
బక్రీద్
సాక్షి, హైదరాబాద్ : ఈద్–ఉల్–జుహ (బక్రీ ద్) పండుగను ఈ నెల 22వ తేదీనే (బుధవారం) జరుపుకోవాలని రుహియతే హిలాల్ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ) సోమవారం ప్రకటించింది. ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం ఏటా జిల్ హజ్ నెలలో నెలవంక దర్శనం ఇచ్చిన పదవ రోజు ముస్లింలు బక్రీద్ పండుగ జరుపుకుంటారని తెలిపారు. ఈ ఏడాది నెలవంక దర్శనం ఇచ్చిన పదవ రోజైన ఆగస్టు 22న పండుగ జరుపుకోవాలని కమిటీ అధ్యక్షుడు మౌలానా ఖుబ్బుల్‌పాషా ఖుత్తారీ పేర్కొన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా 22వ తేదీని సాధారణ సెలవుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2018కి సంబంధించిన సాధా రణ, ఐచ్ఛిక సెలవులను ప్రకటిస్తూ గతేడాది నవంబర్ 24న జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ మేరకు స్పష్టతనిచ్చింది. కమిటీ సైతం ఈ నెల 22న బక్రీద్ జరుపుకోవాలని కోరిన నేపథ్యంలో ఎలాంటి మార్పులు లేకుండా సాధారణ సెలవు వర్తించనుంది. దీనిపై మంగళవారం ప్రభుత్వం మరోసారి స్పష్టతిచ్చే అవకాశముంది.