బిడ్డా.. ఇంటికి రా!

CM KCR Gulf Visiting Soon - Sakshi

గల్ఫ్‌లోని తెలంగాణ వాసులకు పిలుపునివ్వనున్న కేసీఆర్‌ 

తిరిగొచ్చిన వారికి న్యాక్‌లో శిక్షణ 

త్వరలో సీఎం గల్ఫ్‌ దేశాల్లో పర్యటన

సాక్షి, హైదరాబాద్‌: గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డలు రాష్ట్రానికి వచ్చేయాలని పిలుపునివ్వడానికి త్వరలో తానే స్వయంగా గల్ఫ్‌ దేశాలకు వెళ్లనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కుటుంబాలను పోషించుకోవడానికి గల్ఫ్‌ దేశాలకు వెళ్లి వివిధ పనులు చేసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలోనే వారు చేసుకోవడానికి పనులున్నందున తిరిగి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ‘ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు పనులు వెతుక్కుంటూ గల్ఫ్‌ దేశాలకు పోయారు. అక్కడ దొరికిన పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంతా చేస్తే వారికి దొరికే జీతం కూడా తక్కువే. తెలంగాణలో పరిస్థితి గతంలో లాగా లేదు. ఇక్కడే చేసుకోవడానికి చాలా పని ఉంది. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక్కడ పనికి మనుషులు దొరక్క వేరే ప్రాంతాల నుంచి రప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తెలంగాణ బిడ్డలు పనికోసం వేరే చోటకి వెళ్తే, తెలంగాణలో పనికోసం వేరే ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ముఖ్యంగా గల్ఫ్‌ దేశాలకు వెళ్లే వారిని తిరిగి రప్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది. వారికి హైదరాబాద్‌లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌)లో తగిన శిక్షణ ఇస్తాం. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతోనూ, బిల్డర్లతోనూ సంప్రదించి, నిర్మాణ రంగంలో పని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది’అని సీఎం ప్రకటించారు. నూతన ఎన్‌ఆర్‌ఐ విధానం అధ్యయనం కోసం ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌ రావు, జీఏడీ ముఖ్య కార్యదర్శి అధర్‌ సిన్హాలతో కూడిన బృందం ఆదివారం కేరళ రాష్ట్రంలో పర్యటించనుంది. గల్ఫ్‌ దేశాల్లో పనికి పోయిన వారు ఎక్కువగా నివసించే ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలతో త్వరలోనే సీఎం సమావేశం కానున్నారు.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top