిల్లాను రాష్ట్రస్థాయిలో అగ్రగామిగా నిలపాలన్నారు. నిజాంపేట మండలంలో జలశక్తి అభియాన్‌ కార్యక్రమం గురించి రైతులకు వివరించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి సిబ్బందిపై ఉందని చెప్పారు. అలాగే ప్రతి ఇంటికి ఇంకుడు గుంతను తీసుకునే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు. అనంతరం డీపీవో హనూక్‌ మాట్లాడుతూ ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిషేధించేలా ప్రజలకు విరివిగా అవగాహన కల్పించాలని కోరారు. ఈ  కార్యక్రమంలో డీఎఫ్‌వో పద్మజారాణి, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, ఏడీ హార్టికల్చర్‌ నర్సయ్య, ఏపీడీలు ఉమాదేవి, భూమయ్య, విజయ తదితరులు పాల్గొన్నారు. 

మెదక్‌ రూరల్‌: హరితహారం కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి పేర్కొన్నారు. మెక్కలు నాటే విధానం గురించి హైదరాబాద్‌ అకాడమిలో శిక్షణ పొందిన అధికారులతో గురువారం మెదక్‌ కలెక్టరేట్‌లో అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసేందుకు ప్రతి గ్రామంలో గామసభలను నిర్వహించి హరితహారం ప్రాధాన్యతను వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం పెరిగినప్పుడే పూర్తిస్థాయిలో విజయవంతం అవుతుందని సూచించారు. ప్రతి ఇంటికి పంపిణీ చేసే మొక్కల వివరాలను ప్రత్యేకంగా రిజిస్టర్‌లో నమోదు చేసేలా కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ కార్యక్రమంలో పూర్తిస్థాయిలో పాల్గొని అనుమానాలను నివృత్తి చేసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సీతారామారావు, డీపీఓ హనూక్, డీఎఫ్‌ఓ పద్మజారాణి, జిల్లా అధికారులు పరుశురాంనాయక్, దేవయ్య, నర్సయ్య, సుధాకర్, తిరుపతయ్య, శ్రీనివాసులు, ఏసయ్య, రసూల్‌బి తదితరులు ఉన్నారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top