చీరలెలా ఉన్నాయి?

Bathukamma Sarees Womens Feedback Nalgonda - Sakshi

నల్లగొండ టూటౌన్‌ : జిల్లాకు బతుకమ్మ చీరలు వచ్చాయి. బతుకమ్మ పండుగ కానుక కింద జిల్లాలో ఈ ఏడాది 5.07 లక్షల చీరలు అవసరం ఉంటాయని జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు కూడా పంపారు. ప్రస్తుతానికి జిల్లాకు 1.08 లక్షల చీరలు చేరాయి. మిగతావి త్వరలో రానున్నాయి. గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకొని బతుకమ్మ చీరల తయారీలో నాణ్యత తీసుకుంది. వాటిపై మహిళలనుంచి ఫీడ్‌బ్యాక్‌ను తీసుకుంటోంది. అధికారులు జిల్లాలోని మున్సిపల్‌ పట్టణాల్లో ఎంపిక చేసిన చోట్ల చీరలను మహిళలకు చూపించి వారినుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు.

జిల్లాకు చేరిన 1.08 లక్షల చీరలు 
 తెల్లరేషన్, అంత్యోదయ తదితర కార్డుదారులకు బతుకమ్మ కానుక కింద చీరలు అందించనున్నారు. జిల్లాకు 5.07 లక్షలకు గాను ఇప్పటికే 1.08 లక్షల చీరలు వచ్చాయి. నల్లగొండ రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి తిప్పర్తి గోదాములో 90 వేల చీరలు భద్రపరిచారు. మరో 18 వేల చీరలను దేవరకొండ డివిజన్‌కు సంబంధించి కొండమల్లేపల్లి గోదాములో ఉంచారు. మిర్యాలగూడ డివిజన్‌ కోసం అక్కడి గోదాములో పెట్టనున్నారు. మరో 15 రోజుల్లో జిల్లాకు అవసరమైన చీరలు చేరనున్నట్లు తెలిసింది. ఒక్కో చీరను టెస్కో నుంచి రూ.280కి కొనుగోలు చేసి పంపిణీ చేస్తుంది.

జేసీ నేతృత్వంలో కమిటీ 
జిల్లాలో మున్సిపల్‌ పట్టణాలతోపాటు గ్రామ పంచాయతీల్లో బతుకమ్మ చీరల పంపిణీకి జేసీ నారాయణరెడ్డి నేతృత్వంలో నోడల్‌ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లాస్థాయిలో జేసీ, చేనేత జౌళీశాఖ ఏడీ, మెప్మా పీడీ, హౌజింగ్‌ పీడీతోపాటు మరికొంత మంది అధికారులు ఉంటారు. అదే విధంగా డివిజన్‌ పరిధిలో ఆర్‌డీఓ నేతృత్వంలో, మండల స్థాయిలో ఎంపీడీఓ, గ్రామస్థాయిలో పంచాయతీ, వీఆర్వోల నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బతుకమ్మ చీరల పంపిణీ సాఫీగా సాగేలా కమిటీలు పర్యవేక్షణ చేయనున్నాయి.

మహిళలనుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటున్న ప్రభుత్వం ...
గత ఏడాది జరిగిన సంఘటలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి  ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. జిల్లాలోని మున్సిపాలిటీ పట్టణాల్లో కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి బతుకమ్మ చీరలను మహిళలకు చూపించి వారినుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటున్నారు. ఒక్కో పట్టణంలో ఐదు పాయింట్‌లు ఏర్పాటు చేసి మహిళలు వ్యక్తం చేసిన వారి అభిప్రాయాలను నోట్‌ బుక్‌లో రాసుకుంటున్నారు. కొన్నిచోట్ల  మహిళలు భిన్నాబిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఒక్కో చోటుకు ఐదు చీరలను పంపించగా.. అన్నీ ఒకే మోడల్‌గా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. 

పండుగకు ముందు చీరలు పంచుతాం
మహిళలకు పంపిణీ చేయడానికి 1.08 లక్షల బతుకమ్మ చీరలు జిల్లాకు వచ్చాయి. మరో 15 రోజుల్లోగా అన్ని చీరలు గోదాముల్లోకి వచ్చాక మండలాలకు పంపిస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చీరలపై ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటున్నాం.. వారి అభిప్రాయాలను ప్రభుత్వానికి పంపిస్తాం.  – జహీరొద్దీన్, చేనేత, జౌళీశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top