గని ప్రమాదానికి అధికారులే కారకులు | Authorities shall be mine accident | Sakshi
Sakshi News home page

గని ప్రమాదానికి అధికారులే కారకులు

Apr 21 2016 2:25 AM | Updated on Sep 2 2018 4:16 PM

గని ప్రమాదానికి అధికారులే కారకులు - Sakshi

గని ప్రమాదానికి అధికారులే కారకులు

మందమర్రి ఏరియా శాంతిఖనిలో జరిగిన గని ప్రమాదానికి సింగరేణి అధికారులే పూర్తి బాధ్యత వహించాలని జేఏసీ చైర్మన్.....

బెల్లంపల్లి : మందమర్రి ఏరియా శాంతిఖనిలో జరిగిన గని ప్రమాదానికి సింగరేణి అధికారులే పూర్తి బాధ్యత వహించాలని జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. బుధవారం బెల్లంపల్లికి వచ్చిన ఆయన ఇటీవల పైకప్పు కూలి శాంతిఖని గనిలో మృతి చెందిన ముగ్గురు కార్మికుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకుముందు మృతుల చిత్రపటాల వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం నంబర్ 2 ఇంక్లైన్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో విలేకరులతో మాట్లాడారు.

గనిలో రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లనే పైకప్పు కూలి హన్మంతరావు, పోశం, కిష్టయ్య ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. బొగ్గు గనుల్లో కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పూర్తి బాధ్యత యాజమాన్యానిదేనని అన్నారు. శాంతిఖని గనిలో కొన్నాళ్ల నుంచి సేఫ్టీని అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. బొగ్గు అధికోత్పత్తి సాధించాలనే కాంక్షతో అధికారులు కంటిన్యూయస్ మైనర్ యంత్రంపైనే ప్రధానంగా దృష్టి పెట్టారే తప్ప సేఫ్టీని పట్టించుకోలేదన్నారు.

గని ప్రమాదం, ఎక్స్‌గ్రేషియా చెల్లింపు, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునే అంశాలపై సింగరేణి సీఅండ్‌ఎండీ, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఆయన తెలిపారు. సమావేశంలో టీవీవీ తూర్పు జిల్లా అధ్యక్షుడు పి.సంజీవ్, ప్రధాన కార్యదర్శి ఇ.చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు జి.మోహన్, జిల్లా బాధ్యుడు అడ్లూరి వెంకటస్వామి,కాంగ్రెస్ బల్దియా ఫ్లోర్ లీడర్ కటకం సతీష్ కుమార్, రిటైర్డు ఏఈ కనకయ్య, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు ఎనగందుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement