ప్రత్యేక విమానంలో జర్మన్ల తరలింపు 

38 German Nationals Leaving Hyderabad In Special Flight - Sakshi

హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన 38 మంది జర్మన్‌ దేశస్తులు

విమానాశ్రయం నుంచి కొనసాగుతున్న అత్యవసర సేవలు

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో చిక్కుకున్న 38 మంది జర్మన్‌ దేశస్తులను తిరిగి ఆ దేశానికి పంపించేందుకు జర్మనీ కాన్సులేట్‌ తెలంగాణ ప్రభుత్వం సమన్వయంతో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో మంగళవారం శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానం ద్వారా వారిని జర్మనీకి తీసుకెళ్లారు. వీరిలో 19 మంది మహిళలు, 17 మంది పురుషులు, మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. జర్మన్లను తరలించేందుకు చెన్నై నుంచి వచ్చిన ఎయిర్‌ ఇండియాకు చెందిన డ్రీమ్‌ లైనర్‌ (బోయింగ్‌ బీ787–8) విమానం ఏఐ– 3005 ఉదయం 7.32 గంటలకు హైదరాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంది. విమానాశ్రయానికి చేరుకున్న జర్మన్లకు థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించారు. ఆ విమానంలో చెన్నై నుంచి వచ్చిన మరికొందరు జర్మన్లు ఉన్నారు. ఉదయం 9.22 గంటలకు ఈ ప్రత్యేక విమానం హైదరాబాద్‌ నుంచి ముంబైకు బయల్దేరింది. అక్కడ మరికొంత మంది ప్రయాణికులను తీసుకుని జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్డ్‌కు వెళ్లనుంది.

ఇండిగో మెడికల్‌ ఎవాక్యుయేషన్‌ విమానం
హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఇండిగో విమాన సిబ్బందిని తరలించేందుకు వచ్చిన ప్రత్యేక రెస్క్యూ విమానాన్ని కూడా ఇదే విమానాశ్రయం నుంచి పంపించారు. మార్చి 28 మధ్యాహ్నం ముంబై నుంచి వచ్చిన ఇండిగో మెడికల్‌ ఎవాక్యుయేషన్‌ విమానంలో ఎనిమిది మంది ఇండిగో సిబ్బంది ఇక్కడ దిగారు. హైదరాబాద్‌లో చిక్కుకున్న ఐదుగురు ఇండిగో సిబ్బంది చెన్నైకు బయల్దేరి వెళ్లారు. విమానాశ్రయంలో ఇండిగో సిబ్బందికి స్క్రీనింగ్‌ నిర్వహించి, వారి సమాచారాన్ని తెలంగాణ ఆరోగ్య శాఖకు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి ఆటంకాలూ లేకుండా కొనసాగేందుకు  కృషి చేస్తున్నారు. అత్యవసర వస్తువులైన ఔషధాలు, వ్యాక్సిన్లు, మెడికల్‌ ఎక్విప్‌ మెంట్, ఫార్మా ముడి పదార్థాలు, రక్షణ పరికరాలు, బ్యాంకు సంబంధిత వస్తువులతో నగరంనుంచి కార్గో సేవలు కొనసాగుతున్నట్లు జీఎమ్మార్‌ అధికారులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top