
గిరిబాబును అక్కినేని పురస్కారంతో సత్కరిస్తున్న రోశయ్య తదితరులు
హైదరాబాద్ : అట్టడుగు స్థాయి నుంచి అత్యన్నత స్థానానికి చేరుకున్న మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు జీవితం ఆదర్శప్రాయమైందని వక్తలు కొనియాడారు. యువ కళావాహిని, గురుప్రసాద్ కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం శ్రీ త్యాగరాయ గానసభలో గురుప్రసాద్ కల్చరల్ ఫెస్టివల్ ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే ఫెస్టివల్‌లో తొలిరోజు సభకు ముఖ్య అతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్ డా.కె.రోశయ్య మాట్లాడారు.
అలనాటి మహోన్నత నటులను స్మరించుకోవటం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు గిరిబాబును అక్కినేని పురస్కారంతో ఘనంగా సత్కరించారు. సభకు సారిపల్లి కొండలరావు అధ్యక్షత వహించగా దర్శకుడు రేలంగి నరసింహారావు, రచయిత్రి డా.కె.వి.కృష్ణకుమారి, నిర్మాత ఎన్.ఆర్.అనూరాధాదేవి, వై.కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు గాయనీ గాయకులు ఆమని, కె.వెంకట్రావు, వి.కె.దుర్గ, సుభాష్, మురళీధర్, పవన్‌కుమార్, కె.దుర్గాప్రసాద్ సినీ గీతాలు మధురంగా ఆలపించారు.