మేడారంలో భక్తులు వదిలివెళ్లిన వ్యర్థాలు వెదజల్లుతున్న దుర్గంధం పారిశుధ్య కార్మికులను తీవ్ర అస్వస్థతకు గురి చేస్తోంది.
వ్యర్థాల దుర్గంధమే కారణమంటున్న పారిశుధ్య కార్మికులు
ఎస్‌ఎస్ తాడ్వారుు: మేడారంలో భక్తులు వదిలివెళ్లిన వ్యర్థాలు వెదజల్లుతున్న దుర్గంధం పారిశుధ్య కార్మికులను తీవ్ర అస్వస్థతకు గురి చేస్తోంది. బుధవారం రాత్రి ఓ కార్మికుడి కుమారుడు మృతి చెందాడు. ఏపీలోని రాజమండ్రికి చెం దిన పారిశుధ్య కార్మికుడు మాణిక్యాల నారాయణ మేడారంలో పారిశుధ్య పనుల నిమిత్తం భార్య, కుమారుడితో కలసి వచ్చాడు. అక్కడ నెలకొన్న అపరిశుభ్ర వాతావరణంతో అతడి కుమారుడు వెంకటరమణ(12) రెండురోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. పరిస్థితి విషమించడంతో తల్లిదండ్రులు అతడిని బుధవారం తాడ్వాయి పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షలు చేసి నిమోనియావ్యాధిగా గుర్తించి ఎంజీఎం ఆస్పత్రికి రెఫర్ చేశారు. తాడ్వాయి ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన కొద్దిగంటల్లోనే బాలుడు మృతి చెందాడు. అస్వస్థతకు గురైన పారిశుధ్య కార్మికులకు ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ దయానందస్వామి, తాడ్వాయి పీహెచ్‌సీ వైద్యాధికారి క్రాంతికుమార్ వైద్య పరీక్షలు నిర్వహించారు.