ఉపాధ్యాయ బదిలీలకు రంగం సిద్ధం! 

All set for teacher transfers - Sakshi

పలు జిల్లాల్లో సీనియారిటీ జాబితాల ప్రకటన 

6 నుంచి 8 వరకు అభ్యంతరాల స్వీకరణ 

ఒకట్రెండు రోజుల్లో మార్గదర్శకాలు 

ఆన్‌లైన్‌ బదిలీల సమస్యలపై డెమో

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు రంగం సిద్ధమైంది. మార్గదర్శకాల జారీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు బదిలీల్లో ఎదురయ్యే సమస్యలు.. వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై విద్యా శాఖ ఉన్నతాధికారులు డెమో నిర్వహించారు. పాఠశాల విద్య కమిషనర్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య, ఇన్‌చార్జి కమిషనర్‌ అధర్‌ సిన్హా, సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం, సమస్యలపై పరిశీలన జరిపారు. ఉపాధ్యాయ సంఘాల నుంచి వెల్లువెత్తుతున్న అభ్యంతరాలపైనా చర్చించారు. అధికారులు రూపొందించిన వెబ్‌సైట్‌లో ఉన్న అంశాలు.. చేర్చాల్సిన విషయాలపై చర్చలు జరిపారు. మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు లేవనెత్తుతున్న సమస్యలపైనా చర్చించినట్లు సమాచారం.  

ఆన్‌లైన్‌ బదిలీకే మొగ్గు..! 
ప్రభుత్వ ఆలోచన మేరకు ఆన్‌లైన్‌ బదిలీల వైపే అధికారులు మొగ్గుచూపుతున్నారు. సంఘాల నేతలు ఆఫ్‌లైన్‌లో బదిలీలు చేయాలని కోరుతున్నా.. ఆ ఒక్క విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఉన్నతాధికారి పేర్కొన్నారు. మరోవైపు జీవిత భాగస్వామి (స్పౌజ్‌)కేటగిరీలో ఇచ్చే ప్రాధాన్య పాయింట్లు దుర్వినియోగం కాకుండా భార్యాభర్తల్లో ఒకరు ఉన్న చోటికి మరొకరిని పంపించేలా ఏర్పాట్లు చేశారు. వారు పని చేసే స్కూల్‌ను జీపీఎస్‌ ద్వారా లింకు చేసి, అక్కడికే మరొకరిని పంపిస్తారు.

టీచర్‌ అయితే ఐదేళ్లు, హెడ్‌ మాస్టర్‌ అయితే 8 ఏళ్లు పూర్తయి తప్పనిసరి బదిలీలో ఉంటే వారిద్దరిని ఎక్కడికి పంపాలన్న దానిపై ఆన్‌లైన్‌లో సమస్య రాకుండా చూసేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. కాగా, ఆన్‌లైన్‌లో నాట్‌ విల్లింగ్‌కు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. పని చేస్తున్న ప్రదేశంలో రెండేళ్ల సర్వీసు ఉన్న వారు (బదిలీకి దరఖాస్తు చేసుకునే అర్హత కలిగినవారు) తమకు కచ్చితంగా కావాలనుకునే రెండు మూడు స్కూళ్లకు (ప్లేస్‌లు) మాత్రమే ఆప్షన్లు ఇచ్చుకోవాలని, వాటిల్లో వస్తే అలాట్‌ అవుతుందని, లేదంటే పాత స్కూల్లోనే ఉంటారని అధికారులు చెబుతున్నారు. అవి కూడా వద్దనుకుంటే బదిలీకే దరఖాస్తు చేసుకోవద్దని సూచిస్తున్నారు.  

ఇదీ ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానం.. 
- హెడ్‌మాస్టర్లు /http://cdse. telangana.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావాలి.  
వెబ్‌సైట్‌లో టీచర్ల ట్రాన్స్‌ఫర్‌ లింకును క్లిక్‌ చేయాలి. యూజర్‌ గైడ్‌లో పేర్కొన్న ప్రకారం దరఖాస్తు నింపాలి. మొబైల్‌ నంబర్, ఏడు అంకెల ట్రెజరీ ఐడీ, పుట్టిన తేదీ, వెరిఫికేషన్‌ కోడ్, మొబైల్‌ నంబర్‌కు వచ్చే వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేస్తే దరఖాస్తు ఫారం ఓపెన్‌ అవుతుంది. అందులో అన్ని వివరాలను నమోదు చేయాలి. ప్రాధాన్య క్రమంలో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. 
తప్పనిసరిగా బదిలీ అయ్యేవారు (హెడ్‌మాస్టర్‌/టీచర్‌) పని చేస్తున్న ప్రదేశం కాకుండా వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. తక్కువ ఆప్షన్లు ఇస్తే.. అందులో ఫిట్‌ కాకపోతే మిగిలిపోయే వెకెన్సీల్లో అలాట్‌ అయ్యే అవకాశం ఉంటుంది. 
బదిలీ అర్హత కలిగిన వారు (తప్పనిసరి కాని వారు) తమకు కావాల్సిన ప్రదేశాలనే ఎంచుకోవాలి. అలాగే పని చేస్తున్న ప్రదేశంలో ఉండాలనుకుంటే దాన్నే ఎంచుకోవాలి. ఎక్కువ ఆప్షన్లు ఇస్తే చివరి ఆప్షన్‌ ఇచ్చిన ప్రదేశంలోనూ అలాట్‌ అయ్యే అవకాశం ఉంటుంది. 
ఇప్పటివరకు ఖాళీగా ఉన్న ఖాళీలతో పాటు తప్పనిసరి బదిలీలతో ఖాళీ అయ్యే ప్రదేశాలు కంప్యూటర్‌ స్క్రీన్‌లో ఎడమ వైపు కాలమ్‌లో ఉంటాయి. 
మొదట మండలాల ఎంపిక తర్వాత ఖాళీలు అందుబాటులో ఉన్న పాఠశాల పేర్లను పొందడానికి సబ్మిట్‌ బటన్‌ నొక్కాలి. 
ఆ తర్వాత పాఠశాలల పేర్లు, మండలాల వివరాలు వస్తాయి. వాటిని ప్రాధాన్య క్రమంలో ఎంచుకోవాలి. 
అన్ని వివరాలను ఎంచుకున్న తర్వాత, ప్రివ్యూ బటన్‌ నొక్కాలి. అన్ని వివరాలు సరిగ్గా ఉంటేనే సబ్మిట్‌ నొక్కాలి. లేకపోతే ఎడిట్‌ చేసుకోవాలి. 
సీనియారిటీ, ఆప్షన్ల ఆధారంగా ప్లేస్‌లు అలాట్‌ అవుతాయి. 

‘నాట్‌ విల్లింగ్‌’కు నో చాన్స్‌ 
మాన్యువల్‌లో ఉన్నట్లుగా నాట్‌ విల్లింగ్‌కు అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. టీచర్ల బదిలీల్లో దశల వారీగా ఉండే దరఖాస్తు విధానాన్ని మంగళవారం వెల్లడించారు. దానిపైనే డెమో నిర్వహించారు. ఒకట్రెండు రోజుల్లో బదిలీల మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేయనుంది. ఇక హైదరాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఆన్‌లైన్‌లో టీచర్ల సీనియారిటీ జాబితాలను అందుబాటులో ఉంచారు. 5, 8 ఏళ్ల సర్వీసుతో తప్పనిసరి బదిలీ అయ్యే వారు, 2 ఏళ్ల సర్వీసు బదిలీలకు దరఖాస్తు చేసుకునే అర్హత కలిగిన వారు, మిగతా టీచర్లతో కూడిన జాబితాలను ప్రకటించారు. వాటిపై అభ్యంతరాలు ఉంటే 6 నుంచి 8 వరకు తెలపాలని సూచించారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో బదిలీల దరఖాస్తులకు అవకాశం కల్పించనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top