
సాక్షి, హైదరాబాద్ : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) క్యాంపస్ తెలంగాణలో ఏర్పాటు కానుంది. సంగారెడ్డి ఐఐటీ ప్రాంగణంలో ఈ ఏడాది నుంచే దీన్ని ప్రారంభించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ (హెచ్‌ఆర్‌డీ) నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా ఐఐఐటీ కౌన్సిల్ అడ్మిషన్ల ప్రక్రియను కూడా ప్రారంభించింది. వచ్చే నెల నుంచి 30 మంది విద్యార్థులతో సంగారెడ్డి ఐఐటీ ప్రాంగణంలో తరగతులు ప్రారంభించనుంది. వాస్తవానికి కర్ణాటకలోని బెంగళూరులో ఐఐఐటీ ఉంది. దీనికి అదనంగా ఆ రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతమైన రాయచూర్‌కు కేంద్ర ప్రభుత్వం మరో ఐఐఐటీని మంజూరు చేసింది. అయితే అక్కడ ఐఐఐటీ విద్యా సంస్థకు భూమి కేటాయించడంలో కర్ణాటక ప్రభుత్వం విఫలమైంది.
ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభిస్తామని హెచ్‌ఆర్‌డీశాఖ ముందే సమాచారం ఇచ్చినా కర్ణాటక సర్కారు పట్టించుకోలేదు. ఫలితంగా దీన్ని తాత్కాలికంగా సంగారెడ్డిలోని ఐఐటీ ప్రాంగణంలో ప్రారంభించాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం దీన్ని అదునుగా తీసుకొని రెండో ఐఐఐటీకి వెంటనే స్థలం కేటాయిస్తే రాయచూర్‌కు మంజూరు చేసిన ఈ సంస్థను తెలంగాణకు తరలించే అవకాశం లేకపోలేదని హెచ్‌ఆర్‌డీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మంజూరు చేసిన ఐఐఐటీ ఏర్పాటుకు కర్ణాటక తగిన చర్యలు తీసుకోలేకపోయిందని, ఆ కారణంగానే ఈ క్యాంపస్‌ను సంగారెడ్డిలోని ఐఐటీ ప్రాంగణానికి తరలించాల్సి వచ్చిందని ఆ అధికారి చెప్పారు. అయితే తెలంగాణకు తరలించిన ఐఐఐటీని తాము వెనక్కి తెప్పించుకుంటామని కర్ణాటక బీజేపీ నేతలు అంటున్నారు.