సింగూరు నుంచి ఎస్సారెస్పీకి 15 టీఎంసీలు

15 tmc water from singuru to srsc  - Sakshi

సాగు, తాగు అవసరాల కోసం విడుదలకు ఆదేశం

ఏ క్షణమైనా సింగూరు గేట్లు ఎత్తే అవకాశం

ఎస్సారెస్పీ కింద 5.60 లక్షల ఎకరాలు ఆయకట్టుకు నీరిచ్చేలా చర్యలు

సింగూరు, నిజాంసాగర్‌ కింద సాగుకు నీరు

రబీ ప్రణాళికలో భాగంగా చర్యలు చేపట్టిన సర్కారు

సాక్షి, హైదరాబాద్‌: సింగూరు ప్రాజెక్టు నుంచి శ్రీరాంసాగర్‌కు 15 టీఎంసీల నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దిగువన ఎస్సారెస్పీతోపాటు నిజాంసాగర్‌ కింద తాగు, సాగు అవసరాల కోసం వెంటనే నీటిని విడుదల చేయాలని గురువారం అధికారులను ఆదేశించింది.

ఈ మేరకు వీలైనంత త్వరగా సింగూరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది యాసంగిలో సింగూరు, నిజాంసాగర్, ఎస్సారెస్పీల కింద నీటి అవసరాలపై ప్రభుత్వం ఇప్పటికే లెక్కలు సిద్ధం చేసింది. మిషన్‌ భగీరథ అవసరాలు, నీటి సరఫరా, ఆవిరి నష్టాలు, కనీస మట్టాలకు పైన ఉండే లభ్యత నీటితో ఎంతమేర సాగుకు నీరు ఇవ్వవచ్చన్న అంశాలపై యాసంగి ప్రణాళిక ఖరారు చేశారు.

ఎస్సారెస్పీలో లోటుతో..
ఎస్సారెస్పీ నీటినిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 54.36 టీఎంసీలు ఉన్నాయి. మిగతా 35.35 టీఎంసీల లోటు ఉంది. అయితే ఇక్కడి అవసరాలను దృష్టిలో పెట్టుకుని సింగూరు నుంచి 15 టీఎంసీల మేర విడుదల చేయాలని నిర్ణయించారు. ఇందులో ఐదు టీఎంసీల మేర నిజాంసాగర్‌లో నిల్వ చేసి.. మిగతా 10 టీఎంసీలను ఎస్సారెస్పీకి తరలిస్తారు. దీంతో ఎస్సారెస్పీలో లభ్యత జలాలు 64.36 టీఎంసీలకు చేరుతాయి.

ఇక ఎస్సారెస్పీ నుంచి లోయర్‌మానేర్‌ డ్యామ్‌ (ఎల్‌ఎండీ)కు కాకతీయ కెనాల్‌ ద్వారా 15 టీఎంసీలు విడుదల చేయాలని, మిషన్‌ భగీరథ అవసరాలకు 12.6 టీఎంసీలను వినియోగించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. మొత్తంగా ఎస్సారెస్పీలో సుమారుగా 38.41 టీఎంసీల నీరు మిగులుతుంది. ఈ నీటినీ ఆన్‌అండ్‌ఆఫ్‌ పద్ధతిన 5.60 లక్షల ఎకరాలకు అందిస్తారు. ఇందులో ఎల్‌ఎండీ ఎగువన 4 లక్షల ఎకరాలు, ఎల్‌ఎండీ దిగువన 1.60 లక్షల ఎకరాలకు సాగు నీరందనుంది.

సింగూరు కింద 1.5 లక్షల ఎకరాలకు
శ్రీరాంసాగర్‌కు తరలించే 15 టీఎంసీలుపోగా.. సింగూరులో సుమారు 14.5 టీఎంసీల నీరు ఉంటుంది. ఇందులో 5.7 టీఎంసీలను తాగు అవసరాలకు కేటాయించి, మరో టీఎంసీలతో ప్రాజెక్టు కింది 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే అవకాశముంది. ఇక నిజాంసాగర్‌లో ప్రస్తుతం 12.93 టీఎంసీల నీరుండగా.. సింగూరు నుంచి వచ్చే 5 టీఎంసీలతో కలసి 18 టీఎంసీల లభ్యత ఉండనుంది. ఇందులో తాగునీటికి 3 టీఎంసీలు పక్కనపెట్టి.. మిగతా 15 టీఎంసీలతో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశముంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top