breaking news
bathukamma gifts
-
చీరలెలా ఉన్నాయి?
నల్లగొండ టూటౌన్ : జిల్లాకు బతుకమ్మ చీరలు వచ్చాయి. బతుకమ్మ పండుగ కానుక కింద జిల్లాలో ఈ ఏడాది 5.07 లక్షల చీరలు అవసరం ఉంటాయని జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు కూడా పంపారు. ప్రస్తుతానికి జిల్లాకు 1.08 లక్షల చీరలు చేరాయి. మిగతావి త్వరలో రానున్నాయి. గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకొని బతుకమ్మ చీరల తయారీలో నాణ్యత తీసుకుంది. వాటిపై మహిళలనుంచి ఫీడ్‌బ్యాక్‌ను తీసుకుంటోంది. అధికారులు జిల్లాలోని మున్సిపల్ పట్టణాల్లో ఎంపిక చేసిన చోట్ల చీరలను మహిళలకు చూపించి వారినుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. జిల్లాకు చేరిన 1.08 లక్షల చీరలు తెల్లరేషన్, అంత్యోదయ తదితర కార్డుదారులకు బతుకమ్మ కానుక కింద చీరలు అందించనున్నారు. జిల్లాకు 5.07 లక్షలకు గాను ఇప్పటికే 1.08 లక్షల చీరలు వచ్చాయి. నల్లగొండ రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి తిప్పర్తి గోదాములో 90 వేల చీరలు భద్రపరిచారు. మరో 18 వేల చీరలను దేవరకొండ డివిజన్‌కు సంబంధించి కొండమల్లేపల్లి గోదాములో ఉంచారు. మిర్యాలగూడ డివిజన్ కోసం అక్కడి గోదాములో పెట్టనున్నారు. మరో 15 రోజుల్లో జిల్లాకు అవసరమైన చీరలు చేరనున్నట్లు తెలిసింది. ఒక్కో చీరను టెస్కో నుంచి రూ.280కి కొనుగోలు చేసి పంపిణీ చేస్తుంది. జేసీ నేతృత్వంలో కమిటీ జిల్లాలో మున్సిపల్ పట్టణాలతోపాటు గ్రామ పంచాయతీల్లో బతుకమ్మ చీరల పంపిణీకి జేసీ నారాయణరెడ్డి నేతృత్వంలో నోడల్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లాస్థాయిలో జేసీ, చేనేత జౌళీశాఖ ఏడీ, మెప్మా పీడీ, హౌజింగ్ పీడీతోపాటు మరికొంత మంది అధికారులు ఉంటారు. అదే విధంగా డివిజన్ పరిధిలో ఆర్డీఓ నేతృత్వంలో, మండల స్థాయిలో ఎంపీడీఓ, గ్రామస్థాయిలో పంచాయతీ, వీఆర్వోల నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బతుకమ్మ చీరల పంపిణీ సాఫీగా సాగేలా కమిటీలు పర్యవేక్షణ చేయనున్నాయి. మహిళలనుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్న ప్రభుత్వం ... గత ఏడాది జరిగిన సంఘటలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. జిల్లాలోని మున్సిపాలిటీ పట్టణాల్లో కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి బతుకమ్మ చీరలను మహిళలకు చూపించి వారినుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఒక్కో పట్టణంలో ఐదు పాయింట్లు ఏర్పాటు చేసి మహిళలు వ్యక్తం చేసిన వారి అభిప్రాయాలను నోట్ బుక్‌లో రాసుకుంటున్నారు. కొన్నిచోట్ల మహిళలు భిన్నాబిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఒక్కో చోటుకు ఐదు చీరలను పంపించగా.. అన్నీ ఒకే మోడల్‌గా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. పండుగకు ముందు చీరలు పంచుతాం మహిళలకు పంపిణీ చేయడానికి 1.08 లక్షల బతుకమ్మ చీరలు జిల్లాకు వచ్చాయి. మరో 15 రోజుల్లోగా అన్ని చీరలు గోదాముల్లోకి వచ్చాక మండలాలకు పంపిస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చీరలపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం.. వారి అభిప్రాయాలను ప్రభుత్వానికి పంపిస్తాం. – జహీరొద్దీన్, చేనేత, జౌళీశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ -
సిరిసిల్ల చీర.. పేదింటికి సారె!
- ఆడపడుచులకు బతుకమ్మ కానుక - తెల్లకార్డు కుటుంబాలకు పంపిణీ - నేతన్నకు ఉపాధి ధీమా.. రూ.113 కోట్ల విలువైన చీరలకు ఆర్డర్లు సాక్షి, హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగ కానుకగా పేదింటి ఆడపడుచులకు సిరిసిల్ల చీరలను పంపిణీ చేసే కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. అటు చేనేతలకు, ఇటు పేద కుటుంబాలకు బహుళ ప్రయోజనకరంగా ఉండేలా ఈ పథకాన్ని రూపొందించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. చేనేత, జౌళి శాఖ మంత్రి కె.తారక రామారావు సంబంధిత అధికారులతో ఇప్పటికే పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. సిరిసిల్లలో మరమగ్గాలపై తయారు చేసే చీరలను ప్రభుత్వమే కొనుగోలు చేసి పంపిణీ చేయటం ద్వారా.. అక్కడి నేతన్నలకు ఆర్థికంగా భరోసా కల్పించినట్లవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రంజాన్ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు, క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్ కుటుంబాలకు దుస్తులను పంపిణీ చేస్తోంది. రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ సంబురాల సమయంలో పేదింటి ఆడపడుచులకూ చీరలు పంపిణీ చేస్తే పేద కుటుంబాలకు చిరు కానుక అందించినట్లు ఉంటుందని సర్కారు నిర్ణయం తీసుకుంది. 86 లక్షల తెల్ల రేషన్ కార్డులు.. రాçష్ట్రంలో దాదాపు 86 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. తెల్ల కార్డు కుటుంబాలన్నింటికీ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు అవసరమయ్యే చీరల తయారీకి ఇప్పటికే చేనేత, జౌళి శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైన మేరకు బడ్జెట్ కేటాయిం చేందుకు సీఎం కూడా ఆమోదం తెలిపారు. కార్మికుల ఆత్మహత్యలు, ఆకలి చావులతో సంక్షోభంలో ఉండే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు శాశ్వత ఉపాధి కల్పించేందుకు దోహదపడేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. నేతన్నకు చేతినిండా పని.. ప్రభుత్వ నిర్ణయంతో సిరిసిల్ల నేతన్నలకు చేతినిండా పని దొరికినట్లయింది. ఇప్పటికే రాజీవ్ విద్యామిషన్ స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్స్, కేసీఆర్ కిట్లలో చీరల తయారీ ఆర్డర్లను ప్రభుత్వం సిరిసిల్ల కార్మికులకే అప్పగించింది. యూనిఫామ్‌కు అవసరమయ్యే 1.03 కోట్ల మీటర్ల వస్త్రాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కేసీఆర్ కిట్ల పంపిణీలో భాగంగా 1.18 లక్షల చీరలకు ఆర్డర్లు ఇచ్చింది. ఈ ఏడాది బతుకమ్మ పండగకు 86 లక్షల మంది మహిళలకు చీరలు అందించాలంటే.. దాదాపు 5.41 కోట్ల మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే చీరల తయారీ మొదలైంది. చేనేత, జౌళి శాఖ బతుకమ్మ చీరలకు ఇచ్చిన ఆర్డర్ల విలువ దాదాపు రూ.113 కోట్లు. ఒక్కో బతుకమ్మ చీరకు ప్రభుత్వం రూ.230 ధర చెల్లించనుంది. ప్రస్తుతం ఎనిమిది రకాల రంగులతో ఈ చీరలు ఉత్పత్తి అవుతున్నాయి. వృద్ధులకు 8 రంగుల చీరలు, 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు వారికి 40 రకాల ప్రింటింగ్ చీరలను బతుకమ్మ పండుగకు కానుకగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. సెప్టెంబర్ 1 నాటికి ఆర్డర్లు పూర్తి స్థాయిలో అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు 15 వేల మంది బతుకమ్మ చీరల ఆర్డర్లతో ఉపాధి పొందుతున్నారని చేనేత, జౌళి శాఖ అంచనా వేసింది.