ప్రతి ఉద్యోగి ఓటేసేలా.. 

 Active Programs For Participating Employees In The Election Duties - Sakshi

ప్రతి ఉద్యోగి ఓటేసేలా..

పోస్టల్‌ బ్యాలెట్‌ సద్వినియోగానికి కసరత్తు 

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు చైతన్య కార్యక్రమాలు

సాక్షి, రంగారెడ్డి జిల్లా: పోస్టల్‌ బ్యాలెట్‌పై యంత్రాంగం నిశిత దృష్టి సారించింది. ఎన్నికల విధుల్లో పాలుపంచుకుంటున్న ఉద్యోగులు, సిబ్బంది వంద శాతం తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్ట చర్యలు తీసుకుంటోంది. గత ఎన్నికల్లో 26.18 శాతం మందే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేశారు.

ఇంత తక్కువ శాతం మంది ఓటేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న యంత్రాంగం.. ఈసారి ప్రతిఒక్కరూ ఓటేసేలా చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ విధానంపై దాదాపుగా అవగాహన కల్పించారు. మైక్రోఅబ్జర్వర్లకు మాత్రం వచ్చేనెల 2వ తేదీన తర్ఫీదు ఇవ్వనున్నారు.  

పది వరకు అవకాశం.. 
జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల విధుల్లో సుమారు 35 వేల మంది ఉద్యోగులు, సిబ్బంది, ఇతరులు పాల్గొనున్నారు. వీరంతా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేసేందుకు ప్రతి నియోజకవర్గం పరిధిలో రిటర్నింగ్‌ ఆఫీసర్‌ వద్ద పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. నిర్దేశిత ఫార్మాట్‌లో ఫారంలను పూర్తి చేసి ఇక్కడ ఉన్న డ్రాప్‌ బాక్స్‌లో బ్యాలెట్‌ను వేయాల్సి ఉంటుంది.

ఈనెల 27 నుంచి ఫారం–12లను (పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తు పత్రం) ఉద్యోగులకు అందజేస్తున్నారు. వచ్చేనెల 3వ తేదీ వరకు దరఖాస్తు ఫారాలను ఇవ్వనున్నారు. నిర్దేశిత ఫార్మాట్‌లో పూర్తిచేసి వచ్చేనెల 10వ తేదీలోగా పోస్టల్‌ బ్యాలెట్‌ను డ్రాప్‌ బాక్స్‌లో వేయొచ్చు.

లేదంటే స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా ఉద్యోగుల ఓటు హక్కు ఉన్న రిటర్నింగ్‌ ఆఫీసర్‌ చిరునామాకు పంపొచ్చు. ఇప్పటివరకు 1,545  మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top