ఆశ చూపి..మోసగించి | cheating through name of lottery in kamareddy | Sakshi
Sakshi News home page

ఆశ చూపి..మోసగించి

Jan 23 2018 5:29 PM | Updated on Oct 8 2018 6:18 PM

cheating through name of lottery in kamareddy - Sakshi

సాక్షి, కామారెడ్డి :  జిల్లాకు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని దెగ్లూర్‌ కేంద్రంగా లాటరీ దందా నడిచింది. దెగ్లూర్‌కు చెందిన లాటరీ నిర్వాహకులు కొందరు ఏజెంట్లను పెట్టుకుని వారి ద్వారా కామారెడ్డి జిల్లాలో పెద్ద సంఖ్యలో లాటరీ టికెట్లను విక్రయించారు. రూ. 3 వేలు పెడితే ఏదో ఒక బహుమతి తప్పనిసరిగా వస్తుందని నమ్మించడంతో ఆశకుపోయి టికెట్లు కొనుగోలు చేశారు. మొత్తం 17,500 మంది నుంచి రూ. 3 వేల చొప్పున మొత్తం రూ. 5.25 కోట్లు వసూలు చేశారు.  
పథకం ప్రకారమే...
దెగ్లూర్‌ ప్రాంతానికి చెందిన కొందరు లాటరీ నిర్వాహకులు ఓ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో లాటరీ స్కీం నిర్వహిస్తున్నట్టు బ్రోచర్లు ముద్రించారు. ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, మద్నూర్, బిచ్కుంద తదితర ప్రాంతాలకు చెందిన సాధారణ, మధ్యతరగతి ప్రజలను టార్గెట్‌గా చేసుకున్నారు. రూ. 3 వేలు చెల్లించి లాటరీ టికెట్టు కొంటే.. డ్రా తీసినపుడు తప్పనిసరిగా బహుమతి వస్తుందని నమ్మించారు. లాటరీలో ఇన్నోవా కారు, జేసీబీ, ట్రాక్టర్లు, వ్యాన్లు, ఆటోలు, బైకులు... ఇలా వందలాది వాహనాలతో పాటు గృహోపకరణాలను బ్రోచర్ల ద్వారా చూపించి బురిడీ కొట్టించారు. లాటరీ తగిలితే లాభపడొచ్చనే ఆశతో జిల్లాకు చెందిన దాదాపు 4 వేల మంది వరకు టికెట్లు కొనుగోలు చేశారు.  
వివాదాస్పదమైన డ్రా....
ఈ నెల 14న దెగ్లూర్‌లో లాటరీ డ్రాకు సంబంధించి ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి పండుగ ఉన్నప్పటికీ డ్రాలో తమకు ఏదో ఒక బహుమతి వస్తుందన్న ఆశతో టికెట్టు కొన్నవారు అంతదూరం వెళ్లారు. డ్రా సమయానికి అక్కడి పోలీసులు రంగ ప్రవేశం చేసి లాటరీలు చట్టవిరుద్ధమని చెప్పి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఎవరి వద్ద టికెట్లు కొన్నారు వారి వద్దనుంచి డబ్బులు వాపస్‌ తీసుకోండని ఉచిత సలహా ఇచ్చారు. చేసేదేమీ లేక బాధితులు వెనుదిరిగి వచ్చారు. తర్వాత నిర్వాహకులకు ఫోన్‌లు చేసి లాటరీ విషయమై నిలదీయగా.. ఈ నెల 20న డ్రా నిర్వహిస్తామని, మన జిల్లా సరిహద్దుల్లో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పినట్లు తెలిసింది. దీంతో డబ్బులు చెల్లించిన వారిలో మళ్లీ ఆశలు రేకెత్తాయి. ఆదివారం ఉదయం రాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి చాలా మంది వెళ్లారు. అక్కడ కొన్ని డ్రాలు తీసిన నిర్వాహకులు అందరికీ ఫోన్‌ ద్వారా మెసేజ్‌ పంపుతామని చెప్పడంతో బాధితులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో అక్కడి నుంచి నిర్వాహకులు పారిపోయారు. టికెట్లు కొన్నవారు రిక్తహస్తాలతో వెనుదిరిగారు.
కేసు నమోదు
మద్నూర్‌(జుక్కల్‌): సలాబత్‌పూర్‌ శివారులోని మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఎలాంటి అనుమతులు లేకుండా లక్కీ డ్రా తీస్తున్న దెగ్లూర్‌కు చెందిన మారుతి అనే వ్యక్తిని సోమవారం పట్టుకుని కేసు నమోదు చేశామని ఎస్సై మహమ్మద్‌ సాజిద్‌ తెలిపారు. తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దులోని వ్యవసాయ భూమిలో డ్రా నిర్వహించగా కొందరి పేరిట డ్రా తీసి మిగతా సభ్యులకు అన్యాయం చేశాడని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. లక్కీ డ్రా పేరిట ప్రచారం చేసే స్కీంలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.
నిలదీస్తే పారిపోయిండ్రు
బ్రోచర్లల్ల పెద్ద పెద్ద కార్లు, జేసీబీలు, వ్యా న్లు, బైకులు చూయించిండ్రు. నమ్మి టికెట్లు కొన్నం. నేను రూ. 6 వేలు కట్టి రెండు టికెట్లు కొన్న. మొన్న డ్రా ఉందంటే అంతదూరం పోయిన. అంతా మోసమే. మోసం చేశారని గుర్తించి నిలదీస్తే నిర్వాహకులు పారిపోయిండ్రు. మాకు న్యాయం చేయాలి.       
  – రాజు, కామారెడ్డి

మూడు టికెట్లు కొన్న...
లాటరీలో ఏదో ఒక బహుమతి వస్తుందంటే నమ్మిన. రూ. 3 వేలకు ఒకటి చొప్పున రూ. 9 వేలు కట్టి మూడు టికెట్లు కొన్న. పండుగ పూట లాటరీలో ఏదన్న ఒకటి తగులుతదని ఎంతో ఆశపడ్డ. డ్రా అంతా మోసం. మెసేజే వస్తదని చెప్పిండ్రు. ఇప్పటిదాకా ఎలాంటి మెసేజ్‌ రాలేదు. లాటరీ పేరుతో మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.
– కుమార్, కామారెడ్డి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement