దేవుడి శాఖలో మరో వింత నిబంధన

Another strange testament in the Ministry of Endowments - Sakshi

పదవీ విరమణ చేసిన ఈఓలకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ జారీలో మెలికలు 

పనిచేసిన ప్రతీచోట నుంచి నో అబ్జెక్షన్‌ పత్రం తేవాల్సిందేనని నిబంధన 

అప్పుడే పింఛన్‌ మంజూరు.. 

క్లర్క్‌గా పనిచేసిన దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న మాజీ అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: ఆయన దేవాదాయ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా 35 ఏళ్ల క్రితం చేరాడు. ఏడాదిక్రితం కార్యనిర్వహణాధికారి (ఈఓ)గా పదవీ విరమణ పొందారు. తన రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కోసం దరఖాస్తు చేసుకోగా, దేవాదాయశాఖలో చేరిన నాటి నుంచి ఏయే దేవాలయాల్లో పనిచేశారో, ఆయా దేవాలయాల ఈఓల నుంచి ‘నో అబ్జెక్షన్‌’సర్టిఫికెట్స్‌ తెచ్చి దాఖలు చేయాలని హుకుం జారీ చేశారు. ఆయా దేవాలయాల్లో ఆయన పనిచేసి బదిలీ అయినప్పుడు అన్ని బాధ్యతలు సవ్యంగానే అప్పగించారని, ఎక్కడా ఎలాంటి తప్పులు జరగలేదని ఈఓ సర్టిఫై చేస్తేనే రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అప్పగిస్తామని మెలిక పెట్టారు.

ఆయా దేవాలయాలకు వెళ్లి సర్టిఫికెట్‌ కోసం అడిగితే, ‘ఆ సమయంలో మేం లేం కదా, నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ మేమెలా ఇస్తాం’అంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో పదవీ విమరణ పొంది ఏడాది దాటుతున్నా బెనిఫిట్స్‌ అందటం లేదు, పింఛనూ రావటం లేదు. ఇది ఒక్క అధికారికే పరిమితం కాలేదు. ఇటీవల పదవీ విరమణ పొందిన కార్యనిర్వహణాధికారులు ఎదుర్కొంటున్న సమస్య. ఓ పద్ధతి లేకుండా కొందరు అధికారుల ఇష్టారాజ్యంగా మారిన దేవాదాయశాఖలో ఇప్పుడు జరుగుతున్న వ్యవహారమిది. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందక ఆ మాజీ అధికారులు, గతంలో తాము పనిచేసిన ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.  

ఇదీ సంగతి...
ఏ విభాగంలో అయినా సిబ్బంది పదవీ విరమణ పొందిన వెంటనే రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందుతాయి. ఆ వెంటనే పింఛను మంజూరవుతుంది. కానీ, కొందరు అధికారుల ఇష్టారాజ్యానికి చిరునామాగా మారిన దేవాదాయశాఖలో ఇప్పుడు వింత వ్యవహారం చోటు చేసుకుంది. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌తో ప్రమేయం లేకుండా నేరుగా నియామకాలు జరిగే ఏౖకైక ప్రభుత్వ విభాగం దేవాదాయశాఖ. ఆలయ ట్రస్టీలు, కమిషనరేట్‌లోని కొందరు అధికారులు కూడబలుక్కుంటే అర్హతలతో సంబంధం లేకుండా క్లర్క్‌లుగా నియమించే విధానం ఇందులో ఉంది. అలా క్లర్కులుగా నియమితులై ఆ తర్వాత వేర్వేరు ఆలయాలకు బదిలీ అవుతూ పదోన్నతులు పొందుతుంటారు.

సీనియారిటీ ప్రకారం కార్యనిర్వహణాధికారులుగా ప్రమోట్‌ అయి ఆ తర్వాత సర్వీసు ఉంటే అసిస్టెంట్‌ కమిషనర్, ఆ పై పోస్టులకు కూడా పదోన్నతులు పొందుతారు. కొందరు ఈఓ స్థాయిలోనే రిటైర్‌ అవుతారు. గత ఏడాదిన్నరగా రిటైర్‌ అయిన వారికి కొత్త చిక్కొచ్చిపడింది. సాధారణంగా ఈఓగా పదోన్నతి పొందిన తర్వాత దేవాలయాల బాధ్యత పూర్తిగా వారి చేతిలో ఉంటుంది. మరో దేవాలయానికి బదిలీ అయినప్పుడు ఆ ఆలయ దేవరుల నగలు మొదలు, ఇతర అన్ని లెక్కలను తదుపరి ఈఓకు అప్పగించాలి. ఇప్పుడు ఆ అప్పగింతల తాలూకు ఆరోపణలు, ఫిర్యాదులు ఏమీ లేవన్నట్టుగా ఆయా దేవాలయాల ఈఓల నుంచి నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్లు కోరారు. కానీ విచిత్రంగా... ఈఓలుగా పదోన్నతి పొందిన నాటి నుంచే కాకుండా, క్లర్క్‌గా విధుల్లో చేరినప్పటి నుంచి ఈ సర్టిఫికెట్లు దాఖలు చేయాలని ఆదేశించారు.

అయితే ప్రారంభం నుంచి పరిశీలిస్తే ఒక్కో అధికారి 20 నుంచి 30 వరకు ఆలయాల్లో పనిచేసి ఉంటారు. అన్ని ఆలయాల నుంచి సర్టిఫికెట్లు తేవటం వారికి సవాల్‌గా మారింది. వారు బదిలీ అయినప్పుడు తాము ఆ దేవాలయంలో లేనందున, ఇప్పుడు నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ ఇస్తే, గతంలో జరిగిన లోపాల వివరాలు భవిష్యత్తులో వెలుగు చూస్తే తాము ఇబ్బందుల్లో పడతామని, అందువల్ల తాము సర్టిఫై చేయలేమని వారు చేతులెత్తేస్తున్నారు. దీంతో అన్ని దేవాలయాల నుంచి నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్లు రాక వీరి రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ జారీ కొలిక్కి రావటం లేదు. పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్‌ చేసే ఉద్దేశంతోనే ఇలా వేధిస్తున్నారంటూ సిబ్బంది ఆరోపిస్తున్నారు. తాను ఏడాదిన్నర నుంచి బెనిఫిట్స్‌ కోసం తిరుగుతున్నా అధికారులు కనికరించటం లేదని, తనకు అటు జీతం లేక ఇటు పింఛను రాక ఇబ్బందిగా మారిందని ఓ రిటైర్డ్‌ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top