
చట్ట ప్రకారమే గవర్నర్‌కు అధికారాలు
ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్ట ప్రకారమే కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.
అప్పుడు అంగీకరించి ఇప్పుడు మోడీపై నెపమా?
కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: కిషన్‌రెడ్డి
హైదరాబాద్: ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్ట ప్రకారమే కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆచారి, అధికార ప్రతినిధి ప్రకాష్‌రెడ్డి, నాయకులు ప్రేమేందర్‌రెడ్డి, రఘునందన్‌రావులతో కలిసి మాట్లాడారు. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును ఉభయసభల్లో ప్రవేశపెట్టినప్పుడు గవర్నర్ అధికారాలపై అంగీకరించిన కేసీఆర్ ఇప్పుడు ఆ నెపాన్ని బీజేపీపై, ప్రధానమంత్రి నరేంద్రమోడీపై మోపేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ బీజేపీ లక్ష్యంగా విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ఉండాలని భావించకుండా కయ్యానికి కాలు దువ్వుతోందన్నారు. ఎంఐఎంతో టీఆర్‌ఎస్‌కు సఖ్యత కుదరడంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీ నేతలు బీజేపీని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు.
సీమాంధ్రలో తమ పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగినా, అనేక రకాలుగా ఒత్తిడులు వచ్చినా, మాట తప్పకుండా తెలంగాణ బిల్లును లోక్‌సభ, రాజ్యసభల్లో పాస్ చేయిస్తే కేసీఆర్ ఈ రోజు బీజేపీని తెలంగాణ ద్రోహిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్‌కు అధికారాలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తానని కేసీఆర్ పేర్కొన్నారని, కానీ కేసీఆర్‌తో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వాస్తవాలను వివరిస్తూ తాము కూడా లేఖలు రాస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. వీలైనంత త్వరగా ఏపీ ప్రభుత్వం సీమాంధ్ర రాజధానికి తరలివెళ్లాలని బీజేపీ కోరుకుంటోందని చెప్పారు. బీజేపీని లక్ష్యంగా చేసుకుని టీఆర్‌ఎస్ విమర్శిస్తుంటే అన్ని విషయాలు తెలిసిన టీజేఏసీ ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ప్రశ్నించారు.