
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా నేటి (మంగళవారం) నుంచి హైదరాబాద్ లాక్‌డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నామని హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఇప్పటికే వాహనదారులకు ఇచ్చిన కొన్ని పాసులను రద్దు చేశామని అన్నారు. పాత బస్తీలో ఉన్న పరిసర ప్రాంతాల్లో భద్రతలను మరింత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుత పరిస్థితని పరిశీలించామని పేర్కొన్నారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను సీజ్ చేస్తున్నామని అంజనీ కుమార్ వెల్లడించారు. మంగళవారం ఉదయం నుండి ఇప్పటి వరకు 400 వాహనాలను సీజ్ చేసామని తెలిపారు.
ఎలాంటి పనులు లేకుండా అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారు ఎక్కువగా ఉన్నారని వాహనదారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోదని, దానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. అత్యవసర సేవలకు తప్పితే ఎవరూ కూడా రోడ్లపైకి రావద్దని సూచించారు.