దొంగలనుకొని గ్రామస్తుల దాడి

Attacks on many houses in Chengal - Sakshi

గిరిజనుడి మృతి.. మరొకరి పరిస్థితి విషమం

ఆందోళనకు దిగిన 12 తండాల గిరిజనులు 

చేంగల్‌లో పలువురి ఇళ్లపై దాడులు..

తీవ్ర ఉద్రిక్తత.. పోలీసుల మోహరింపు 

భీమ్‌గల్‌ (బాల్కొండ): గ్రామస్తుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ గిరిజనుడు మృతి చెందాడన్న వార్త నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం చేంగల్‌ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విషయం తెలుసుకున్న సమీపంలోని 12 తండాల గిరిజనులు చేంగల్‌ గ్రామంలోని పలు ఇళ్లపై దాడులకు దిగారు. అడ్డుకోబోయిన పోలీసులపై ఎదురుతిరిగారు. ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు గ్రామస్తులు భయపడ్డారు. ఒకదశలో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. మంగళవారం దొంగలుగా భావించి గ్రామస్తులు జరిపిన దాడిలో నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లి మండలం డీబీ తండాకు చెందిన మాలావత్‌ దేవ్యా (40), దేగావర్‌ లాలూ గాయపడ్డారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దేవ్యా బుధవారం మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న గిరిజనులు చేంగల్‌కు చేరుకొని ఆందోళనకు దిగారు. అడిషనల్‌ డీసీపీ శ్రీధర్‌ రెడ్డి నేతృత్వంలో సుమారు 10 మంది సీఐలు, 15 మంది ఎస్సైలతో సహా 100 మంది సిబ్బందిని రంగంలోకి దింపి పరిస్థితిని అదుపు చేసేందుకు విఫలయత్నం చేశారు. చివరకు నిజామాబాద్‌ ఆర్డీవో వినోద్‌కుమార్‌ రంగంలోకి దిగి గిరిజన పెద్దలతో చర్చలు జరిపారు. బాధిత కుటుంబానికి రూ.8.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్‌ బెడ్‌రూం ఇల్లు, ఐదెకరాల ప్రభుత్వ భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దాడికి పాల్పడిన 12 మంది నిందితులను అదుపులోకి తీసుకుని హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. వీడియో ఫుటేజీ ఆధారంగా ఇంకా ఎంత మంది ఉన్నా వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. దీంతో గిరిజనులు శాంతించి వెనుదిరిగారు. గ్రామంలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top