
పెను ప్రమాదంలో 7 జిల్లాల జీవనాడి
అప్‌స్ట్రీమ్ రివిట్‌మెంట్‌కు తక్షణమే మరమ్మతులు చేయాలి
లేకుంటే ఏ క్షణంలోనైనా మట్టి కట్టలు తెగిపోవచ్చు
లోతట్టు ప్రాంతాలను ముంచెత్తితే భారీగా ప్రాణ, ఆస్తినష్టం
ప్రభుత్వానికి నివేదికలో డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం, పరిసర ప్రాంతాలకు తాగునీటి సరఫరాతోపాటు ఉమ్మడి మెదక్ జిల్లాకు సాగు, తాగునీటిని సరఫరా చేసే సింగూరు జలాశయానికి తక్షణమే మరమ్మతులు నిర్వహించకపోతే ఏ క్షణంలోనైనా జలాశయం తెగిపోయి దిగువ ప్రాంతాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరగనుందని డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ (డీఎస్‌ఆర్‌పీ) హెచ్చరించింది.
కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ సభ్యులు, డిజైన్స్ విభాగం నిపుణుడు అశోక్‌కుమార్ గంజు నేతృత్వంలో సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు యోగిందర్‌కుమార్ శర్మ, హైడ్రాలజిస్ట్/నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ పి.రామరాజు, జీఎస్‌ఐ మాజీ డీజీ ఎం.రాజు, డ్యామ్ గేట్ల నిపుణుడు ఎన్.కన్హయ్య నాయుడుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీఎస్‌ఆర్‌పీ మార్చి 23న సింగూరు జలాశయాన్ని సందర్శించి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది.
సామర్థ్యానికి మించి నీటి నిల్వలతో..
‘సింగూరు జలాశయానికి ఎగువ మట్టి కట్టల (అప్‌స్ట్రీమ్ ఎర్త్ డ్యామ్)కు రక్షణగా రాళ్లతో ఏర్పాటు చేసిన రివిట్‌మెంట్‌తోపాటు మట్టి కట్టలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. చాలా చోట్ల అప్‌స్ట్రీమ్ వంపునకు రక్షణగా ఏర్పాటు చేసిన రివిట్‌మెంట్ దెబ్బతింది.
వాస్తవ డిజైన్ల ప్రకారం జలాశయంలో నీటినిల్వలు 517.8 మీటర్లకు మించకుండా నిర్వహించాలి. దీనికి విరుద్ధంగా మిషన్ భగీరథ అవసరాల కోసం 520.5 మీటర్లకు తగ్గకుండా నిల్వలను నిర్వహించాలని 2017 అక్టోబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం జీవో 885 జారీ చేసింది.
కొన్నేళ్లుగా సామర్థ్యానికి మించి 522 మీటర్ల మేర నిల్వలను కొనసాగిస్తుండటంతో జలాశయం తీవ్రంగా దెబ్బతింది. అప్‌స్ట్రీమ్ రివిట్‌మెంట్‌కు మరమ్మతులు నిర్వహించి పూర్వ స్థితికి పునరుద్ధరించకపోవడం వల్ల జలాశయం కట్టలు తీవ్ర ప్రమాదంలో పడ్డాయి.
అత్యవసరంగా రివిట్‌మెంట్‌కి మరమ్మతులు నిర్వహించి పునరుద్ధరించకపోతే ఏ క్షణంలోనైనా మట్టి కట్టలకు గండిపడి లోతట్టు ప్రాంతాలను ముంచేస్తుంది. సింగూరుకు దిగువన ఉన్న మంజీర, నిజాంసాగర్ జలాశయాలతోపాటు పెద్ద సంఖ్యలో ఉన్న చెక్‌డ్యామ్‌లూ తెగిపోయి నష్టం తీవ్రత మరింత పెరగొచ్చు’అని నిపుణుల ప్యానెల్ నివేదికలో హెచ్చరించింది.
మరమ్మతులకు అనుమతించండి..
వర్షాకాలం ముగిశాక జలాశయంలో నీటి నిల్వను తగ్గించి అప్‌స్ట్రీమ్ రివిట్‌మెంట్‌కు మరమ్మతులు నిర్వహించి పూర్వ స్థితికి పునరుద్ధరించేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నిపుణుల ప్యానెల్ సూచించింది.
మట్టికట్టల రక్షణ కోసం కట్టిన పారాపెట్ వాల్ ఒకచోట కుంగిపోయి నిలువనా చీలినందున గ్రౌటింగ్‌తో చీలికలను పూడ్చాలని సూచించింది. జలాశయంలో 97 శాతం నిల్వలు పూర్తిగా గేట్లపై ఆధారపడినందున గేట్ల నిర్వహణకు నిరంతరం పూర్తి సంసిద్ధతతో ఉండాలని సూచించింది.
ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం..
మంజీరా నదీపై 29.91 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 1989లో నిర్మించిన సింగూరు జలాశయం ఏటా హైదరాబాద్‌కు 6.96 టీఎంసీల తాగునీటిని సరఫరా చేస్తోంది. మంజీరా, మహబూబ్‌నగర్, ఫతేహ్ నహర్, నిజాంసాగర్‌లకు అవసరమైన నీటిని నిల్వ చేసి వాటికి అవసరమైనప్పుడు విడుదల చేస్తోందని ప్యానెల్ తెలిపింది.
ఈ క్రమంలో మార్గమధ్యంలోని ఎన్నో చెక్‌డ్యామ్‌లను నింపుతూ కనీసం 7 కరువుపీడిత జిల్లాలకు జీవనాడిగా సేవలందిస్తోందని పేర్కొంది. గోదావరి నదీ సబ్ బేసిన్–4 పరిధిలోని తీవ్ర కరువు పీడిత ప్రాంతాలకు తాగు, సాగునీటిని సరఫరా చేసే మేజర్ ప్రాజెక్టు సింగూరుకు విపత్తు సంభవిస్తే ప్రాణ, ఆస్తినష్టంతోపాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేసింది. 2016, 2019, 2024లలో జలాశయానికి తనిఖీలు చేసి స్పిల్‌వే, ఎర్త్ డ్యామ్, గ్యాలరీలకు తక్షణమే మరమ్మతులు నిర్వహించాలని నివేదికలు ఇవ్వగా ఇప్పటివరకు చేయలేదని ప్యానెల్ తేలి్చంది.