రబీకి 5 లక్షల క్వింటాళ్ల విత్తనాలు

5 Million Quintals Of Seeds Ready For Rabi In Telangana - Sakshi

అందులో సగం వరి విత్తనాలు..

రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: రబీకి విత్తనాలు, ఎరువులను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తోంది. ఈ నెల 1 నుంచి రబీ సీజన్‌ ప్రారంభం కావడంతో ప్రణాళిక పూర్తి చేసింది. ఈ రబీలో 5 లక్షల క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల వారీగా కేటాయింపులు చేసి, కొన్ని విత్తనాలను క్షేత్రస్థాయికి పంపింది. సబ్సిడీ విత్తనాల కోసం ప్రభుత్వం రూ.87.09 కోట్లు కేటాయించింది. అందులో 75 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలకు సబ్సిడీ రూ.30 కోట్లు ఖర్చు చేయనుంది. రబీలో సాగు చేసే శనగ, వేరుశనగ విత్తనాలను ఇప్పటికే ఆయా జిల్లాలకు పంపారు. శనగలు 1.5 లక్షల క్వింటాళ్లు, వేరుశనగ 75 వేల క్వింటాళ్లు అందుబాటులో ఉంచనున్నా రు. మొత్తం సరఫరా చేసే విత్తనాల్లో వరి 2.5 లక్షల క్వింటాళ్లు, మొక్కజొన్న 12 వేల క్వింటాళ్లు, పప్పుధాన్యాల విత్తనాలు 8,500 క్వింటాళ్లు రబీకి అందజేయనున్నారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ, నేషనల్‌ సీడ్‌ కార్పొరేషన్‌ ద్వారా పంపిణీ చేస్తారు. జిల్లాల్లో 22,767 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉంచగా, అందులో 20,136 క్వింటాళ్లు రైతులకు పంపిణీ చేశారు. 

గడ్డకట్టిన యూరియా 
అంటగట్టేలా చర్యలు..

రబీకి కూడా రాష్ట్రానికి ఎరువుల కేటాయింపు పెంచాలని వ్యవసాయ శాఖ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ రబీకి కేంద్రం 7 లక్షల మెట్రిక్‌ టన్నులు ఎరువులు రాష్ట్రానికి కేటాయించింది.lవాస్తవానికి రాష్ట్ర అవసరాలకు 7.5 లక్షల మెట్రిక్‌ టన్నులు అవసరమని ప్రతిపాదించింది. యూరియాను ఎంఆర్‌పీ ధరకే విక్రయించాలని నిర్ణయించారు. అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్స్‌ ఫీజు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. మరోవైపు గడ్డకట్టిన పాత యూరియాను రైతులకు అంటగట్టాలని మార్క్‌ఫెడ్‌ ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మార్క్‌ఫెడ్‌ వద్ద దాదాపు 5 వేల మెట్రిక్‌ టన్నుల గడ్డకట్టిన యూరియా ఉంది. అది 2013–14 నుంచి 2015–16 మధ్యకాలంలో గోదాముల్లో పేరుకుపోయి ఉంది. దాన్ని ఎలాగైనా రైతులకు, సహకార సొసైటీలకు అంటగట్టాలని భావిస్తోంది. కానీ రైతులు, సహకార సొసైటీలు దీన్ని తీసుకునేందుకు ముందుకు రావట్లేదు. ధర తక్కువ ఉన్నా కూడా అవసరం లేదని రైతులు చెబుతున్నారు. కానీ ఎలాగైనా అంటగట్టాల్సిందేనని జిల్లాలకు మార్క్‌ఫెడ్‌ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం యూరియా 45 కిలోల బస్తాలతో ఉండగా, పాత యూరియా 50 కిలోల బస్తాలతో ఉన్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top