డబ్బులు ఇవ్వకుంటే బ్యాంకులపై కేసులు

Cm Chandrasekhar Rao Review Meeting On Banks And Loans - Sakshi

పెట్టుబడి సాయం చెక్కుల మార్పిడిపై కేసీఆర్‌

నగదుపై ముందుగానే బ్యాంకులను అప్రమత్తం చేయండి

కేంద్ర విధానాల కారణంగా తీవ్ర ఇబ్బందులు 

ఎరువుల పంపిణీ, పంటల బీమాలో అడ్డగోలు నిబంధనలు 

రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని వ్యాఖ్య 

మిషన్‌ భగీరథ పనుల సమీక్షలపై అసంతృప్తి 

పనులు పర్యవేక్షించకుండా సమీక్షలెందుకని కడియంపై సీఎం ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌ : బ్యాంకులలో నగదు లేకుండా చేసిన కేంద్ర ప్రభుత్వ విధానంతో మనం ఇబ్బంది పడుతున్నామని.. పెట్టుబడి సాయం కింద రైతులకు డబ్బులు అందే విషయంలో కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. రైతులు చెక్కులిచ్చిన తర్వాత బ్యాంకులు వారికి డబ్బులు ఇవ్వకుంటే కేసులు పెట్టాలని ఆదేశించారు. జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి బ్యాంకర్లకు కచ్చితమైన ఆదేశాలివ్వాలని సూచించారు. శనివారం ప్రగతిభవన్‌లో జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల కారణంగా రాష్ట్రాలు పడే ఇబ్బందులపై చర్చ జరిగింది. బ్యాంకులు, ఏటీఎంలలో డబ్బులు లేకపోవడంతో ప్రజలు పడుతున్న బాధలు.. ఎరువులు పంపిణీపై కేంద్రం తెచ్చిన కొత్త విధానం తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. 

వెంటనే నగదు అందేనా..? 
బ్యాంకులు రైతుబంధు పథకం చెక్కులకు వెంటనే నగదు చెల్లిస్తాయా అన్నదానిపై కలెక్టర్లు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో రిజర్వుబ్యాంకు నుంచి ఆరు వేల కోట్లు తెప్పించామని, వాటిని రైతుల కోసమే రిజర్వు చేయాలని బ్యాంకులకు సూచించామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. కానీ.. ప్రస్తుతం బ్యాంకుల్లో డబ్బు లేదని, రైతుల కోసం వచ్చిన డబ్బును ఇతర అవసరాలకు వినియోగించి, చివరికి రైతులను ఇబ్బంది పెట్టే అవకాశముందని కలెక్టర్లు సందేహం వ్యక్తం చేశారు. చెక్కు ఇచ్చిన వెంటనే డబ్బులు ఇస్తారనే నమ్మకం లేదన్నారు. దీనిపై స్పందించిన కేసీఆర్‌.. బ్యాంకులు రైతులకు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే ఊరుకోవద్దని అధికారులకు సూచించారు. 

కేంద్రం తీరుతో ఇబ్బందులు 
ఎరువుల పంపిణీపై కేంద్రం తెచ్చిన కొత్త విధానంపైనా సమావేశంలో చర్చించారు. ఎరువులు ఇవ్వడానికి ఆధార్‌ అనుసంధానంతోపాటు బయోమెట్రిక్‌ విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ప్రతి రైతు ఎరువుల దుకాణానికి వెళ్లి ఆధార్‌ కార్డు నమోదు చేయించుకుని, వేలిముద్రలు సరిపోల్చుకుని ఎరువులు పొందాల్సి ఉంటుంది. దీనిపై కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘లక్షలాది మంది రైతులు.. వందల సంఖ్యలో ఉన్న ఎరువుల దుకాణాల నుంచి కోట్ల బస్తాల ఎరువులు కొంటారు. కొత్త విధానంతో వారు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది..’’అని పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయించిన ఈ విధానాన్ని అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై పడిందని అసహనం వ్యక్తం చేశారు. ఇక పంటల బీమా పథకంలో గందరగోళం నెలకొందని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. పంట నష్టపోయిన 48 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని, బీమా ప్రతినిధులతో విచారణ జరిపించుకోవాలన్న నిబంధనలపై అవగాహన లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారని అధికారులు పేర్కొన్నారు. 

సమీక్షలు కాదు.. పర్యవేక్షించండి 
కొన్ని జిల్లాల్లో మిషన్‌ భగీరథ పనుల తీరుపై కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. మిషన్‌ భగీరథ పనుల పురోగతిని నేరుగా పర్యవేక్షించకుండా.. సమీక్షలు నిర్వహించడం ఏమిటని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్తాయిలోకి వెళ్లి పనులను పరిశీలించాలని పేర్కొన్నారు. ఆదివారం మిషన్‌ భగీరథ పనులపై మహబూబాబాద్‌ జిల్లాలో కడియం శ్రీహరి సమీక్ష సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే పనులు జరగకుండా పదేపదే సమావేశాలు వద్దని, మహబూబాబాద్‌ సమావేశాన్ని రద్దు చేసుకోవాలని కేసీఆర్‌ ఆదేశించారు. ఆయా జిల్లాల్లో మిషన్‌ భగీరథ పనుల పురోగతిపై ఆదివారం హైదరాబాద్‌ నుంచి తానే సమీక్షిస్తానని, అందుబాటులో ఉండాలని కలెక్టర్లకు సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top