ఇందూరులో పేపర్‌ బ్యాలెట్‌! | Sakshi
Sakshi News home page

ఇందూరులో పేపర్‌ బ్యాలెట్‌!

Published Fri, Mar 29 2019 3:36 AM

185 people from Nizamabad MP seat - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గురువారం ముగిసింది. మొత్తం 60 మంది తమ నామినేషన్లను వెనక్కు తీసుకోగా.. గడువు ముగిసే సమయానికి 17 లోక్‌సభ స్థానాలకుగానూ 443 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. గరిష్టంగా నిజామాబాద్‌ ఎంపీ స్థానం నుంచి 185 మంది పోటీలో నిలిచారు. దీంతో ఈ స్థానంలో పేపర్‌ బ్యాలెట్‌తో ఎన్నికల నిర్వహణ అనివార్యంగా మారింది. 11 లోక్‌సభ స్థానాల్లో 15 కంటే తక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో ఆయా స్థానా ల్లో ఈవీఎంలకు ఒకే బ్యాలెట్‌ యూనిట్‌ (బీయూ) తో ఎన్నిక జరగనుంది. మరో 5 స్థానాల్లో 16 నుంచి 31 మంది లోపు అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో ఆయా స్థానాల్లో 2 బ్యాలెట్‌ యూనిట్లను ఈవీఎం లకు అనుసంధానం చేయనున్నారు. ఒక బ్యాలెట్‌ యూనిట్‌లో గరిష్టంగా 16 మంది అభ్యర్థులకు చోటు కల్పించేందుకు వీలుంటుంది.

తొలి బ్యాలెట్‌ యూనిట్‌లో ‘నోటా’ ఆప్షన్‌ పోగా 15 మంది పేర్లకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అనుసంధానం చేసే ప్రతి బ్యాలెట్‌ యూనిట్లో 16 మంది చొప్పున అభ్యర్థులకు చోటు లభించనుంది. బీహెచ్‌ఈఎల్‌ రూపొందించిన కొత్త మోడల్‌ ‘ఎం3’ రకం ఈవీఎం లకు గరిష్టంగా 24 బ్యాలెట్‌ యూనిట్లను అనుసంధానం చేయవచ్చు. ఈ ఈవీఎంలను వినియోగిస్తే గరిష్టంగా 387 అభ్యర్థులకు ఈవీఎంలతో పోలింగ్‌ జరపడానికి వీలు కలగనుంది. ఎన్నికల సంఘం దగ్గర సరిపడ సంఖ్యలో ‘ఎం3’ మోడల్‌ ఈవీఎంలు లేవు. ‘ఎం2’ రకం పాత మోడల్‌ ఈవీఎంలను ఎన్నికల సంఘం వినియోగిస్తోంది. ‘ఎం2’ మోడల్‌ ఈవీఎంలకు గరిష్టంగా 6 బ్యాలెట్‌ యూనిట్లను అనుసంధానం చేయడానికి అవకాశముంది. గరిష్టంగా 95 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పుడే వీటిని వాడవచ్చు. ఈ కారణంతో నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి ఈవీఎంలతో పోలింగ్‌ నిర్వహించడం సాధ్యం కాదని సీఈఓ రజత్‌కుమార్‌ పేర్కొన్నారు.

Advertisement
Advertisement