‘ఏటీఎం’ మోసగాడి అరెస్ట్‌

ATM Cheater Arrest - Sakshi

మంచిర్యాలటౌన్‌:    మంచిర్యాల జిల్లాలో ఏటీఎంలకు వచ్చే వారిని ఏమార్చి, కార్డులను తారుమారు చేసి వారి డబ్బులను కాజేస్తున్న ఓ మోసగాడిని శనివారం అరెస్టు చేసినట్లు మంచిర్యాల పట్టణ సీఐ ఎడ్ల మహేష్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం పట్టణంలోని లక్ష్మీ థియేటర్‌ సమీపంలో చెరకు రసం వ్యాపారి సింద కృష్ణ ఈనెల 12న ఐబీ చౌరస్తాలోని ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లాడు. కానీ, డబ్బులు రాకపోవడంతో కృష్ణ వెనుదిరుగుతుండగా వెనకాలే ఉన్న ఓ వ్యక్తి తాను డ్రా చేసి ఇస్తానంటూ కృష్ణ ఏటీఎం తీసుకున్నాడు.

ఇతను కూడా డబ్బులు రావడం లేదని చెప్పి కృష్ణకు ఏటీఎం వాపసిచ్చాడు. కానీ, ఆ వ్యక్తి కృష్ణకు అసలు ఏటీఎం కాకుండా, తన వద్ద ఉన్న మరో నకిలీ ఏటీఎంను ఇచ్చాడు. ఏటీఎం దగ్గరి నుంచి కృష్ణ వెళ్లిపోగానే, ఆ వ్యక్తి తన దగ్గరున్న కృష్ణ అసలు ఏటీఎం కార్డు ద్వారా రూ.14,500లను డ్రా చేసుకుని ఉడాయించాడు. తన సెల్‌కు మెసేజ్‌ రావడంతో మోసపోయినట్లు గ్రహించిన కృష్ణ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా డబ్బులు కాజేసిన వ్యక్తిని బెల్లంపల్లి ఓసీపీ–కేకే–2లో నివాసముండే ఉంటున్న గంధం మహేందర్‌గా పోలీసులు గుర్తించారు.

మోసపోయిన కృష్ణకు నిందితుడు ఇచ్చిన ఏటీఎం కార్డు వివరాల ఆధారంగా విచారించి, శనివారం బస్టాండ్‌ దగ్గర నిర్వహించిన తనిఖీల్లో నిందితుడు మహేందర్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సీఐ వివరించారు. ఇతని నుంచి రూ.14,500 నగదుతోపాటు, మరో 3 డమ్మీ ఏటీఎం కార్డులను స్వాదీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్సై మారుతితోపాటు సిబ్బంది జైచందర్, సత్యం పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

సంబంధిత వార్తలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top