రెట్టింపైన ఆసరా

Beedi Workers Pension Is Hiked In Telangana - Sakshi

దుబ్బాకటౌన్‌ : తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ప్రజలకు ఉపాధి కల్పిస్తోంది బీడీ పరిశ్రమ. జిల్లాలో 34,464 మంది బీడీ కార్మికులు పనిచేస్తున్నారు. బీడీ పరిశ్రమ రోజురోజు నిరాదరణకు గురవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం వారికి ఆసరా పింఛన్‌ ద్వారా వెయ్యి రూపాయలు అందిస్తున్నారు. కాగా ఈ నెల నుంచి ఆసరా పింఛన్‌ రూ.2,016కు పెంచుతున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. రాష్ట్రంలో ఈ పరిశ్రమపై ఆధారపడి 10 లక్షలకు పైగా కార్మికులు జీవనం సాగిస్తున్నారు. 1960 ప్రాంతంలో వెళ్లూనుకున్న బీడీపరిశ్రమ అనతి కాలంలోనే లక్షలాది మందికి జీవనోపాది కల్పిస్తూ తెలంగాణలో అతిముఖ్యమైన రంగంగా నిలిచిపోయింది.

రాష్ట్రంలో ప్రధానంగా సిద్దిపేట, మెదక్‌ జిల్లాలతో పాటు   ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్‌ జిల్లాలు బీడీ పరిశ్రమకు పుట్టినిల్లు. కొన్నేళ్లుగా పొగాకు ఉత్పత్తులు వాడడం వల్ల కేన్సర్‌ సోకుతుందంటూ పెద్దఎత్తున ప్రచారం జరగడంతో కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమపై ఆంక్షలు విధించింది. బీడీకట్టలపై పుర్రె గుర్తులు, 85 శాతానికి పైగా డేంజర్‌ బొమ్మలు ముద్రించాలని బీడీ యాజమాన్యాలకు ఆంక్షల విధించారు. అలాగే బీడీలు తాగవద్దని పెద్దఎత్తున ప్రచారం చేయడంతో బీడీ పరిశ్రమ క్రమంగా సంక్షోభంలో కూరుకుపోయింది. గత కొన్నేళ్లుగా బీడీలు తాగేవారు తగ్గడంతో చాలా కంపెనీలు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. దీంతో లక్షలాది మంది ఆధారపడ్డ బీడీ పరిశ్రమ నెలకు 10 రోజులు కూడా పని కల్పించని దీన స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో ఆగమ్యగోచరంగా మారిన బీడీ కార్మికుల కష్టాలను చూసిన తెలంగాణ ప్రభుత్వం బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లు వర్తింప చేసి గత నాలుగేళ్లుగా నెలకు వెయ్యి రూపాయలు అందిస్తుంది.

జిల్లాలో 34,464 మంది బీడీ కార్మికులకు ఫించన్లు
సిద్దిపేట జిల్లాలో సుమారుగా 50 వేలకు పైగా బీడీకార్మికులుండగా వీరిలో పీఎఫ్‌ ఉన్న కార్మికులను గుర్తించి గత నాలుగేళ్లుగా ఆసరా పింఛన్లు అందిస్తోంది. జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం 34,464 మంది బీడీ కార్మికులకు ఆసరా పింఛన్‌ నెలకు వెయ్యి రూపాయల చొప్పున అందిస్తున్నారు. బీడీ పరిశ్రమలో బీడీలు చుట్టేవారు, బీడీ కట్టల ప్యాకింగ్, గంపచాట్, బట్టివాలా తదితర రకాల కార్మికులకు ఆసరా పింఛన్లు ఇంకా 10 వేల వరకు కొత్తగా పింఛన్లు పొందిన వారు, నాన్‌ పీఎఫ్‌ కార్మికులు పింఛన్లు ఇచ్చి తమ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అందిస్తున్నారు. జిల్లాలో అన్ని రకాల పింఛన్లుపొందుతున్నవారు 1,66,145మంది జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పింఛన్లు పొందుతున్న వారు 1,66,145 మంది ఉన్నారు. వీరిలో వృద్ధాప్య పింఛన్‌దారులు 57,665 మంది, వితంతువులు 50,878, దివ్యాంగులు 14,946 మంది, గీతా కార్మికులు 2,253 మంది, బీడీ కార్మికులు 34,461 మంది, చేనేత కార్మికులు 2,702, ఒంటరి మహిళలు 3,240 మంది లబ్ధిదారులు ఉన్నారు.

జూన్‌ నుంచి ఆసరా ఫించన్లు రెట్టింపు..
జూన్‌ నెల నుంచి ఆసరా పింఛన్లు రెట్టింపు అవుతుండటంతో బీడీకార్మికుల కుటుంబాలు సం తోషం వ్యక్తం చేస్తున్నాయి. జూన్‌ నుంచి రెట్టింపు చేస్తూ జూలైలో వారి ఖాతాల్లో డబ్బులు జమచేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు వెల్లడించడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

30 ఏళ్లుగా బీడీలు చేస్తున్నా..
నేను 30 ఏండ్లకు పైబడి బీడీలు చేస్తున్నా. మాకు వ్యవసాయ పోలం ఉన్నా కాలం సరిగా కాక పంటలు పండడం లేదు. దీంతో బీడీలు చేసుకుంటా బతుకుతున్నాం. ఆసరా పింఛన్‌ రెట్టింపు చేయడం చాలా సంతోషంగా ఉంది. బీడీకార్మికులు చాలా ఆనందంగా ఉన్నారు.
– అనితారెడ్డి, బీడీ కార్మికురాలు

ప్రభుత్వం అండగా ఉంటుంది
బీడీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. బీడీ కార్మికుల కష్టాలు స్వయంగా చూసిన వారు కావడంతో ఆసరా పింఛన్లలో అవకాశం కల్పించారు. ఇప్పుడు పింఛన్లు రెట్టింపు చేస్తుండటంతో బీడీకార్మికుల కుటుంబాలకు ఆర్థింకంగా చాలా భరోసా కల్గుతోంది. బీడీ కార్మికుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటుంది.
– సోలిపేట రామలింగారెడ్డి, ఎమ్మెల్యే దుబ్బాక.

రెట్టింపుతో చాలా మేలు
తెలంగాణలో 10 లక్షలకు పైగా కార్మికులు బీడీ పరిశ్రమపై ఆధారపడి బతుకుతుండ్రు. బీడీ పరిశ్రమ ప్రస్తుతం సంక్షభంలో కూరుకపోవడంతో నెలకు 10 రోజులు కూడా చేతినిండా పని కల్పించని పరిస్థితి దాపురించింది. ప్రభుత్వం బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లు ఇస్తుండడం సంతోషకరం. ఇప్పుడు ఆసరా రెట్టింపైతే బీడీ కార్మికులకు చాలా మేలు చేకూరుతుంది. ఇంకా రాష్ట్రంలో పింఛన్లు రాని కార్మికులకు ఆసరా వర్తింపచేసి ఆదుకోవాలి
– తుమ్మ శంకర్, తెలంగాణ ఆల్‌ బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

చాలా సంతోషంగా ఉంది
ఆసరా పింఛన్లు వెయ్యిరూపాయల నుంచి రూ. 2016కు పెంచడం చాలా సంతోషంగా ఉంది. ఖార్ఖానాలు ఇప్పుడు 10 రోజులు కూడా పని కల్పించకపోవడంతో కుటుంబాలు గడవడం కష్టంగా మారింది. 2,016 పెంచడంతో మాకు  చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
– జరీనా, బీడీ కార్మికురాలు దుబ్బాక

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top