అనుసంధానంపై త్వరగా తేల్చండి

Central Govt Suggestion to State Govt On Connectivity of Godavari and Krishna rivers - Sakshi

తెలంగాణకు కేంద్రం సూచన

తమ రాష్ట్ర అవసరాలు తీరాకే నీటిని మళ్లించాలన్న ఏపీ

నదుల అనుసంధానంపై ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశంలో చర్చ

సాక్షి, హైదరాబాద్‌ : గోదావరి – కృష్ణా – కావేరి నదుల అనుసంధానంపై తాము సూచించిన ప్రతి పాదనలను పరిశీలించి త్వరగా తమకు నివేదిక ఇవ్వాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది. జానంపేట్‌ మీదుగా గోదావరి జలాలను కృష్ణాకు మళ్లించి అటు నుంచి కావేరికి తీసుకెళ్లే ప్రతిపాదనపై అభ్యంతరాలు, పరిశీలనను త్వరగా తెలపాలని సూచించింది. బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర జలశక్తిశాఖ సహాయ మంత్రి రతన్‌లాల్‌ ఖటారియా అధ్యక్షతన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) 17వ ప్రత్యేక కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ సెక్రటరీ ఉపేంద్రప్రతాప్‌ సింగ్, ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భూపాల్‌సింగ్, సీడబ్ల్యూసీ అధికారులు, ఇంజనీర్లు సమావేశంలో పాల్గొన్నారు.

గోదావరి – కృష్ణా – కావేరి (గ్రాండ్‌ ఆనికట్‌) అనుసంధానం ప్రాజెక్టును తొలి ప్రాధాన్యతగా చేపట్టాలని తమిళనాడు అధికారులు కేంద్రాన్ని కోరారు. గోదావరితో అనుసంధానం చేస్తే తప్ప తమ రాష్ట్ర నీటి కష్టాలు తీరవని స్పష్టం చేశారు. గోదావరి నీటిని జానంపేట మీదుగా కృష్ణాకు, అటుగా తమిళనాడులోని గ్రాండ్‌ ఆనికట్‌కు 247 టీఎంసీల నీటిని తరలించేందుకు ఎన్‌డబ్ల్యూడీఏ ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధం చేసిందని, దీన్ని త్వరగా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియతో తెలంగాణలో నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ ఆయకట్టుకు లబ్ధి కలుగుతుందని, ఈ దృష్ట్యా ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వ వైఖరి వెంట నే చెప్పాలని కేంద్రమంత్రి రాష్ట్ర ఇంజనీర్లకు సూచించారు. కేంద్ర సూచనలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్రం నుంచి సమావేశంలో పాల్గొన్న అంతర్రాష్ట్ర జల విభాగ ఎస్‌ఈ నరహరిబాబు, డిప్యూటీ డైరెక్టర్‌ కె. ప్రసాద్‌ తెలిపారు.

ఏపీ అవసరాలు తీరాకే తమిళనాడుకు 
తమ రాష్ట్రం గోదావరి, కృష్ణాలో కేటాయింపుల మేర నీటిని ఉపయోగించుకున్న తర్వాత ఇంకా నీళ్లు మిగిలితేనే తమిళనాడుకు నీటిని తరలించాలని ఏపీ వాదించింది. ఈమేరకు ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశంలో ప్రతిపాదన అందజేసింది. గోదావరి, కృష్ణాలో కలిపి తమ కేటాయింపుల మేరకు నీటిని ఉపయోగించుకుంటామని ఇందుకోసం గోదావరి – కృష్ణా అనుసంధానం ప్రాజెక్టు చేపడుతామని నివేదించింది. తమ అవసరాలు తీరాక పెన్నా బేసిన్‌ మీదుగా గ్రాండ్‌ ఆనికట్‌కి నీటిని తరలిస్తే తమకేమి అభ్యంతరం లేదని చెప్పింది.

ఇంద్రావతి నీళ్లపై ఛత్తీస్‌గఢ్‌ కొత్త వాదన
ఇంద్రావతి నీళ్లను పూర్తిగా ఉపయోగించుకుంటామని ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశంలో ప్రస్తావించింది. ఇంద్రావతిలో మిగులు జలాలు ఉన్నాయని,  వాటి ఆధారంగా దిగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు చేపట్టవద్దని సూచిం చింది. ఇంద్రావతిపై తమ ప్రభుత్వం బ్యారేజీలు, ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఆ నీటిని తమ  అవసరాలకు ఉపయోగించుకుంటామని చె ప్పింది. గోదావరి – కావేరి అనుసంధానం  ఆమోదం తెలుపబోమని  తేల్చి చెప్పింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top