జీఎస్టీపైనే ఆశలన్నీ | All the hopes on the GST | Sakshi
Sakshi News home page

జీఎస్టీపైనే ఆశలన్నీ

Feb 23 2019 3:56 AM | Updated on Feb 23 2019 4:00 AM

All the hopes on the GST - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రాబడిపై గంపెడాశలు పెట్టుకుంది. ఈ ఏడాదికన్నా వచ్చే ఏడాది జీఎస్టీ ద్వారా గణనీయంగా పన్ను రాబడి ఉంటుందని అంచనా వేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో 2019–20 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తం రూ. 36,229.45 కోట్లు జీఎస్టీ ద్వారానే వస్తుందని పేర్కొన్నారు. అందులో రాష్ట్ర జీఎస్టీ (ఎస్‌జీఎస్టీ) ద్వారానే రూ. 30 వేల కోట్లు వస్తుందని, కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ) ద్వారా మరో రూ. 6,229.45 కోట్లు సమకూరుతుందని అంచనా వేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికిగాను ఎస్‌జీఎస్టీ ద్వారా రూ. 26,040 కోట్లు వస్తాయని అంచనా వేసినా సవరించిన అంచనాల్లో దాన్ని రూ. 22,264 కోట్లకు తగ్గించారు. కేంద్ర జీఎస్టీని వార్షిక అంచనాల్లో ప్రతిపాదించిన రూ. 6,181.16 కోట్ల నుంచి సవరించిన అంచనాల్లో రూ. 5,145.41 కోట్లకు తగ్గించారు. గతేడాదితో పోలిస్తే ఒక్క ఎస్‌జీఎస్టీ ద్వారా రూ. 8 వేల కోట్ల మేర ఆదాయం ఎక్కువగా వస్తుందని ఈసారి అంచనాల్లో పేర్కొనడం గమనార్హం.

కార్పొరేషన్‌ పన్నురూ. 5,000 కోట్ల పైమాటే
ప్రభుత్వం పేర్కొన్న మిగిలిన రాబడులను పరిశీలిస్తే కార్పొరేషన్‌ పన్ను ద్వారా రూ. 6,665 కోట్లు, ఇతర పన్నుల ద్వారా రూ. 5,600 కోట్లు వస్తాయని అంచనా వేశారు. రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఏడాదికి ఆదాయం తగ్గుతుందనే అంచనాలతో బడ్జెట్‌ ప్రవేశపెట్టడం గమనార్హం.2018–19 వార్షిక అంచనాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 4,699 కోట్లు వస్తాయని అంచనా వేయగా సవరించిన అంచనాల్లో దాన్ని రూ. 6,689 కోట్లకు పెంచారు. కానీ 2019–20 ఆర్థిక సంవత్సరానికి మాత్రం స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ద్వారా రూ. 5,405 కోట్లను మాత్రమే అంచనాల్లో చూపించారు. కస్టమ్స్‌ ద్వారా రూ. 1,293 కోట్లు, కేంద్ర ఎక్సైజ్‌ డ్యూటీ ద్వారా రూ. 794 కోట్లు వస్తుందని అంచనా వేశారు.

మద్యం రాబడిరూ. 12,000 కోట్లు 
పన్నుల రాబడిలో భాగంగా రాష్ట్ర ఎౖMð్సజ్‌శాఖ ద్వారా రూ. 12,190 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఈ ఏడాదితో పోలిస్తే 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్‌ ఆదాయం రూ. 2,123 కోట్లు పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. అమ్మకాలు, వర్తకంపై పన్నుల రూపంలో రూ. 31,504 కోట్లు, వాహనాలపై పన్నుల ద్వారా రూ. 4,542 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది.

గ్రాంట్ల రూపంలోరూ. 9,000 కోట్లు
వివిధ రెవెన్యూ సహాయక గ్రాంట్లు, విరాళాల ద్వారా రూ. 9,960 కోట్లు సమకూరుతుందని బడ్జెట్‌ అంచనాల్లో పేర్కొన్నారు. వివిధ సాధారణ సర్వీసులకు రూ. 3,270 కోట్లు, గనులు, లోహ పరిశ్రమలకు రూ. 4,800 కోట్లు గ్రాంట్ల రూపంలో వస్తుందని అంచనా వేశారు. దీనికితోడు కేంద్ర ఎక్సైజ్‌ సుంకంలో రాష్ట్ర వాటా కింద రూ. 22,835 కోట్లు వస్తుందని, సేవింగ్స్‌ రాబడి రూ. 2,994 కోట్లు ఉంటుందనే అంచనాతో రెవెన్యూ రాబడిని బడ్జెట్‌ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement