
సమావేశంలో మాట్లాడుతున్న యూఎఫ్‌బీయూ కన్వీనర్ శర్మ
హైదరాబాద్: బ్యాంకు ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ బ్యాంక్స్ అసోసి యేషన్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 30, 31 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) ఏపీ, తెలంగాణ శాఖలు వెల్లడించాయి. సమ్మె కారణంగా దేశంలోని బ్యాంక్‌లు మూతపడనున్నాయని, ఖాతాదారులు పరిస్థితిని అర్థం చేసుకొని ఉద్యోగులకు సహకరించాలని బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో యూఎఫ్‌బీయూ కన్వీనర్ వీవీఎస్‌ఆర్ శర్మ కోరారు.
వేతన సవరణ త్వరితగతిన అమలు చేయాలని, అధికారులకు వేతన సవరణతోపాటు పాక్షిక ఆదేశాలను అమలు చేయాలని దేశంలో 10 లక్షలమంది బ్యాంకు ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 5 ఉద్యోగుల, 4 అధికారుల సంఘాల సంయుక్త వేదిక, యూఎఫ్‌బీయూలు సమ్మె బాటపట్టాయని చెప్పారు. బ్యాంకు ఉద్యోగులకు 2017 నవంబర్ నుంచి వేతన సవరణ జరపాల్సి ఉండగా ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదన్నారు.
ఇప్పటివరకు 12సార్లు పలు దఫాలుగా చర్చలు జరిపినా వేతన సవరణ ఒప్పందం అసంపూర్తిగానే మిగిలిపోయిందన్నారు. ప్రతియేటా ప్రభుత్వరంగ బ్యాంకులు నికరలాభం సంపాదిస్తున్నా, లాభాల్లో వస్తున్న తరుగుదలను కుంటిసాకుగా చూపి కేవలం 2 శాతం వేతన పెంపును ప్రతిపాదించడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో పి.వెంకటరామయ్య (బీఈఎఫ్‌ఐ), అనిల్‌కుమార్, గిరిశ్రీనివాస్ (ఏఐబీవోఏ), బి.సుక్కయ్య (ఏఐబీఓసీ), టి.వెంకటస్వామి (ఐఎన్‌బీఈఎఫ్)లు పాల్గొన్నారు.