breaking news
-
ఎమ్మెల్సీలపై మళ్లీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణలను నియమించాలంటూ రాష్ట్ర కేబినెట్ చేసిన సిఫార్సు లపై గవర్నర్ వ్యవహరించిన తీరు సరికాదని రాష్ట్ర హైకోర్టు పేర్కొంది. సదరు సిఫార్సులను తిరస్క రిస్తూ 2023 సెప్టెంబర్ 19న గవర్నర్ ఇచ్చిన ఆదేశా లను రద్దు చేసింది. దీంతోపాటు గవర్నర్ ఆదేశాల మేరకు కోదండరామ్, ఆమెర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ఈ ఏడాది జనవరి 27న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేసింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని.. మరోసారి ఎమ్మెల్సీల పేర్లను కేబినెట్ లో ప్రతిపాదించి గవర్నర్‌కు పంపాలని స్పష్టం చేసింది. ఈ మేరకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక వివాదంపై దాఖలైన పిటిషన్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటిల ధర్మాసనం గురువారం కీలక తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 (5) ప్రకారం.. కేబినెట్ సాయం, సలహా మేర కు గవర్నర్ వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంది. కేబినెట్ సిఫార్సు చేసిన వ్యక్తుల అర్హత, అనర్హత అంశాలను పరిశీలించడానికి గవర్నర్‌కు అధికారం ఉంటుందని.. కావాలంటే అవసరమైన పత్రాలు, సమాచారం కోరవచ్చని తెలిపింది. కేబినెట్ సిఫార్సులను పునఃపరిశీలనకు పంపే అధికారం కూడా ఉంటుందని స్పష్టం చేసింది. వాస్తవానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం కోర్టుకు గవర్నర్ జవాబుదారీ కాదని.. గవర్నర్‌కు కోర్టులు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేవని పేర్కొంది. కానీ హైకోర్టుకు న్యాయసమీక్ష చేసే అధికారం ఉంటుందని వివరించింది. ‘గవర్నర్ కోటా’ పిటిషన్లపై వాదనలను పరిశీలించాక.. రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగా తగిన చర్య తీసుకోవాలని భావించి తీర్పునిస్తున్నట్టు తెలిపింది. ఇక అప్పటి కేబినెట్ సిఫార్సులను అమలు చేయాలన్న పిటిషనర్ల డిమాండ్‌పై చర్చ అనవసరమని.. వారు గవర్నర్ తిరస్కరించడాన్ని మాత్రమే సవాలు చేశారని పేర్కొంది. ‘గవర్నర్ కోటా’వివాదం ఇదీ.. 2023 జూలై 31న భేటీ అయిన గత ప్రభుత్వ కేబినెట్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణల పేర్లను గవర్నర్‌కు సిఫార్సు చేసింది. గవర్నర్ ఈ సిఫార్సులను తిరస్కరిస్తూ సెప్టెంబర్ 19న ఆదేశాలు జారీ చేశారు. దీంతో గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు విచారణలో ఉండగానే.. కొత్త ప్రభుత్వ కేబినెట్ సిఫార్సు మేరకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, జర్నలిస్టు ఆమెర్ అలీఖాన్‌ల నియామకానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ ఏడాది జనవరి 27న ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నియామకాలను కూడా శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. రెండు అంశాలపైనా హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. కోదండరామ్, ఆమెర్ అలీఖాన్‌ను ప్రధాన పిటిషన్లో ఇంప్లీడ్ చేసింది. వారి ప్రమాణస్వీకారంపైనా స్టే ఇచ్చింది. తాజాగా తీర్పు వెలువరించింది. గవర్నర్ నిర్ణయం అభ్యంతరకరం! ‘‘దాసోజు శ్రవణ్ రాజకీయ నాయకుడన్న కారణంగా గవర్నర్ తిరస్కరించారు. తర్వాత నియామకమయ్యే వారు కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండాలి. కానీ నియామకమైన వారు కూడా రాజకీయ నాయకులే. అందులో ఒకరు రాజకీయ పార్టీనే నడిపిస్తున్నారు’’ అని హైకోర్టులో దాసోజు శ్రవణ్ తరఫున సీనియర్ న్యాయవాది ఆదిత్యా సోంధీ వాదనలు వినిపించారు. ‘‘గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వ అర్హతలకు.. పిటిషనర్ల నామినేషన్ తిరస్కరణ కారణాలకు పొంతన లేదు. మంత్రివర్గ సిఫార్సులను తిరస్కరించే అధికారం గవర్నర్‌కు లేదు. దీనిపై సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. గవర్నర్‌కు అభ్యంతరం ఉంటే పునః పరిశీలన కోసం వెనక్కి పంపవచ్చు. గవర్నర్ తిరస్కరణ కారణంగా హక్కును కోల్పోయిన పిటిషనర్‌కు కోర్టును ఆశ్రయించే అర్హత ఉంటుంది. శ్రవణ్, సత్యనారాయణల పేర్లను నెలల తరబడి పరిశీలించిన గవర్నర్.. కోదండరామ్, ఆమెర్ అలీఖాన్‌ల పేర్లను మాత్రం కొత్త కేబినెట్ సిఫార్సు చేసిన వెంటనే ఆమోదించింది’’ అని వివరించారు. కుర్ర సత్యనారాయణ తరఫున సీనియర్ న్యాయవాది మయూర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘మంత్రి మండలి సిఫార్సులను గవర్నర్ వెనక్కి పంపడానికి, తిరస్కరించడానికి తేడా లేదని పేర్కొనడం సరికాదు. ప్రభుత్వం సిఫార్సు చేసిన అభ్యర్థులపై గవర్నర్‌గా సంతృప్తి చెందడం వేరు.. ఓ వ్యక్తిగా సంతృప్తి చెందడం వేరు. పిటిషనర్ల పేర్లను గవర్నర్ వ్యక్తిగతంగా తిరస్కరించినట్టు కనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు. గవర్నర్.. రబ్బర్ స్టాంప్ కాదు.. ‘‘ఎవరికైనా రాజ్యాంగం అనేది సుప్రీం. దాన్ని ఎవరైనా అనుసరించాలి. భాషాపరమైన, సైన్స్ వంటి రంగాల్లో సేవలందించిన వారిని మంత్రి మండలి సిఫార్సు చేయాలి. అలా కాకుండా రాజకీయ విభాగాలకు చెందిన వారిని సిఫార్సు చేస్తే.. కారణాలను పేర్కొంటూ తిస్కరించే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. గవర్నర్ రబ్బర్ స్టాంప్ కాదు. గవర్నర్ తిరస్కరించిన తర్వాత వేరేవారి పేర్లు పంపడానికి ప్రభుత్వానికి అవకాశం ఉన్నా పంపలేదు. మంత్రి మండలి సిఫార్సులను వెనక్కి పంపిన గవర్నర్ చర్యలను అలహాబాద్, బాంబే హైకోర్టులు గతంలో సమర్థించాయి. కోదండరామ్, ఆమెర్ అలీఖాన్‌లను గవర్నర్ నేరుగా ఏమీ నియమించలేదు. మంత్రి మండలి సిఫార్సు చేసిన తర్వాత.. ఆయా రంగాల్లో వారు చేసిన సేవను పరిశీలించి ఆమోదముద్ర వేశారు’’ అని కోదండరామ్, అలీఖాన్‌ల తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ కోర్టుకు విన్నవించారు. ప్రభుత్వ సిఫార్సు మేరకే నియామకం.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఇద్దరి పేర్లను ఎమ్మెల్సీలుగా సూచిస్తూ జనవరి 24న ప్రభుత్వం సిఫార్సు చేసిందని, దాన్ని పరిశీలించాకే గవర్నర్ ఆమోదించారని వివరించారు. ఇదంతా చట్టప్రకారమే జరిగిందన్నారు. గతంలో ప్రభుత్వం చేసిన సిఫార్సులను పక్కకుపెట్టే అధికారం ఇప్పుడున్న సర్కార్‌కు ఉంటుందని స్పష్టం చేశారు. – గవర్నర్ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.అశోక్ ఆనంద్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. ‘‘గవర్నర్ నిర్ణయాలను కోర్టులు విచారించలేవు. రాజ్యాంగం గవర్నర్ విచక్షణాధికారాలకు పూర్తి రక్షణ కల్పించింది. గవర్నర్ విచక్షణ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మంత్రి మండలి సలహాపై.. మరొకటి సొంత విచక్షణాధికారం. ప్రజాప్రతినిధుల కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నుకునే అవకాశం ఎమ్మెల్యేలకు ఎలా ఉంటుందో.. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలను నియమించే విచక్షణాధికారాలు గవర్నర్‌కు ఉన్నాయి’’ అని వివరించారు. -
అభివృద్ధి కోసమే కేంద్రంతో సఖ్యత
కంటోన్మెంట్: రాష్ట్రంలో అభివృద్ధి పనులకు నిధుల కోసం కేంద్రంతో సఖ్యతగానే ఉంటామని, అదే రాజకీయాల విషయానికి వస్తే మాత్రం పోరాటం చేస్తూ ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించకపోతే కొట్లాడుతామని చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలనీ, ఎన్నికలు ముగిశాక అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.2,232 కోట్లతో రాజీవ్ రహదారిపై చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ పనులకు అల్వాల్ టిమ్స్ ఆవరణలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణతోనే ఈ ప్రాజెక్టు ఆలస్యమైందన్నారు. ప్రజల అవసరాన్ని మర్చిపోయి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో గిల్లికజ్జాలు పెట్టుకుని ప్రాజెక్టును పక్కన బెట్టిందన్నారు. తాము అధికారంలోకి రాగానే కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరించామని తెలిపారు. ప్రధాని మోదీని, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ను కలిసి ప్రాజెక్టు అవసరాన్ని వివరించామని చెప్పారు. రక్షణ శాఖకు భూములు అప్పగించామనీ, అదే సమయంలో ఎలివేటెడ్ కారిడార్ కోసం రక్షణ శాఖ భూములు కావాలని కోరామని సీఎం వివరించారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంతో కేంద్రం రాష్ట్రానికీ సహకరించిందని తెలిపారు. బీఆర్ఎస్ దిక్కుమాలిన విధానాలతో ప్రజలకు శిక్ష.. ప్రజల అవసరాల కోసమే ఒక మెట్టు దిగాం తప్ప రాజకీయాల కోసం కాదని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌లో ఏదైనా ఒక శాశ్వత అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు. గత పదేళ్లలో గంజాయి, డ్రగ్స్, పబ్‌లు తప్ప ఏమీ రాలేదని ఎద్దేవా చేశారు. ’’ఎలివేటెడ్ కారిడార్ విషయంలో మా పోరాటం ఫలించిందని కేటీఆర్ అంటున్నాడు.. ఇంతకీ ఆయన ఏం పోరాటం చేసిండు. ట్విటర్ లో పోస్టులు పెట్టుడే ఆయన పోరాటమా?’’ అని ప్రశ్నించారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఇందిరా పార్కు వద్ద కేటీఆర్ ఆమరణ దీక్ష చేయాలని సూచించారు. కేటీఆర్ చచ్చుడో అభివృద్ధికి నిధులు వచ్చుడో అని దీక్ష చేయాలన్నారు. కేటీఆర్ దీక్షకు దిగితే కాంగ్రెస్ కార్యకర్తలే ఆయన్ను కంచె వేసి కాపాడుతారన్నారు. కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సెక్రెటరీ బి.అజిత్ రెడ్డి, హెచ్ఎండీఏ అదనపు కమిషనర్ ఆమ్రపాలి, కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ సోమశంకర్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పాల్గొన్నారు. -
చంద్రబాబు చేసింది వెయ్యి కోట్ల భూకుంభకోణం
గ్రేటర్ హైదరాబాద్‌లో ఏ మూలనైనా ఎకరానికి వంద కోట్ల ధర ఉంది. అలాంటిది 850 ఎకరాలంటే దాదాపు లక్ష కోట్ల రుపాయల విలువ. కేవలం నాలుగు రోజుల్లోనే లక్ష కోట్ల విలువైన భూమిని పక్కదారి పట్టించడమంటే చంద్రబాబు ఘనత అర్థం చేసుకోవచ్చు. 1999-2004 మధ్య జరిగిన ఈ కుంభకోణాన్ని బయటకు రాకుండా చేయడానికి నానా పాట్లు పడ్డా.. చివరికి హైకోర్టు తీర్పు రావడంతో బాబు కుంభకోణమంతా బట్టబయలైంది. సాక్షి, హైదరాబాద్: ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంజీబీపీఎల్) కంపెనీ ఏర్పాటైన 4 రోజుల్లోనే 850 ఎకరాలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్న 2003 నాటి నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. కనీస విచారణ లేకుండా, అంతర్జాతీయ కంపెనీతో సంబంధాలు ఉన్నాయో లేదో తెలుసుకోకుండా, అత్యంత ఖరీదైన ప్రాంతంలో వేల కోట్ల విలువైన భూములను కారు చౌకగా ధారాదత్తం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పోర్ట్స్ అకాడమీ నిర్వహణ కోసం అంటూ ఏటా కోట్లాది రూపాయలు ముట్టజెప్పేందుకు, విద్యుత్, నీటి, సీవేజ్, డ్రైనేజీ సౌకర్యాలు 100 శాతం ఉచితంగా కల్పించేందుకు అంగీకరించడం గతంలో ఎప్పుడూ, ఎక్కడా చూడలేదంటూ విస్మయం వ్యక్తం చేసింది. గతంలో ఏ కంపెనీకీ అది ఏర్పాటైన 4 రోజుల్లో వందల ఎకరాలు అప్పగించినట్టుగా, నిర్వహణ ఖర్చులు, బిల్లుల మాఫీకి అంగీకరించినట్టుగా లేదని అభిప్రాయపడింది. 2007లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం విస్తృత ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకునే సదరు భూమిని వెనక్కు తీసుకుంటూ చట్టం చేసిందని స్పష్టం చేసింది. రాజ్యాంగంలో ఉన్న అధికారాల మేరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తి (పరిరక్షణ, రక్షణ, పునఃప్రారంభం) చట్టాన్ని తీసుకొచ్చిందని.. ఇది ఎంతమాత్రం ఆక్షేపణీయం కాదని తేల్చిచెప్పింది. ఐఎంజీ భారత్ (పిటిషనర్) పేర్కొంటున్నట్లుగా ఆర్టికల్ 14 ఉల్లంఘన ఎక్కడా జరగలేదని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ పిటిషన్లో ఎలాంటి మెరిట్ కనిపించలేదని, ఆ ఒప్పందాన్ని ఏవిధంగానూ సమర్ధించలేమని ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటిల ధర్మాసనం 18 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత గురువారం తీర్పు ఇచ్చింది. దీనిపై మీరు సీబీఐ విచారణ జరిపిస్తారా? లేక మమ్మల్నే ఆదేశించమంటారా? అంటూ రాష్ట్ర ప్రభు త్వాన్ని ఈ అంశంపైనే దాఖలైన ఓ పిల్ విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై వా రం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. యువతను క్రీడల్లో తీర్చిదిద్దడం కోసం అంటూ.. ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంజీబీపీఎల్) 2003, ఆగస్టు 5న ఏర్పాటైంది. కంపెనీ ఏర్పాటైన 4 రోజులకే అంటే ఆగస్టు 9నే చంద్రబా బు నేతృత్వంలోని నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఐఎంజీ భారత్‌తో ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. క్రీడల్లో రాష్ట్ర యువతను చాంపియన్లుగా తీర్చిదిద్దడం కోసం అంటూ ఈ ఎంవోయూ చేసుకుంది. ఇందులో భాగంగా స్పోర్ట్స్ అకాడెమీలను నిర్మించడం, అభివృద్ధి చేయడం, నిర్వహించడం కోసం అంటూ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి సర్వే నంబర్ 25లో 400 ఎకరాలు ఇచ్చేందుకు అంగీకరించింది. అలాగే రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం మామిడిపల్లి సర్వే నంబర్ 99/1లోని మరో 450 ఎకరాలు అప్పగించేందుకు కూడా ఒప్పందం చేసుకుంది. అంతేకాకుండా ఐఎంజీ భారత్ అంతర్జాతీయ స్థాయిలో ప్రధాన కార్యాలయాన్ని నిర్మించుకునేందుకు బంజారాహిల్స్ నుంచి మాదాపూర్ వెళ్లే మార్గంలో ఎకరం నుంచి 5 ఎకరాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు 2004, ఫ్రిబవరిలో గచ్చి»ౌలిలో ఎంతో విలువైన 400 ఎకరాలను స్వల్ప మొత్తానికి అంటే కేవలం రూ.2 కోట్లకే ఐఎంజీ భారత్‌కు అప్పగించింది (సేల్ డీడ్ చేసింది). అయితే 2006లో ప్రభుత్వ ఆస్తులను కాపాడే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. 2007లో దీన్ని చట్టబద్ధం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తి (పరిరక్షణ, రక్షణ, పునఃప్రారంభం) చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్ట ప్రకారం ఐఎంజీ భారత్‌తో అంతకుముందు ప్రభుత్వం చేసుకున్న ఎంఓయూ, ఆ మేరకు సేల్‌డీడ్ కూడా రద్దయ్యాయి. ఈ క్రమంలో 2007 చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం సంబంధిత లావాదేవీలు రద్దు చేయడమే కాకుండా ఐఎంజీ చెల్లించిన మొత్తాన్ని ఏడాదికి 12 శాతం వడ్డీతో తిరిగి ఇచ్చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే ప్రభుత్వ చట్టాన్ని సవాల్ చేస్తూ ఐఎంజీ భారత్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పూర్తి కేబినెట్ ఆమోదం లేదు: ఏజీ ‘పూర్తి కేబినెట్ ఆమోదం లేకుండా నాటి ప్రభుత్వం ఎంఓయూపై సంతకాలు చేసింది. ఆ సమయంలో భూమి విలువ ఎకరం రూ.13 లక్షలు ఉండగా, పిటిషనర్‌కు రూ.50 వేల స్వల్ప మొత్తానికే సరైన ఎలాంటి కారణం లేకుండా విక్రయించారు. ఐఎంజీ భారత్‌కు అమెరికన్ కంపెనీ అయిన ఐఎంజీతో ఎలాంటి సంబంధం లేదు. కానీ దానికి అనుబంధ సంస్థ అంటూ మోసగించారు. అందుకే తదుపరి ప్రభుత్వం ఎంవోయూను రద్దు చేసింది. పరిహారం ఇవ్వాలని కూడా నిర్ణయించింది. 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఒక్క ఐఎంజీ కోసమే కాదు. ఇది ఇతర భూ లావాదేవీలకు కూడా వర్తిస్తుంది. ఇలా చట్టం తీసుకొచ్చే అధికారం రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ ప్రకారం శాసనసభకు ఉంది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత 2007లో చేసిన చట్టం అమల్లోకి వచ్చింది..’అంటూ అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. కాగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ..‘ఒక ఐఎంజీ భారత్ కోసమే చట్టాన్ని తేవడం సమరి్థనీయం కాదు. ఎంవోయూను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదు..’అంటూ వాదించారు. ఎలాంటి విచారణ చేయకుండానే ఆమోదం: ధర్మాసనం ‘2003 ఆగస్టు 5న ఐఎంజీ భారత్ ఏర్పాటైన తర్వాతి రోజే, ఎలాంటి విచారణ చేసుకోకుండానే 6న నాటి యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం, కల్చలరల్ డిపార్ట్మెంట్ కంపెనీకి ఆమోదం తెలుపుతూ సర్క్యులర్ జారీ చేసింది. అదే రోజు నలుగురు మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీనికి ఆగమేఘాలపై గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత 9వ తేదీన ఎంవోయూ కుదుర్చుకున్నారు. స్పోర్ట్స్ అకాడెమీ, స్టేడియాల నిర్వహణకయ్యే ఖర్చు ఏడాదికి రూ.2.5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ అయితే ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని ఒప్పందంలో పేర్కొన్నారు. తొలి మూడేళ్లపాటు విద్యుత్, నీటి, సీవేజ్, డ్రైనేజీ బిల్లులనూ 100 శాతం తిరిగి చెల్లిస్తామని చెప్పారు. ఆ తర్వాత క్రమంగా దీన్ని తగ్గిస్తామని తెలిపారు. ముఖ్యంగా పిటిషనర్‌కు అంతర్జాతీయ క్రీడా సంస్థ (ఐఎంజీ, అమెరికా)తో సంబంధం గానీ, గతంలో క్రీడా రంగంలో అనుభవం గానీ లేవు. ఉన్నట్లుగా ఐఎంజీ ఎలాంటి పత్రాలను ప్రభుత్వానికి సమర్పించలేదు. ప్రభుత్వం రద్దయ్యాక 400 ఎకరాలకు సేల్‌డీడ్! 2003, నవంబర్ 14నే చంద్రబాబు ప్రభుత్వం రద్దయ్యింది. తర్వాత ఆపద్ధర్మ ప్రభుత్వంగా మాత్రమే కొనసాగింది. ఈ ఆపద్ధర్మ ప్రభుత్వ హయాంలోనే 400 ఎకరాలను నామమాత్రపు ధరకు ఐఎంజీ భారత్‌కు అప్పగిస్తూ సేల్‌డీడ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుల మేరకు చట్టం ద్వారా ఒక వ్యక్తి మాత్రమే ప్రభావితం అయినా, 2007లో భూములపై రాష్ట్ర శాసనసభకు ఉన్న అధికారాలతోనే చట్టాన్ని రూపొందించింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సరైన కారణాలు ఉన్నప్పుడు రాజ్యాంగం ప్రభుత్వానికి ఈ అధికారం కలి్పంచింది. జాగ్రత్తగా గమనిస్తే.. కంపెనీ ఏర్పాటైన కేవలం 4 రోజుల్లోనే వేల కోట్ల విలువచేసే వందల ఎకరాల భూములు అప్పగించారు. మరే ఇతర కంపెనీకి రాష్ట్రంలో అంత స్వల్ప సమయంలో ఇలా భూములు ధారాదత్తం చేయలేదు. పిటిషనర్‌కు పరిహారం కోరే హక్కు ఉంది. అయితే 2007లో తీసుకొచ్చిన చట్టాన్ని తన ఒక్క కంపెనీ కోసమే అంటూ సవాల్ చేయలేరు. ప్రజా ఆస్తుల పరిరక్షణకే వైఎస్ సర్కార్ చట్టం.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ప్రభుత్వం ఉల్లంఘించిందన్న వాదన కూడా సరికాదు. ప్రజల ఆస్తులను కాపాడటం కోసమే 2007లో వైఎస్ సర్కార్ చట్టం తీసుకొచ్చింది. అది ఎవరి వ్యక్తిగత అవసరాల కోసం కాదన్న విషయం గ్రహించాలి. కంపెనీ ఏర్పాటు చేసిన నాలుగు రోజుల్లో వేల కోట్ల భూములు గతంలో మరే ఇతర కంపెనీకి ప్రభుత్వం కేటాయించినట్లుగా ఐఎంజీ నిరూపించలేకపోయింది. అలాగే ప్రభుత్వం చేసిన చట్టం చెల్లుబాటును అడ్డుకునేందుకు ఇందులో ఎలాంటి ఉల్లంఘనలు కూడా జరగలేదు. సేల్ డీడ్‌ను రద్దు చేయకూడదనే వాదన ఆమోదానికి అర్హమైనది కాదు. ఎంఓయూనే రద్దయినప్పుడు సేల్‌డీడ్ అమల్లో ఉండటం సాధ్యం కాదు..’అంటూ ధర్మాసనం తన తీర్పులో వ్యాఖ్యానించింది. సీబీఐ విచారణకు లేఖ రాశామన్నారుగా.. ‘ఐఎంజీ భారత్‌కు భూముల అప్పగింతపై సీబీఐ విచారణ కోరుతూ గతంలో లేఖ రాశాం అన్నారు.. ఎంత వరకు వచ్చింది? మీరు విచారణ కోరతారా? లేక మమల్నే సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు ఇవ్వమంటారా?’అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణలోగా ఏదో ఒకటి చెప్పాలని ఆదేశిస్తూ, విచారణను వారం పాటు వాయిదా వేసింది. ఐఎంజీ భారత్‌కు భూముల కేటాయింపు, ఎంవోయూ, సేల్‌డీడ్.. ఇలా అన్ని అంశాలపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ)తో విచారణ జరిపించాలని కోరుతూ టి.శ్రీరంగారావుతో పాటు మరొకరు 2012లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ ఒప్పందం వెనుక పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేసే ప్రయత్నం జరిగిందని, దీని వెనుక ఉన్న కుట్రదారులెవరో తేల్చాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ పిటిషన్లను గురువారం మరోసారి సీజే ధర్మాసనం విచారించింది. సీబీఐకి అప్పగించే విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ అభిప్రాయం ధర్మాసనం కోరింది. ఆయన తమకు కొంత సమయం కావాలనడాన్ని, ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాత తెలియజేస్తాననడాన్ని తప్పుబట్టింది. ఇంకా ఎంతకాలం ఆగాలని, వారంలోగా ఏదో ఒకటి తేల్చిచెప్పాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. కాగా గతంలో ఇదే పిల్‌పై విచారణ సందర్భంగా ప్రభుత్వం కోరితే దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నామని న్యాయస్థానానికి సీబీఐ తెలియజేయడం గమనార్హం. -
రేవంత్ సర్కార్‌ను కూల్చం.. ఐదేళ్లు ఉండాల్సిందే!: కేటీఆర్
సాక్షి, కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బయటి నుంచి ఎవరో కూల్చరని.. ప్రభుత్వాన్ని పడగొట్టేవాళ్లు ఆ పార్టీలోనే ఉన్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం కరీంనగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డితో పాటు బండి సంజయ్‌పైనా మండిపడ్డారు. .. కరీంనగర్ నుంచే పార్లమెంట్ జంగ్ సైరన్ మోగబోతోంది. కేసీఆర్‌కు కరీంనగర్ అంటే సెంటిమెంట్. నాటి ఉద్యమ కాలాన సింహగర్జన సభకు కరీంనగరే వేదికైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనపై కూడా కదనభేరి సభ కరీంనగర్ నుంచే మొదలు కాబోతోంది. ప్రధాని వచ్చి ఏదో హడావిడి చేసే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలో ఉండి ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారో నాకు తెలీదు. జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతాననేటోడు మన ముఖ్యమంత్రి. ఓ జేబు దొంగలా మాట్లాడుతున్నాడు. అవి సీఎం స్థాయిలో మాట్లాడే మాటలేనా..? ‘‘రేవంత్‌రెడ్డి బీపీ పెంచుకోకు. మా వైపు నుంచి నీకు నష్టం లేదు. నీ ప్రభుత్వాన్ని కూల్చం. ఐదేళ్లు నువ్వు అధికారంలో ఉండాలని కోరుకుంటాం. అప్పుడే వెలుగు చీకట్లకు తేడా తెలుస్తుంది. మీ ప్రభుత్వాన్ని కూల్చే ఖమ్మం, నల్లగొండ మానవ బాంబులు మీ పార్టీలోనే ఉన్నాయి. ఇంతకీ అబద్ధపు 420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారు?’’ .. మానవబాంబులైతామంటున్నాడు రేవంత్. కానీ, ఆయన పక్కనే బాంబులున్నై, అది ఆయన గమనించుకుంటే చాలు. ప్రజలకు కూడా అర్థం కావాలి గాడిదేదో, గుర్రమేదో. చార్సవ్ బీస్ హామీలు అమలు కాకపోతే నిలదీస్తాం. రైతుబంధును రైతుభరోసా అన్నాడు. వచ్చిందా మరి..?. రైతులే ఇప్పుడు రేవంత్ పాలనపై చర్చకు పెడుతున్నారు.. మగాడివైతే రా నువ్వు నిలబడ్డ మల్కాజిగిరికి రా.. నేను వస్తానని సవాల్ విసిరా. కానీ, ఆ ఊసే మాట్లాడుతలేడు. మగాడివైతే ఇచ్చిన హామీలను నెరవేర్చి చూపాలని రేవంత్ కు సవాల్ విసురుతున్నా.. ఆత్మగౌరవం కల్గిన ఏ తెలంగాణా బిడ్డ మాట్లాడని మాటలు మోడీ ఎదుట సాగిలబడి రేవంత్ మాట్లాడుతుండు. రాహూల్ ఏమో గుజరాత్ మాడల్ ను తిడితే.. నువ్వేమో పొగుడ్తావా..?. 90 రోజుల్లోనే ప్రజాభిమానాన్ని కోల్పోయింది రేవంత్ ప్రభుత్వం. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు. పైనున్న ప్రాంతాలకు నీళ్లు తెచ్చే ఒక విజన్ తో కేసీఆర్ అద్భుతమైన కాళేశ్వరం కట్టాడు. రేవంత్, సంజయ్ వంటి పిచ్చోళ్లకు ఇవన్నీ తెల్వవ్. ప్రాజెక్ట్ లో చిన్న సమస్య వేస్తే రిపేర్ చేయకుండా కేసీఆర్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కరువు మీద కేసీఆర్ సంధించిన బ్రహ్మాస్త్రమే కాళేశ్వరం ప్రాజెక్ట్. మహానుభావులు ఎంపీలుగా గెలిచిన ఈ ప్రాంతం నుంచి బండి అడ్డిమారిగా గెల్చిండు. ఏం మాట్లాడుతాడో ఆయనకే తెల్వదు. దమ్ముంటే బండి సంజయ్ కరీంనగర్ కమాన్ దగ్గరకు రా. మా వినోద్ అన్న ఏం చేసిండో.. నువ్వేం చేసినావో తేల్చుకుందాం. బండి సంజయ్ ఓ సైకో లెక్క తిట్లు తప్ప చేసిందేమీ లేదు. శివలింగం మీద తేలులాగా పైన రాముడు కింద బండి సంజయ్. పొన్నంను మీ అమ్మకే పుట్టినావా అనే చిల్లరగాడు ఎంపీగా అవసరమా అంటూ సంజయ్ పై ఫైర్. బీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్ ఐతే కవితపై అసలు కేస్ ఎందుకు అయ్యేది..? కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తూ లబ్ది పొందాలని ప్రయత్నిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు వేస్తే అది బీజేపీ గెలుపుకు కారణమవుతుందనేది అంతా గమనించాలి. ఎన్నికల తర్వాత రేవంత్ మరొక ఏక్ నాథ్ షిండే, హిమంత బిశ్వాస్ శర్మ కాబోతున్నాడనేది గ్యారంటీ’’ అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. -
ప్రజల కోసమే ఒక మెట్టు దిగా.. రాజకీయాల కోసం కాదు: రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. సికింద్రాబాద్‌లోని అల్వాల్ టిమ్స్ (TIMS) సమీపంలో సీఎం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాజీవ్ రహదారిపై 11 కిలోమీటర్ల పొడవుతో 6 లేన్లతో భారీ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనున్నారు. రూ. 2,232 కోట్లతో ఈ పనులను చేపట్టనున్నారు. ఈ కారిడార్ పూర్తయితే.. హైదరాబాద్ నుంచి సిద్దిపేట, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ వైపు వెళ్లే వారికి ప్రయాణం సులభం కానుంది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. దీని ద్వారా మేడ్చల్, కుత్బుల్లాపూర్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రయాణం సులభతరం అవుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణతో ఈ ప్రాజెక్టు ఆలస్యమైందని రేవంత్ విమర్శించారు. ప్రజల అవసరాన్ని మర్చిపోయి గత ప్రభుత్వం కేంద్రంతో గిల్లికజ్జాలు పెట్టుకుని ప్రాజెక్టును పక్కనబెట్టిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరించామని చెప్పారు. ప్రధాని మోదీని, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి ప్రాజెక్టు అవసరాన్ని వివరించామని చెప్పారు. చదవండి: 15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు భైముల కేటాయింపు, చాంద్రాయణగుట్ట రక్షణశాఖ భూముల లీజ్ రెన్యూవల్ చేయకుండా గత ప్రభుత్వం జాప్యం చేసిందన్నారు సీఎం రేవంత్. తమ ప్రభుత్వమే అధికారులతో సమీక్షించి రక్షణ శాఖకు భూములు అప్పగించామని తెలిపారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంతో కేంద్రం రాష్ట్రానికి సహకరించిందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ దిక్కుమాలిన విధానాలతో ప్రజలకు శిక్ష పడిందని దుయ్యబట్టారు. ‘ఈ ఎలివేటేడ్ కారిడార్ ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారం. ఉత్తర తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఎలివేటేడ్ కారిడార్ పూర్తవ్వాలి. ప్రజల అవసరాల కోసమే ఒక మెట్టు దిగా.. రాజకీయాల కోసం కాదు. అభివృద్ధి కోసం మెట్టు దిగడంలో తప్పు లేదు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌లో ఏదైనా ఒక శాశ్వత అభివృద్ధి చేశారా? ఈ నగరంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ పాలనలోనే. కేసీఆర్ హయాంలో గంజాయి, డ్రగ్స్, పబ్బులు తప్ప ఏం రాలేదు. అభివృద్ధి కోసం భవిష్యత్తులోనూ కేంద్రాన్ని అడుగుతూనే ఉంటాం. కేంద్రం సహకరించకపోతే కొట్లాడుతాం. ఈ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేస్తాం. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు. ఎన్నికలు ముగిశాక అభివృద్ధి మా లక్ష్యం. రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. మా పోరాటం ఫలించిందని కేటీఆర్ అంటుండు.. ఏం పోరాటం చేసిండు. ట్విట్టర్లో పోస్టులు పెట్టుడా? మేం అనుమతులు తీసుకొస్తే ఆయన పోరాటం అని చెప్పుకుంటుండు.ఈ వేదికగా కేటీఆర్‌కు నేను సూచన చేస్తున్నా. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఇందిరా పార్కు వద్ద కేటీఆర్ ఆమరణ దీక్ష చేయాలి. కేటీఆర్ చచ్చుడో అభివృద్ధికి నిధులు వచ్చుడో తేలే వరకు దీక్ష చేయాలి. ఆయన దీక్షకు దిగితే మా కార్యకకర్తలే ఆయన్ను కంచె వేసి కాపాడుతారు.’ అని రేవంత్ పేర్కొన్నారు. -
రేవంత్.. నీకు చాతనైతే టీడీపీ, కాంగ్రెస్‌ను తిట్టాలి: హరీష్‌రావు
సాక్షి, సంగారెడ్డి: టీడీపీ అధినేత చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలే పాలమూరు పాలిట శాపాలుగా మారాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు సీరియస్ కామెంట్స్ చేశారు. పాలమూరు వలసలకు కారణం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే కారణమని ఆరోపించారు. కాగా, హరీష్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మహబూబ్‌నగర్ వెనుకబాటుతనానికి కారణం నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలనే. ఇప్పుడు రేవంత్ తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలి. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను నిందించాలి. చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలుగా మారాయి. పాలమూరు వలసలకు కారణం ఆ రెండు పార్టీలే. గత పార్టీల నాయకులు ప్రాజెక్టుల పేర్లు మార్చారు తప్ప పనులు పూర్తి చేయలేదు. మేము పెండింగ్ ప్రాజెక్టును రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం. అలాంటి కేసీఆర్‌ను రేవంత్ తిట్టడం అవివేకం. ముఖ్యమంత్రి మాట్లాడే భాషతో, పరుష పదజాలంతో పరిపాలన సాగదు. ప్రతిపక్షంలో ఉన్నట్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదు. మంచిపేరు తెచ్చుకోవాలంటే వల్గారిటీ కాదు, చిల్లర మల్లర భాష మాట్లాడి పదవి గౌరవం తగ్గించుకోవద్దు. ఎంత ఎత్తులో ఉన్నామన్నది కాదు, ప్రజలకు ఎంత మంచి చేశామన్నది ముఖ్యం. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం రేవంత్ చేస్తున్నాడు. పదేళ్లు చంద్రబాబు దత్తత తీసుకొని ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. తన తండ్రి చనిపోతే స్నానం చేసేందుకు నీళ్లు లేక నెత్తి మీద నీళ్లు చల్లుకొని వెళ్లినా అని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ సమయంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదా?. పాలమూరు కరువుతో రాజకీయాలు చేసింది కాంగ్రెస్, టీడీపీ పార్టీలే. కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను నాడు కాంగ్రెస్ ఎందుకు పూర్తి చేయలేదు. 1984లో కల్వకుర్తికి కొబ్బరికాయ కొట్టి 2014 వరకు 13వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. కానీ, మేము బాగు చేసి నీళ్లు ఇచ్చాము. ఈ నాలుగు ప్రాజెక్టుల కింద ఆరున్నర లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చాం. వలసలు, రైతు ఆత్మహత్యలకు కారణమైంది కాంగ్రెస్ పార్టీనే. వాస్తవాలు కప్పి పెట్టి కేసీఆర్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టు 80శాతం అయ్యింది. కాల్వలు పూర్తి చేసి నీళ్లు ఇవ్వండి. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని ప్రజలను దృష్టి మరల్చే ప్రయత్నం సరికాదు. ఓట్లు, సీట్లే కాదు నిజాయతీగా పని చేయాలి’ అని వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణ హైకోర్టు.. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకం కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ఈ సందర్భంగా కోదండరామ్, అలీఖాన్‌ల నియామకాన్ని హైకోర్టు కొట్టివేసింది. వివరాల ప్రకారం.. తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ.. సిఫార్సుల తిరస్కరణలో గవర్నర్ తమిళిసై తీరును హైకోర్టు తప్పు పట్టింది. వీరి ఎన్నికను పున:పరిశీలించాలని గవర్నర్‌ను కోర్టు ఆదేశించింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల జాబితాను మరోసారి కేబినెట్ ముందు ఉంచి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇదే సమయంలో ఇద్దరు ఎమ్మెల్సీలను నియమిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకాలను కోర్టు కొట్టివేసింది. అలాగే, మంత్రి మండలి నిర్ణయాలకు గవర్నర్ కట్టుబడి ఉండాల్సిదేనని హైకోర్టు సూచించింది. ఇక, మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకాలను చేపట్టాలని కోర్టు తెలిపింది. ఈ సందర్భంలో ఆర్టికల్ 171 ప్రకారం కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆపడానికి వీల్లేదని హైకోర్టు దృష్టికి పిటిషనర్ తరుపు న్యాయవాదులు తీసుకెళ్లారు. -
రేవంత్ రేసు గుర్రం కాదు.. కీలు గుర్రం: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భయంకరమైన కరువు ఏర్పడేలా ఉందని.. నీళ్లు ఉన్న ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురువారం ఆమె మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. సాగు తాగు, నీటికి కటకట వస్తుందని.. కాళేశ్వరంలో నీళ్లు ఉన్న వదలడం లేదన్నారు. సీఎం వ్యవహారం చూస్తే తెలంగాణను ఎడారి చేయాలని చూస్తున్నట్లు ఉందన్నారు. రేవంత్ డీఎన్ఏలో బీజేపీ ఉందని, ఆయన రేసు గుర్రం కాదు కీలు గుర్రం అంటూ అభివర్ణించారు కవిత. గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సమీక్ష చేయటం లేదు. ఉద్యోగాల రిజర్వేషన్లలో రోస్టర్ విధానం తీసుకొచ్చారు. మేము ప్రభుత్వాన్ని పడగొట్టం. బీజేపీయే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడుతుంది. కేసీఆర్ నియంత అన్న మేధావులు రేవంత్ రెడ్డి ఉద్యోగాల రిజర్వేషన్‌పై చేస్తున్న కుట్రలను ఎందుకు ప్రశ్నించటం లేదు. మేధావుల మౌనం చాలా ప్రమాదం. అంతు చూస్తా అంటున్న రేవంత్‌పై కచ్చితంగా చర్యలు తీసుకోవాలి’’ అని కవిత డిమాండ్ చేశారు. మహిళ వ్యతిరేక ప్రభుత్వంగా కాంగ్రెస్ సర్కార్‌పై ముద్ర పడబోతోంది. పూర్తిగా మహిళా రిజర్వేషన్లు కోల్పోయే ప్రమాదం ఉంది. మొన్న ఇచ్చిన 30 వేల ఉద్యోగాల్లో ఎంత మంది మహిళలకు వచ్చాయి. పాత జీవోలు రద్దు చేసి, కొత్త జీవోలు ఇస్తున్నారు. దీక్షకు అనుమతులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడెందుకు ఇవ్వటం లేదు. మరో గంట వేచి చూసి కోర్టుకు వెళ్లి రేపటి ధర్నా అనుమతి తెచ్చుకుంటాం. కాంగ్రెస్ అనుమతులు ఇవ్వకపోతే కోర్టుకు అనుమతి తెచ్చుకొని బతుకమ్మలు ఆడిన చరిత్ర మాది’’ అని కవిత పేర్కొన్నారు. ఇదీ చదవండి: TS: కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. పరిశీలనలో పేర్లు ఇవే -
TS: కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. పరిశీలనలో పేర్లు ఇవే
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఈ ప్రక్రియలో కీలకమైన కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం నేడు సాయంత్రం ఆరు గంటలకు ఢిల్లీలో జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ భేటీలో పార్టీ మాజీ చీఫ్‌లు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అంబికా సోని పాల్గొననున్నారు. తెలంగాణ, కేరళ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై సీఈసీ కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ జాబితాను తెలంగాణ పీసీసీ.. సీఈసీకి పంపించింది. సీఈసీ పరిశీలనలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా 1. మహబూబ్‌గర్: వంశీచంద్ రెడ్డి 2. కరీంనగర్ : ప్రవీణ్ రెడ్డి 3. నిజామాబాద్ : జీవన్ రెడ్డి 4. పెద్దపల్లి : గడ్డం వంశీకృష్ణ 5. జహీరాబాద్ : సురేష్ శెట్కార్ 6. సికింద్రాబాద్ : బొంతు రామ్మోహన్ 7. నల్గొండ : జానారెడ్డి 8. భువనగిరి : చామల కిరణ్ కుమార్ రెడ్డి 9. మహబూబాబాద్ : బలరాం నాయక్ 10.వరంగల్ : అద్దంకి దయాకర్ /సర్వే సత్యనారాయణ 11. చేవెళ్ల : సునీత మహేందర్ రెడ్డి 12. హైదరాబాద్: ఫిరోజ్ ఖాన్ 13. నాగర్ కర్నూల్ : మల్లు రవి/ సంపత్ కుమార్ 14. ఖమ్మం : నందిని/ ప్రసాద్ రెడ్డి/ యుగంధర్ 15. మెదక్ : నీలం మధు -
పదేళ్లూ బీజేపీ సర్కార్ చేసిందేంటి?
సాక్షి, హైదరాబాద్: గతంలో ప్రధాని మోదీ, బీజేపీ నేతలు అమిత్ షా, జేపీ నడ్డా తెలంగాణకు వచ్చిన ప్రతిసారీ కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్కు ఏటీఎంగా మారిందని ఆరోపించేవారని.. మరి ఇన్నేళ్లూ ఎలాంటి చర్యలు తీసుకోలేదేమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ బీజేపీ నేతలు చేస్తున్న డిమాండ్‌ను ఆయన తప్పుబట్టారు. గత పదేళ్లలో కేంద్రం ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశించలేదని నిలదీశారు. కాళేశ్వరం బ్యారేజీల డిజైన్లు, నిర్మాణంపై అధ్యయనం కోసం కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీతో బుధవారం జలసౌధలో ఉత్తమ్ సమావేశమయ్యారు. అనంతరం మీడి యాతో మాట్లాడారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీ తమ ప్రభుత్వంపై చిత్రవిచిత్రమైన ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ వాళ్లు పదేళ్లపాటు అలయ్ బలయ్ చేసుకుని పాలించారని విమర్శించారు. రాష్ట్రానికి మోదీ చేసిందేమీ లేదు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పీఎఫ్సీ నుంచి రూ.50వేల కోట్లు, ఆర్ఈసీ నుంచి రూ.20వేల కోట్లు, బ్యాంకుల నుంచి రూ.10 వేల కోట్ల రుణాలను ఇచ్చిందని.. అలాంటిది బీజేపీ వారే తమపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని ఉత్తమ్ విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే రూ.80వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడానికి సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చిందని.. మళ్లీ రూ.94వేల కోట్లకు అంచనాలను పెంచేందుకు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. మోదీ ప్రధాని అయిన కొత్తలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని.. తెలంగాణలోని ఏడు మండలాలు, సీలేరు జలవిద్యుత్ ప్రాజెక్టును ఏపీకి అప్పగించారని ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం రావాల్సిన కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌లను నెలకొల్పలేదన్నారు. ప్రధాని అయిన నాటి నుంచి ఇప్పటివరకు మోదీ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. సాధ్యమైనంత త్వరగా మధ్యంతర నివేదిక.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు జరిగిన నష్టం, లోపాలు, కారణాలను తేల్చి పరిష్కార మార్గాలను సూచించాలని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీని కోరామని ఉత్తమ్ తెలిపారు. నివేదిక సమర్పించడానికి కమిటీకి కేంద్రం 4 నెలల గడువు నిర్దేశించినా.. బ్యారేజీల పునరుద్ధరణ చర్యలు చేపట్టడానికి వీలుగా సాధ్యమైనంత త్వరగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని కోరినట్టు వెల్లడించారు. అందులో పునరుద్ధరణ చర్యలను సైతం సిఫారసు చేయాలన్నారు. కమిటీ అడిగిన అన్నిరకాల నివేదికలు, సమాచారాన్ని అందించాలని అధికారులను ఆదేశించామన్నారు. సమాచారాన్ని దాచే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమిటీకి ప్రభుత్వపరంగా సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. కమిటీ గురువారం మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను, శుక్రవారం సుందిళ్ల బ్యారేజీని సందర్శిస్తుందని తెలిపారు. నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ తప్పు చేసిందని కమిటీ తేల్చితే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మేడిగడ్డపై న్యాయ విచారణ విషయంలోనూ త్వరలో ముందడుగు పడుతుందన్నారు. -
వంద రోజుల్లో ఏం సాధించారు?
సాక్షి, హైదరాబాద్: వందరోజుల పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి సాధించిందేముందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు ప్రశ్నించారు. నన్ను చూసి, వందరోజుల పాలన చూసి ఓటేయాలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, ఆయన పాలనలో ఏముందని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు సీఎంగా రేవంత్‌రెడ్డి అటు ప్రజలను, ఇటు కాంగ్రెస్ పార్టీని సైతం మోసం చేశారని ధ్వజమెత్తారు. బుధవారం హరీశ్‌రావు మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడ్డారు. వైట్ పేపర్, బ్లాక్ పేపర్ అంటూ సీఎం కాషాయ లవ్ లెటర్ రాశారని విమర్శించారు. మళ్లీ మోదీనే కేంద్రంలో అధికారంలోకి వస్తాడు అన్నట్టుగా రేవంత్ మాట్లాడారని హరీశ్‌రావు పేర్కొన్నారు. 10 రోజుల్లో ఎన్నికల కోడ్ రానుండగా, మోదీని ఎందుకు అంత పొగడడమని నిలదీశారు. గుజరాత్ మోడల్ నిరంకుశమని రాహుల్ అన్న విషయాన్ని గుర్తు చేస్తూ... రేవంత్ మాత్రం గుజరాత్ మోడల్ కావాలంటున్నారని.. ఇందులో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రాహుల్ ప్రధాని అవుతాడన్నప్పుడు.. మోదీ సహకారం ఎందుకు కావాలని అడుగుతారు? ’అని నిలదీశారు. కాంగ్రెస్‌తో పాటే వచ్చిన కరువు ‘కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే కరువొచ్చింది. కొత్త కొత్త బోరు బండ్లు వచ్చాయి. ట్యాంకర్ల ద్వారా వరిపంటకు నీళ్లుపోస్తున్నారు. అధికారంలోకి వస్తే రూ.4వేల పింఛన్లు ఇస్తామన్నారు.. కనీసం రూ.2వేల పింఛన్‌ను కూడా నెలనెలా ఇవ్వడం లేదు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదు. రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని ఇంత వరకు ఆ ఊసే ఎత్తలేదు. కనీసం వచ్చే యాసంగికైనా రూ.500 బోనస్ ఇవ్వాలి. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని చెప్పి.. ఇప్పుడు రక్తం పిండి వసూలు చేస్తున్నారు. నిరుద్యోగులకు రూ.4వేలు ఇస్తామని చెప్పి అసెంబ్లీలో ఆ ఊసే ఎత్తలేదు. ఆటో అన్నలకు రూ.12వేలు ఇస్తామని చెప్పారు. ఎందరో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అప్పుడు అప్పుల గురించి మాట్లాడి... ఇప్పటికే రూ.16వేలకోట్లు అప్పులు చేశారు. ఇంకా అప్పు కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఉపాధి హామీ పథకం పని చేసే 3000 మందికి ఇప్పటివరకు జీతాలు రాలేదు. విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు లేవు. విదేశీ విద్యకు ఇప్పటివరకు పైసలు ఇవ్వడం లేదు.’అని హరీశ్ ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం రిపోర్టుకు నాలుగు నెలలా? ’’కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్డీఎస్ఎ రిపోర్ట్ రావడానికి 4 నెలల సమయం ఎందుకు పడుతుంది? వచ్చే వానాకాలంలో నీళ్లు ఇవ్వరా? వర్షాకాలంలో ఫ్లడ్ వచ్చి పంప్ హౌస్ మునిగిపోతే, మేము ప్రభుత్వానికి భారం పడకుండా త్వరితగతిన పూర్తి చేసి నీళ్లు లిఫ్ట్ చేశాము. తుమ్మిడి హెట్టి దగ్గర ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భూసేరణ చేసి ప్రాజెక్టు నిర్మాణం చేయవచ్చు. తుమ్మిడి హెట్టిపై రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడారు’’అని హరీశ్ విమర్శించారు. -
12న రాష్ట్రానికి అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 12న రాష్ట్రానికి రానున్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగా రాష్ట్ర పార్టీకి దిశానిర్దేశం చేయాలని ఆయన భావిస్తున్నారు. 12న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో పోలింగ్ బూత్ కమిటీలు ఆ పైస్థాయి నాయకులు, కార్యకర్తలతో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. వచ్చే ఎన్నికల్లో పటిష్టమైన పోల్ మేనేజ్మెంట్ అమలు, బూత్ స్థాయిలో పార్టీకి ఓట్లు వేయించుకోవడంపై అవగాహన కల్పించనున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల కంటే ముందుగానే 17 ఎంపీ సీట్లకు గాను 9 స్థానాల్లో అభ్యర్థులను బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించిన సంగతి విదితమే. మిగతా సీట్లకు అభ్యర్థుల ఖరారు కసరత్తు సాగుతుండగా, బుధవారం ఢిల్లీలో జరగాల్సిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం శుక్రవారానికి వాయిదా పడింది. ఈ సమావేశంలో మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీ కాంగ్రెస్ సర్కార్, బీఆర్ఎస్లపై విరుచుకుపడటం ద్వారా ఎన్నికల వేడిని రాజేశారు. అమిత్‌షా పర్యటన తర్వాత బీజేపీ దూకుడు మరింత పెంచే అవకాశం ఉంది. చార్జిషీటుపై కసరత్తు షురూ పార్టీ పరంగా ప్రకటించాల్సిన లోక్‌సభ ఎన్నికల ప్రణాళికలో చేర్చాల్సిన అంశాలపై జాతీయ స్థాయిలో కసరత్తు సాగుతోంది. ఇందులో పొందుపరచాల్సిన విషయాలపై ఇప్పటికే వివిధ వర్గాల ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల కోసం రాష్ట్ర స్థాయిలోనూ విడిగా మేనిఫెస్టోను విడుదల చేయాలని జాతీయ నాయకత్వం యోచిస్తున్నట్టు సమాచారం. దీంతో పాటు అధికార కాంగ్రెస్ , విపక్ష బీఆర్ఎస్ పార్టీలపై చార్జిషీటు విడుదల చేయాలనే అభిప్రాయంతో ముఖ్య నేతలున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక కసరత్తు కూడా మొదలైనట్టు చెబుతున్నారు. -
నేడు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన!
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఈ ప్రక్రియలో కీలకమైన కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం గురువారం ఢిల్లీలో జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ భేటీలో పార్టీ మాజీ చీఫ్‌లు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అంబికా సోని పాల్గొననున్నారు. రాష్ట్రం నుంచి సీఈసీ సభ్యుడి హోదాలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ ఏర్పాటు చేసిన తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు హాజరు కానున్నారు. ఇప్పటికే పీసీసీల స్థాయిలో షార్ట్ లిస్ట్ అయిన ఆశావహుల జాబితా నుంచి వీలున్నన్ని పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడమే ఎజెండాగా ఈ సమావేశం జరగనుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. భేటీ అనంతరం దేశవ్యాప్తంగా 100 మందికి పైగా అభ్యర్థులతో వీలుంటే గురువారం నాడే లేదంటే శుక్రవారం తొలి జాబితా విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇక ఏకాభిప్రాయం సాధ్యమైతే తెలంగాణలోని దాదాపు అన్ని స్థానాలకు (ఒకట్రెండు మినహా) ఒకేసారి అభ్యర్థులను ప్రకటిస్తారని, లేదంటే 8 నుంచి 10 మంది అభ్యర్థులను ప్రకటిస్తారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. సికింద్రాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, కరీంనగర్, నిజామాబాద్ స్థానాలపై ఇప్పటికే ఏకాభిప్రాయం వచ్చిందని తెలుస్తోంది. మిగిలిన స్థానాలపై కూడా సీఈసీ సమావేశంలో చర్చించిన అనంతరం పలు ప్రాతిపదికల ఆధారంగా అభ్యర్థులను నిర్ణయిస్తారని సమాచారం. రాహుల్ పోటీపైనా స్పష్టత! రాష్ట్రం నుంచి రాహుల్‌గాంధీ పోటీ చేస్తారా లేదా? అన్నదానిపై కూడా ఈ సమావేశంలోనే స్పష్టత రానుంది. ఒకవేళ రాహుల్ పోటీ చేసే పక్షంలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఏఐసీసీ అధికారికంగా విడుదల చేసే తొలి జాబితాలోనే ప్రకటించే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. కానీ ఏఐసీసీ వర్గాల కథనాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆయన తిరిగి ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, కేరళలోని వయనాడ్ రెండింటి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక ప్రియాంకగాంధీ.. తల్లి సోనియాగాంధీ ఐదుసార్లు గెలిచిన రాయ్‌బరేలీ నుండి పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. హస్తినకు ఆశావహులు సీఈసీ సమావేశం నేపథ్యంలో టికెట్ ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే అంచనాలున్న స్థానాల్లో తమ అభ్యర్థిత్వాలు ఖరారవుతాయో లేదోననే ఆసక్తితో కొందరు నేతలు ఢిల్లీ చేరుకున్నట్టు సమాచారం. వివిధ సర్వేల నివేదికలు, పార్టీ విధేయత ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉండనున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసే అవకాశాలున్న తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, పంజాబ్ వంటి రాష్ట్రాల నుంచి తొలి జాబితాలో ఎక్కువమందికి అవకాశం ఉంటుందని తెలుస్తోంది. -
మా ప్రభుత్వాన్ని పడగొడతారట! : రేవంత్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ మూడు నెలలు, ఆరు నెలలు మాత్రమే అధికారంలో ఉంటుందంటూ కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేడీ అంటున్నారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఏం అన్యాయం చేశామని కాంగ్రెస్ సర్కారును కూల్చుతామని అంటున్నారని నిలదీశారు. ఎవరినైనా ఎదుర్కొంటామని, తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ పదేళ్లపాటు అధికారంలో ఉంటుందని చెప్పారు. తమను టచ్ చేస్తే అగ్నికణికలై, మానవ బాంబులై పేలుస్తామని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, బీజేపీల దుర్మార్గపు రాజకీయాలకు పాతరేయాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 90 రోజుల పాలనపై రెఫరెండానికి సిద్ధంగా ఉన్నామన్నారు. బుధవారం మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ కాలేజీ మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన ‘పాలమూరు ప్రజాదీవెన’ బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి పాల్గొని లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించారు. సభలో రేవంత్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘మా ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల బీమా, గృహలక్ష్మి కింద 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీకి చర్యలు తీసుకున్నాం. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నాం. రైతు భరోసా కింద పెట్టుబడిసాయం అందించడంతోపాటు ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలను అందించాం. పదేళ్లు అధికారంలో ఉంటాం.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలే, ఆరు నెలలే ఉంటుందని కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేడీ అంటున్నారు. కేసీఆర్, మోదీలు పదేళ్లు అధికారంలో ఉండాలా? పేదల ప్రభుత్వాన్ని ఆరు నెలలు ఉండనీయరా? 40శాతం ఓట్లతో గెలిచిన ప్రజా ప్రభుత్వాన్ని పడగొడతారా? రైతుబిడ్డ సీఎం కుర్చీపై కూర్చుంటే ఓర్వలేరా? ఒకసారి టచ్ చేసి చూడండి.. మేం అగ్నికణికలై, మానవ బాంబులై పేల్చేస్తాం. తమాషా చేస్తే పండబెట్టి తొక్కి పేగులు మెడకేసుకుని ఊరేగుతాం. నల్లమలలో పుట్టి తొక్కుకుంటూ ఇక్కడి వరకు వచ్చా.. ప్రగతిభవన్ కంచెలు బద్దలుకొట్టి బజారుకు ఈడ్చినోడిని. ఈ పాలమూరు బిడ్డకు తట్టా పార, వలసలే కాదు.. నీలాంటి వారిని బొందపెట్టడం కూడా తెలుసు. కాంగ్రెస్ కార్యకర్తల మీద ఆన.. పాలమూరు బిడ్డగా మాటిస్తున్నా.. తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ పదేళ్ల పాటు అధికారంలో ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.. రాష్ట్రానికి వచ్చిన ప్రధాన మంత్రికి మేం వినతులు ఇస్తే.. ఇక్కడి కొందరు సన్నాసులు ఇష్టమున్నట్టు మాట్లాడుతున్నరు. నేనేమీ మీలాగా ఇంట్లో తలుపులు మూసుకుని, కడుపులో తలకాయ, కాళ్లు పెట్టుకుని పడుకోలేదు. అతిథి సంస్కారంతో ముఖ్యమంత్రిగా బాధ్యత నెరవేర్చిన. రాష్ట్రానికి మేలు జరగాలన్న ఆలోచనతో ప్రధానికి సమస్యలు చెప్పిన. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం సమస్యలు తీర్చకపోతే చాకిరేవు కాడ బట్టలు ఉతికినట్టుగా వారిని ఉతికే బాధ్యత నాదే. కేంద్రం సహకరించకపోతే అన్ని రాష్ట్రాలు తిరిగి కొట్లాడుతా.. పదేళ్లలో వందేళ్ల విధ్వంసం.. రాష్ట్రంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగింది. దుష్ట పాలనలో పందికొక్కుల్లా రాష్ట్రాన్ని దిగమింగారు. పాలమూరు–రంగారెడ్డి, భీమా, నెట్టెంపాడు, కోయల్‌సాగర్, సంగంబండ ప్రాజెక్టులను కుర్చీ వేసుకుని కట్టిస్తానని చెప్పిన కేసీఆర్.. తీవ్ర నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని గాడినపెడుతున్నాం. గత మూడు నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క గంట అయినా ప్రజలకు దూరంగా ఉన్నామా? ఏం అన్యాయం చేశామని మోడీ, కేడీ మా ప్రభుత్వాన్ని కూలుస్తామని మాట్లాడుతున్నారు? ఆరు అడుగులు ఉన్నామంటూ దూలంలా పెరిగిన కొందరికి ఆవుదూడకున్నపాటి బుద్ధి కూడా లేదు. బీఆర్ఎస్ అంటే బిల్లా రంగా సమితి. కేసీఆర్ తన కుమారుడు సీఎం కాకుండా రైతుబిడ్డ సీఎం అయ్యాడన్న అసూయతో మాట్లాడుతున్నారు. ఒంట్లో బాగాలేదన్నప్పుడు నల్లగొండకు ఏం కాసేందుకు వెళ్లారు? ప్రజలు ఓడించి బొక్కలు విరగ్గొడితే సిగ్గులేకుండా వీధుల్లో పడి కాంగ్రెస్‌ను తిడుతున్నారు. ఎదిరించి నిలబడతాం.. దేశంలో మోదీనైనా, రాష్ట్రంలో కేడీనైనా ఎదురించి నిలబడుతాం. తొడగొట్టి పడగొట్టే ధైర్యాన్ని పాలమూరు బిడ్డలే నాకు ఇచ్చారు. పాలమూరు బాధలు తీర్చే బాధ్యత నేను తీసుకుంటా. పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, ఉద్యోగాల కల్పన కోసం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు అనుమతులు, నిధులు వేగంగా మంజూరయ్యేందుకు చర్యలు చేపడతాం. ప్రజలు రాష్ట్రంలోని 14 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలి..’’ అని రేవంత్ పిలుపునిచ్చారు. -
తెలంగాణ సోయిలేనోడు సీఎం కావడం మన ఖర్మ: రేవంత్‌కు కేటీఆర్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్‌కు తెలంగాణ ‘ఆత్మ’ లేదని, తెలంగాణపై గౌరవం అంతకన్నా లేదని విమర్శించారు. అందుకే తెలంగాణ ఆత్మగౌరవంపై మోదీ సాక్షిగా రేవంత్ దాడి చేశారని మండిపడ్డారు. అసలు తెలంగాణ సోయిలేనోడు సీఎం కావడం మన ఖర్మ అని దుయ్యబట్టారు. తెలంగాణ ఆత్మ గౌరవం విలువ తెల్వనోడు సీఎంగా ఉండటం మన దౌర్భాగ్యమని ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్విటర్లో పోస్టు చేశారు. ‘అసలు “గోల్ మాల్ గుజరాత్ మోడల్” కు.. గొల్డెన్ తెలంగాణ మోడల్”తో పోలికెక్కడిదని ప్రశ్నించారు.ఘనమైన “గంగా జెమునా తెహజీబ్ మోడల్” కన్నా.. మతం పేరిట చిచ్చు పెట్టే “గోద్రా అల్లర్ల మోడల్” నీకు నచ్చిందా. అని నిలదీశారు. నిన్న మొన్నటి దాకా గుజరాత్ మోడల్‌పై నిప్పులు చెరిగిన రేవంత్.. ఇవాళ ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే.. ఆయన గురించి గొప్పలు మాట్లాడుతున్నారు. ఇదేం నీతి.. ఇదేం రీతి.. రేవంత్ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. చదవండి: కేంద్రం అడిగిన నిధులు ఇవ్వకపోతే ఉతికి ఆరేస్తా: సీఎం రేవంత్ ‘తెలంగాణ మోడల్ అంటే.. “సమున్నత సంక్షేమ నమూనా”“సమగ్ర అభివృద్ధికి చిరునామా” అనేక రాష్ట్రాలు మెచ్చిన మోడల్. యావత్ దేశానికే నచ్చిన మోడల్. బుడిబుడి అడుగుల వయసులో బుల్లెటు వేగంతో దూసుకెళ్లిన సమగ్ర, సమ్మిళిత, సమీకృత మోడల్. దేశం మెచ్చిన ఈ తెలంగాణ నమూనాను నమో ముందు కించ పరుస్తావా..? నమ్మి ఓటేసిన తెలంగాణపై ఎందుకీ నయవంచన? నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెడతావా..?? నాడు తెలంగాణ “ఉద్యమకారులపై రైఫిల్ ఎత్తావ్..” నేడు “తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టావ్..” నిన్ను చరిత్ర క్షమించదు. నా తెలంగాణ దేనినైనా సహిస్తుంది కానీ.. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకోదు. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఆకాశమంత ఎత్తుకు ఎత్తింది.. బీఆర్ఎస్ కానీ.. నేడు పాతాళంలో పాతిపెట్టేస్తోంది.. కాంగ్రెస్’ అంటూ ధ్వజమెత్తారు. రేవంత్ కు తెలంగాణ “ఆత్మ”లేదు. తెలంగాణపై “గౌరవం” అంతకన్నా లేదు. అందుకే తెలంగాణ “ఆత్మగౌరవం”పై మోడీ సాక్షిగా... రేవంత్ దాడి అసలు తెలంగాణ సోయి లేనోడు.. సీఎం కావడం మన ఖర్మ.. తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెల్వనోడు ముఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యం అసలు “గోల్ మాల్ గుజరాత్ మోడల్”… — KTR (@KTRBRS) March 6, 2024 -
కేంద్రం అడిగిన నిధులు ఇవ్వకపోతే ఉతికి ఆరేస్తా: సీఎం రేవంత్
సాక్షి, మహబూబ్‌నగర్: కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాలమూరు బిడ్డను సీఎం చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తాము అడిగిన నిధులు ఇవ్వకపోతే ఉతికి ఆరేస్తామని హెచ్చరించారు. మోదీతో అయినా కేడీతో అయినా కొట్లాడతానని స్పష్టం చేశారు. మన మర్యాద మన రాష్ట్రానికి మేలు జరగాలనేనని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి.. ప్రజలకు మంచిది కాదని తెలిపారు. ఈ మేరకు బుధవారం మహబూబ్‌నగర్ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అతిథి మన వద్దకు వస్తే గౌరవించాలని.. ప్రధాని సభకు వెళ్లానని పేర్కొన్నారు. భవిష్యత్తులో సహకారం అందించకపోతే చాకిరేవుపెడతానని అన్నారు. బీఆర్ఎస్ అంటే బిల్లా రంగా సమితి విమర్శించిన సీఎం.. పదేళ్లలో తెలంగాణను లూటీ చేశారని మండిపడ్డారు. కుర్చీ వేసుకొని ప్రాజెక్టు పూర్తి చేయలేదు కానీ మందువేసుకొని ఫామ్ హౌజ్‌లో ఉన్నావని కేసీఆర్‌ను ఉద్ధేశించి మండిపడ్డారు. గద్వాలు నీళ్లు తెస్తామన్న కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలమూరుకు ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చిందా అని నిలదీశారు.? ‘అసూయ నా మీద విషం కక్కుతున్నారు. లోక్‌సభ ఎన్నికలు.. తొంబై రోజుల మా పాలనకు రెఫరెండం. ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించబోతున్నాం. కేసీఆర్‌కు ఒంట్లో బాగాలేకపోతే.. అసెంబ్లీకి రాకుండా నల్గొండకు ఎందుకు వెళ్లారు. ఎమ్మెల్సీ అభ్యర్థదిగా జీవన్ రెడ్డిని గెలిపించాలి. 3 నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఇందిరమ్మ రాజ్యం వస్తే 6 నెలలు కూడా ఇండనివ్వరా? 40 శాతం ఓట్లతో గెలిచిన ప్రభుత్వాన్ని పడగొడతారా? పార్టీ ఫిరాయింపులు, పార్టీల్ని చీల్చడమే మీ విధానమా? పాలమూరు బిడ్డ రాష్ట్రాన్ని పాలించకూడదా? మా ప్రభుత్వం మీదకు వస్తే తొక్కుకుంటూ.. బొందపెడతాం. 2024 నుంచి 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఇది నా ఆన’ అంటూ రేవంత్ ప్రసంగించారు -
Amit Shah: తెలంగాణకు అమిత్‌షా.. భారీ సభకు బీజేపీ ప్లాన్
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రులు, బీజేపీ అగ్ర నేతలు తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. దీంతో, రాష్ట్రంలో రాజకీయంగా మరోసారి ఆసక్తికరంగా మారింది. వివరాల ప్రకారం.. తెలంగాణలో మెజార్టీ లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ భారీ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తెలంగాణకు రానున్నారు. ఈనెల 12వ తేదీన అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులు, ఆపై స్థాయి కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు నగరంలోని ఎల్బీ స్టేడియంలో భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
బీజేపీ నేతలతో టచ్‌లో హరీష్‌రావు: కోమటిరెడ్డి వ్యాఖ్యలు
సాక్షి, యాదాద్రి భువనగిరి: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు బీజేపీ చేరుతారని జోస్యం చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ మేరకు హరీష్‌రావు బీజేపీ నేతలతో సంప్రదింపులు చేస్తున్నాడని అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. కాగా, భువనగిరిలో మంత్రి కోమటిరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘బీఆర్ఎస్లో ప్రతిపక్ష నాయకుడి హోదా కేసీఆర్ తన కొడుకు కేటీఆర్‌కు ఇస్తే అల్లుడు హరీష్ పార్టీ నుంచి బయటకు వెళ్తాడు.. అలాగే, అల్లుడికి ఇస్తే కొడుకు బయటకు వెళ్లిపోతాడు. ఇందులో భాగంగానే హరీష్‌రావు బీజేపీ నేతలతో ఇప్పటికే సంప్రదింపులు చేస్తున్నాడని తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే శక్తి మాజీ సీఎం కేసీఆర్‌కు లేదు. అందుకే కేసీఆర్ అసెంబ్లీకి రావడంలేదు. మీలాగా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే బీఆర్ఎస్లో మిగిలేది నలుగురే. ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తే ఆయనను కలిసి వినతి పత్రం ఇవ్వాలి. కానీ, కేసీఆర్ మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిశాడని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో ఎల్ఆర్ఎస్పై కోమటిరెడ్డి స్పందిస్తూ ఎల్ఆర్ఎస్పై గైడ్ లైన్స్ ఇంకా పూర్తి కాలేదు. అలాగే, తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తే మోదీ కంటే ఎక్కువ మోజార్టీ వస్తుంది’ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
TS: బీఆర్ఎస్కు కోనప్ప గుడ్‌బై..! మంత్రి పొంగులేటితో కీలక భేటీ
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బుధవారం ఉదయం తెలంగాణ సెక్రటేరియట్లో రాష్ట్ర రెవెన్యూ,సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చాంబర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడున్న మీడియా ప్రతినిధులతో ఆయన ముచ్చటించారు. కార్యకర్తలతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుపెట్టుకుంటున్నట్లు మంగళవారం రెండు పార్టీల అధ్యక్షులు ప్రెస్మీట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. బీఎస్పీతో పొత్తు విషయంలో అసంతృప్తికి గురైన కోనప్ప బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలోనే కోనప్ప సచివాలయానికి వచ్చి సీఎం రేవంత్ మంత్రి వర్గంలో కీలక మంత్రిగా పేరున్న పొంగులేటితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సిర్పూర్ నుంచి కోనప్పపై పోటీ చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు కొనసాగితే తన రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదం అని భావించిన కోనప్ప పార్టీ మార్పు దిశగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ కోనప్ప, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మధ్య ఉంటుందని అందరూ భావించినప్పటికీ సిర్పూర్ నుంచి అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఇదీ చదవండి.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల ధర్నా -
Cong Vs BRS: రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల ధర్నా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపట్టారు. LRS పథకాన్ని ఉచితం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు.. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఛార్జీలు లేకుండా ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో గులాబీ పార్టీ నేతలు ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే, హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ, హెచ్‌డీఎంఏ కార్యాలయాల వద్ద నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, సీతక్క మాట్లాడిన మాటలను బీఆర్ఎస్ నేతలు గుర్తుచ చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారమే 25 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రజల నుంచి 20వేల కోట్లు వసూలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నిరసనల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు ఉన్నారు. అమీర్‌పేటలోని మైత్రివనం హెచ్ఎండీఏ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ ధర్నాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. తలసాని కిరణ్ వినూత్న నిరసన.. అమీర్‌పేటలోని HMDA కార్యాలయం ముందు బీఆర్ఎస్ నేత తలసాని సాయి కిరణ్ వినూత్న నిరసన చేపట్టారు. వాటర్ బాబిల్స్‌తో హెచ్ఎండీఏ ముందు నిరసన. ఈ క్రమంలో హెచ్ఎండీఏ సిబ్బందికి వాటర్ బాటిల్స్ పంపిణీ చేసిన కిరణ్. తాను ఇచ్చిన నీళ్లు తాగి ప్రశాంతంగా ఎల్ఆర్ఎస్ రద్దు అంశం ఆలోచించాలని కోరిన కిరణ్. ఈ సందర్బంగా తలసాని కిరణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై భారం మోపాలని చూస్తోంది. ఎల్ఆర్ఎస్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారు. గత ప్రభుత్వాన్ని విమర్శించిన నాయకులు ఇప్పుడెందుకు ఎల్ఆర్ఎస్ అమలు చేస్తున్నారు అని ప్రశ్నించారు. -
వీడ్కోలు సమయాన విన్నపాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తన రెండురోజుల పర్యటన ముగించుకుని ఒడిశాకు వెళ్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి సీఎం రేవంత్‌రెడ్డి తన విన్నపాల చిట్టా అందజే శారు. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో వేలకోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్న ప్రధాని మంగళవారం ఒడిశాకు బయలుదేరారు. సీఎం రేవంత్ బేగంపేట విమానాశ్రయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయనకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మొత్తం 11 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ► ఎన్టీపీసీకి 4,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉంది. అయితే గత ప్రభుత్వం 1,600 మెగావాట్లు మాత్రమే సా ధించింది. మిగిలిన 2,400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్రం సహ కరించాలి. రాష్ట్రం తరఫున అన్ని అనుమతులు ఇస్తాం. ► హైదరాబాద్‌లో మెట్రో విస్తరణకు, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి (ప్రక్షాళనకు) సహకరించాలి. ► తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భూసేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేలా ప్రధాని జోక్యం చేసుకోవాలి. ► హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై అమ్రాబాద్ అటవీ ప్రాంతం మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సహకరించాలి. 2022–23లోనే కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ తయారీకి రూ.3 కోట్లు మంజూరు చేసింది. రూ.7,700 కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును మంజూరు చేయాలి. ► రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా నీరు నూటికి నూరు శాతం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలి. దాదాపు పది లక్షల కుటుంబాలకు ఇప్పటికీ నల్లాల ద్వారా నీటి సరఫరా జరగడం లేదు. సమీపంలోని నీటి వనరుల ద్వారా గ్రామాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు జల జీవన్ మిషన్ నిధులు కేటాయించాలి. ► ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి హైదరాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో 178 ఎకరాలు, 10 టీఎంసీల కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణానికి పొన్నాల గ్రామ సమీపంలోని 1,350 ఎకరాల మిలటరీ డెయిరీ ఫామ్ ల్యాండ్స్ (తోఫెఖానా) రాష్ట్రానికి బదిలీ చేయాలి. లీజు గడువు ముగిసిన శామీర్‌పేటలో ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ భూములను (1,038 ఎకరాలు) తిరిగి అప్పగించాలి. ► నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్నాం. 5,259 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ప్రభుత్వం నిర్వహిస్తో్తంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర వాటాగా రాష్ట్రానికి రావాల్సిన రూ.347.54 కోట్లను విడుదల చేయాలి. ► భారత్ మాల పరియోజన జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా కల్వకుర్తి–కొల్లాపూర్, గౌరెల్లి–వలిగొండ, తొర్రూర్ – నెహ్రూనగర్, నెహ్రూనగర్–కొత్తగూడెం, జగిత్యాల–కరీంనగర్ ఫోర్‌లేన్, జడ్చర్ల–మరికల్ ఫోర్‌లేన్, మరికల్ – డియసాగర్ టెండర్ల ప్రక్రియకు అనుమతులివ్వాలి. ► ఇండియా సెమీ కండకర్ల మిషన్‌లో భాగంగా తెలంగాణలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం సహకరించాలి. అత్యవసరంగా 29 ఐపీఎస్ పోస్టులను కేటాయించాలి కేంద్ర హోంశాఖ 2016లో తెలంగాణకు 76 ఐపీఎస్ కేడర్ పోస్టులను మంజూరు చేసింది. ప్రస్తుతం పెరిగిన జిల్లాలు, పోలీస్ కమిషనరేట్ల సంఖ్యకు అనుగుణంగా ఐపీఎస్ క్యాడర్‌ను సమీక్షించాలి. అత్యవసరంగా 29 పోస్టులను కేటాయించాలి. ఐఐఎం కూడా ఏర్పాటు చేయండి ఐఐటీ, నల్సార్, సెంట్రల్ వర్సిటీతో పాటు ఎన్నో పేరొందిన పరిశోధన, ఉన్నత విద్యా సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయి. కేంద్రం ఐఐఎంను కూడా ఏర్పాటు చేస్తే అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. మాకే ఓటేయండి.. మంగళవారం బేగంపేట విమానాశ్రయంలో ఓ సరదా సన్నివేశం చోటు చేసు కుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఏకంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్‌రెడ్డిని బీజేపీకి ఓటేయాలంటూ కోరారు. మంగళవారం ప్రధానికి వీడ్కోలు పలికే సమయంలో క్లిక్‌మనిపించిన ఈ ఫొటోలో మోదీ, రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి పొన్నం, నాగర్‌కర్నూల్ ఎంపీ పి.రాములు ఉన్నారు. ఇటీవల బీజేపీలో చేరిన రాములు.. సీఎం రేవంత్ తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఓటరేనని ఈ సందర్భంగా మోదీకి చెప్పారు. అందుకు రేవంత్ కూడా అవునంటూ బదులిచ్చారు. వెంటనే స్పందించిన మోదీ ‘అయితే ఇంకేంటి.. ఈసారి మా కే ఓటేయండి..’ అంటూ సరదాగా వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మోదీ సహా ఫొటోలో కనిపిస్తున్న నేతలు ఒక్కసారిగా ఘొల్లున నవ్వారు. – సాక్షి, హైదరాబాద్ -
రేవంత్ మూలాలు బీజేపీలో..
సిరిసిల్ల: రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీని ‘పెద్దన్నయ్య’గా పొగిడి ఆయన ప్రాపకం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రయత్నించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామా రావు విమర్శించారు. భవిష్యత్తులోనూ ప్రధాని ఆశీస్సులు ఉండాలని కోరడం ద్వారా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పరోక్షంగా వేస్ట్‌ఫెలో అని రేవంత్ చెప్పినట్లు అయిందని ఎద్దేవా చేశారు. రేవంత్ మూలాలు బీజేపీలో ఉన్నా యని... ఆయన మరో ఏక్నాథ్ షిండే (శివసేనను చీల్చి బీజేపీ మద్దతుతో మహారాష్ట్ర సీఎం అయిన నేత), హిమంత బిశ్వశర్మ (కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి సీఎం అయిన అస్సాం సీఎం) అని వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తా బాద్, సిరిసిల్లలో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. రుణమాఫీ, రైతుబంధు ఏదీ? బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్ చెప్పారు. తాము తీసుకొ చ్చిన అనేక పథకాలను కేంద్రం కాపీ కొట్టిందన్నా రు. అలాంటిది రాష్ట్రంలో గుజరాత్ నమూనా అభివృద్ధికి సహకరించాలని ప్రధానిని సీఎం రేవంత్ కోరడమంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించ పరచడమేనని మండిపడ్డారు. ఆయన సీఎం కావ డం మన కర్మ అని పేర్కొన్నారు. ప్రజలు మోస పోవాలని కోరుకుంటున్నారని గతంలో మీడియా ముందు రేవంత్ చెప్పారని, ఇప్పుడు అదే జరిగిందన్నారు. రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇప్పటికీ రైతుబంధు వేయలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో ఎర్రని ఎండల్లోనూ చెరు వులు మత్తడి దూకితే ప్రస్తుతం కరెంట్ కోతలు, నీరులేక పొలాలు ఎండిపోతున్నాయన్నారు. కాళేశ్వరం గురించి కాంగ్రెస్ సన్నాసులకు ఏం తెలుసు? కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రూ. లక్ష కోట్లు గంగ పాలయ్యాయని కాంగ్రెసోళ్లు అంటున్నారని, ఆ ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ సన్నాసులకు ఏం తెలుసని కేటీఆర్ ప్రశ్నించారు. సగం తెలంగాణ కాళేశ్వరం పరిధిలో ఉందని, 270 కి.మీ. సొరంగంతో వందల కి.మీ. కాల్వలతో పంపుహౌస్‌లు, విద్యుత్ సబ్స్టేషన్లతో గోదావరి జలాలను ఎత్తి పోస్తూ చెరువులను నింపామన్నారు. కాళేశ్వరం నీటితో 3.50 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించే స్థాయికి రైతులు చేరుకున్నారని వివరించారు. మేడిగడ్డలో ఒక్క పిల్లర్ కుంగిపోతే.. మొత్తం ప్రాజెక్టు గంగపాలైనట్లు ప్రచారం చేస్తున్నారని, మేడిగడ్డ వద్ద కుంగిన పిల్లర్ చుట్టూరా కాఫర్ డ్యాం కట్టి ఇప్పటికీ నీటిని ఎత్తిపోయొచ్చని, పొలాలు ఎండకుండా చూడొచ్చన్నారు. కానీ ఈ ప్రభుత్వానికి ఆ తెలివి లేదని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్‌పై కోపాన్ని రేవంత్ రైతులపై చూపుతున్నారని... సిరిసిల్ల పవర్‌లూం పరిశ్ర మకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకుండా తనపై కోపాన్ని నేతన్నలపై చూపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రంగు.. కాంగ్రెస్ పొంగు తెలిసింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇస్తే ఇప్పుడు నియామక పత్రాలు అందిస్తూ 30 వేల ఉద్యోగాలిచ్చామని సీఎం రేవంత్ పేర్కొన డం మందికి పుట్టిన బిడ్డను సొంత బిడ్డగా ముద్దా డినట్లు ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి రంగు.. కాంగ్రెస్ పొంగు తెలిసిపోయిందని, 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తోందన్నారు. గురువారం సిరిసిల్లకు వస్తున్న రేవంత్... కేసీఆర్ హయాంలో సిరిసిల్లలో జరిగిన అభివృద్ధిని చూడాలని సూచించారు. మల్కపేట రిజర్వా యర్‌ను ప్రారంభించాలని, సిరిసిల్ల వర్కర్లను ఓనర్లను చేయాలని, సిరిసిల్ల నేతన్నలకు బతు కమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వాలని, పాత బకాయిలను నేతన్నలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లాకు బండి ఏం చేశారు? కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సిరిసిల్ల జిల్లాకు ఏం చేశారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అమిత్ షా చెప్పులు మోయడం తప్ప ఒక్క గుడి.. ఒక్క బడి కట్టలేదని ఆరోపించారు. ప్రజలకు ఏం చేశారని ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు. -
దీర్ఘకాలిక లక్ష్యంతోనే పొత్తు
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆకాంక్షలకు అనుగు ణంగా దీర్ఘకాలిక లక్ష్యంతోనే బీఎస్పీతో పొత్తు కుదుర్చుకున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్లో మంగళవారం జరిగిన మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలతో ఉమ్మడి భేటీలో కేసీఆర్ మాట్లా డారు. బీఎస్పీతో పొత్తుకు సంబంధించి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌తో జరిగిన చర్చలు, తీసుకున్న నిర్ణయాలను వివరించారు. శక్తులను కూడదీసుకోవాలి ‘ప్రస్తుత పరిస్థితుల్లో మనం మన శక్తులను కూడదీసుకోవడంతోపాటు కలసి వచ్చే భావసా రూప్య శక్తులను కలుపుకొని పోవాలి. ఆ దిశగా మనం తీసుకున్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రయోజనాలను కాపాడే దీర్ఘకాలిక లక్ష్యంతో కూడుకొని ఉంది. లౌకికవాద తాత్వికతతో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిన కృషి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ నేపథ్యంలో దళిత బహుజన శక్తులతో కలసి పనిచేయడం ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మరింత చేరువవుతాం. బీఎస్పీ కలసికట్టుగా పనిచేసి ప్రజాభీష్టాలను సంపూర్ణంగా నెరవేరుద్దాం. ఈ దిశగా మరిన్ని చర్చలు జరిపి రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుల విధివిధానాలను ఖరారు చేస్తాం’ అని కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రకటనను హర్షధ్వానాల నడుమ ముక్తకంఠంతో పార్టీ నేతలు ఏకీభవించారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాదరణ పొందుదాం ‘ఉద్యమ కాలం నుంచి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బీఆర్ఎస్ పనిచేస్తోంది. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాదరణ పొందుదాం. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో నిలిచిన పెండింగ్ ప్రాజెక్టుల తోపాటు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాం. బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన ఎత్తిపోతల పథకం ద్వారానే కొడంగల్‌కు పుష్కలంగా సాగునీటిని తరలించవచ్చు. అయినా ఉన్నదాన్ని తీసేసి కొడంగల్‌కు లిఫ్ట్‌ను ఏర్పాటు చేయాలను కోవడం సరైన నిర్ణయం కాదు’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పార్టీని వీడే వారి గురించి ఆలోచించకుండా ప్రజా సమస్యలపై పోరాడదా మని పిలుపునిచ్చారు. డొల్లతనంతో కాంగ్రెస్ సర్కార్ అభాసుపాలు ‘ఓట్లేసి గెలిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం తాగు, సాగునీరు, విద్యుత్ వంటి కనీస అవసరాలను తీర్చలేకపోవడంతో ప్రజలు విస్మయం చెందుతున్నారు. కొత్తగా ఇచ్చే తెలివి లేక గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కూడా కొనసాగించలేక పాలనలోని డొల్లతనాన్ని స్వయంగా కాంగ్రెస్ సర్కార్ బయటపెట్టుకొని అభాసుపాలవు తోంది. ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు కాకముందే ప్రజావ్యతిరేకతను మూటకట్టు కుంది. అధికారం కోసం ఎన్నికల ముందు గ్యారంటీల పేరిట అలవికాని హామీలు ఇచ్చింది. ఇప్పుడు అమలు చేతకాక అబద్ధాలకు, బెదిరింపులకు దిగి తప్పించుకుంటోంది’ అని కేసీఆర్ మండిపడ్డారు. మహబూబ్‌నగర్ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్‌రెడ్డి మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేశారు. ఆయన గెలుపు కోసం అను సరించాల్సిన కార్యాచరణౖపై నేతలకు దిశాని ర్దేశం చేశారు. తక్షణమే మండలాలవారీగా ఎన్నికల సన్నాహక సమావేశాల ఏర్పాటుకు షెడ్యూల్ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు ఉంటాయని, త్వరలో మహబూ బ్‌నగర్ పట్టణంలో భారీ బహిరంగ సభ ఉంటుందని కేసీఆర్ ప్రకటించారు. మరోవైపు బీఎస్పీతో పొత్తు నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు నుంచి పోటీ చేస్తారనే అంశాన్ని కేసీఆర్ సూత్రప్రాయంగా వెల్లడించారు. కాగా, ఉచిత ఎల్ఆర్ఎస్ బుధ, గురువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వడం, శుక్ర వారం శివరాత్రి పర్వదినం కావడంతో ఉమ్మడి జిల్లాలవారీగా నిర్వహిస్తున్న భేటీలకు బీఆర్ ఎస్ 3 రోజుల బ్రేక్ ఇచ్చింది. ఈ నెల 9 నుంచి ఉమ్మడి జిల్లాలవారీగా కేసీఆర్‌తో భేటీలు తిరిగి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. -
కలసి నడుస్తాం.. లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీతో బీఆర్ఎస్ జట్టు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కలసి నడవాలని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నిర్ణయించాయి. పొత్తు విధివిధానాలు, సీట్ల సర్దుబాటు అంశాలపై బుధవారం లోతుగా చర్చించాలని ఇరు పార్టీల అధ్యక్షులు నిర్ణయానికి వచ్చారు. చర్చల సారాంశాన్ని బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతికి వివరించి ఆమోదం పొందిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధ్యక్షుడు, కె.చంద్రశేఖర్‌రావు, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మంగళవారం సంయుక్త ప్రకటన చేశారు. కేసీఆర్‌తో ప్రవీణ్ భేటీ.. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి పోటీలో ఉంటానని ప్రకటించిన ప్రవీణ్‌కుమార్ మంగళవారం ఉదయం అనూహ్యంగా నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఆయన వెంట బీఎస్పీ ప్రధాన కార్యదర్శి విజయ్ ఆర్య, ఉపాధ్యక్షుడు దయానంద్‌రావు ఉన్నారు. వారికి రాజ్యసభ ఎంపీ జె.సంతోష్ కుమార్ స్వాగతం పలికారు. కేసీఆర్‌తో భేటీలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 3 గంటలపాటు జరిగిన ఈ భేటీలో జాతీయ, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. కేసీఆర్‌తో కలసి ప్రవీణ్ కుమార్, ఇతర నేతలు మధ్యాహ్న భోజనం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కలసి పోటీ చేయాలనే సూత్రప్రాయ అంగీకారం కుదిరిన నేపథ్యంలో కేసీఆర్, ప్రవీణ్ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. సిద్ధాంతపరంగా సారూప్యత ఉంది: కేసీఆర్ ‘వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. సిద్ధాంతపరంగా ఇరు పార్టీల నడుమ సారూప్యత ఉంది. మేము అమలు చేసిన దళితబంధు, దళిత సంక్షేమం, రెసిడెన్షియల్ పాఠశాలలు, బలహీనవర్గాల అభ్యున్నతి తదితరాల ఆధారంగా ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరం కలసి చర్చించాం. బీఎస్పీ హైకమాండ్ అనుమతితో చర్చించి కలసి పనిచేయాలని స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చాం. మిగతా విషయాలు ఒకట్రెండు రోజుల్లో వెల్లడిస్తాం. ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై బుధవారం చర్చిస్తాం. పొత్తుపై అవగాహన ఏర్పడిన నేపథ్యంలో గౌరవప్రదంగా సీట్ల పంపిణీ ఉంటుంది. నేను ఇప్పటివరకు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతితో మాట్లాడలేదు. కానీ ఆమెతో ఉన్న పాత పరిచయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కూడా మాట్లాడతా’అని కేసీఆర్ తెలిపారు. రాజ్యాంగం రద్దుకు బీజేపీ కుట్ర: ఆర్.ఎస్. ప్రవీణ్ ‘కేసీఆర్‌ను కలవడం ఆనందంగా ఉంది. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా లౌకికత్వం ప్రమాదంలో ఉంది. లౌకికత్వాన్ని దెబ్బతీసేందుకు రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ పెద్ద ఎత్తున కుట్రలు చేస్తోంది. లౌకిక భావాలతో నిరంతరం లౌకికవాదాన్ని కాపాడిన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను మాయావతి ఆశీస్సులతో కలిశా. తెలంగాణలో రాజ్యాంగం, లౌకికత్వానికి ప్రమాదం పొంచి ఉంది. లౌకికత్వాన్ని దెబ్బతీసే విషయంలో కాంగ్రెస్ కూడా బీజేపీలాగానే మారుతోంది. ఇరు పార్టీల ముప్పు నుంచి తెలంగాణను కాపాడేందుకు కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. సీట్ల సర్దుబాటు విషయంలో మా అధిష్టానానికి నివేదిస్తాం. ఇరు పార్టీల స్నేహం తెలంగాణలో ప్రజల జీవితాలను మారుస్తుంది. మా స్నేహాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారు. ఇక్కడి ప్రజల విలువలు, గంగా–జమునా తహజీబ్ సంస్కృతిని కాపాడతాం. బహుజన వర్గాల జీవితాలు కూడా బాగుపడతాయి. రేవంత్ ప్రభుత్వంపట్ల నిరుద్యోగులు సంతోషంగా లేరు. పట్టుమని 4 నెలలు కాకముందే రోడ్డెక్కే పరిస్థితి ఉంది’అని ఆర్.ఎస్. ప్రవీణ్ పేర్కొన్నారు. -
కొత్త ఏటీఎం తెలంగాణ: ప్రధాని మోదీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కొత్త ఏటీఎంగా తయారైందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకోవడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ పరస్పరం ‘కవర్ ఫైర్’ చేసుకుంటున్నాయని విమర్శించారు. ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే నాణేనికి రెండు ముఖాలు. ఈ పార్టీల మధ్య బలమైన అవినీతి బంధం ఉంది. దీని గురించి ప్రపంచం అంతా తెలుసు. మీరు తిన్నారు.. మేం కూడా తింటాం అన్నట్టుగా రెండు పార్టీల తీరు ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండిటిదీ ఒకే బాట.. అదే అబద్ధాలు.. దోపిడీ (ఝూట్.. లూట్)..’ అంటూ మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంలో అవినీతికి పాల్పడి రైతుల నుంచి బీఆర్ఎస్ సర్కార్ వేల కోట్లు దోచుకుంటే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై విచారణ జరిపించకుండా మౌనం వహించడమే కాకుండా దానికి సంబంధించిన ఫైళ్లు మూసేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ కుంభకోణాల్లో కాంగ్రెస్ భాగస్వామి అయ్యిందని అన్నారు. ఈ రెండు పార్టీల ‘కవర్ ఫైర్’ ఎక్కువ రోజులు సాగబోదని, ఉగ్రవాదంపై సర్జికల్ స్ట్రైక్స్ చేసిన మోదీ ప్రభుత్వం.. ‘ఎయిర్ స్ట్రైక్’ కూడా చేస్తుందని హెచ్చరించారు. అయితే అందుకు ప్రజల పూర్తి ఆశీర్వాదం కావాలని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు గెలిచేలా, దేశవ్యాప్తంగా ఎన్డీయే పక్షం 400 స్థానాలకు మించి గెలిచేలా ఓట్లు వేసి నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. (నాలుగు వందల సీట్లు దాటాలి. బీజేపీకి ఓటు వేయాలి అంటూ తెలుగులో పిలుపునిచ్చారు) మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో పలు అభివృద్ధి పనులను మోదీ ప్రారంభించారు. అనంతరం విడిగా ఏర్పాటు చేసిన బీజేపీ ‘విజయ సంకల్ప యాత్ర’ బహిరంగ సభలో పాల్గొన్నారు. తెలుగులో ‘నా తెలంగాణ కుటుంబ సభ్యులకు నమస్కారాలు’ అంటూ ప్రసంగం ప్రారంభించారు. నేను చెప్పానంటే తప్పకుండా చేసి చూపిస్తా ‘తెలంగాణ ప్రజల ప్రేమను నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీ ప్రేమ, ఆదరాభిమానాలు, ఆశీర్వాదాలను తెలంగాణ అభివృద్ధి రూపంలో రెండింతలు చేసి తిరిగి ఇచ్చేస్తా. ఇది మోదీ గ్యారంటీ. నేను ఏదైనా చెప్పానంటే దానిని తప్పకుండా చేసి చూపిస్తాం. మనందరం కలిసి భారత్‌ను ప్రపంచంలోనే కొత్త శిఖరాలకు తీసుకెళదాం. తెలంగాణ ప్రజల్లో ఎంతో ఉత్సాహం కనిపిస్తోంది. రాష్ట్రంలో బీజేపీని బాగా ఆదరిస్తున్నారు. మీ ఆశీర్వాదాలు వృథా కానివ్వను. మోదీ గ్యారెంటీ అంటే.. ఇచ్చిన హామీని నెరవేర్చే గ్యారెంటీ. జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేశాం. అయోధ్యలోని భవ్య మందిరంలో శ్రీరాముడికి స్వాగతం పలికాం. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థికశక్తిగా మన దేశం మారింది. ఆర్థిక ప్రగతిలో మన దేశం కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని చెప్పి, దానిని నిజం చేసి చూపాం..’ అని మోదీ అన్నారు. మూడేళ్లలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ‘ఇప్పుడు మరో గ్యారంటీ ఇస్తున్నా..రాసుకోండి. వచ్చే మూడేళ్లలో విశ్వంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగేలా చేస్తాం. మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తయ్యే హామీ. (ఈ వాక్యాన్ని తెలుగులో ఉచ్ఛరించారు. దీంతో పలువురు సభికులు ‘మోదీ మోదీ’ అని పెద్దపెట్టున హర్షధ్వానాలు చేస్తూ నినదించారు. తెలంగాణ ప్రజలు తామే మోదీ కుటుంబమని చెబుతున్నారంటూ ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యానించారు. మేమే మోదీ కుటుంబం అంటూ ప్రజలతో నినాదాలు చేయించారు). సబ్ కా సాథ్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ ద్వారా మేము అన్ని రాష్ట్రాలను ఒకే విధంగా చూస్తూ అభివృద్ధికి బాటలు వేస్తున్నాం..’ అని ప్రధాని తెలిపారు. తెలంగాణకు ఎక్కువ నిధులు ‘తెలంగాణ అభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నాం. వేలాది కోట్లు మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులపై పెడుతున్నాం. వీటి వల్ల తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగి వారి స్వప్నాలు సాకారమవుతాయి. రాష్ట్ర ప్రజల స్వప్నాలను, మోదీ కుటుంబసభ్యుల కలలను సాకారం చేయాలనే సంకల్పంతో ముందుకెళుతున్నాం. మహిళలు, దళితులు, రైతులు.. ఇలా అన్ని వర్గాల వారికి వివిథ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. తెలంగాణ అభివృద్ధి విషయంలో ఏ చిన్న అవకాశాన్నీ విడిచిపెట్టబోమని గ్యారంటీ ఇస్తున్నాం. మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి ఇచ్చిన గ్యారెంటీని పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నాం. తెలంగాణలోని రైతుల నుంచి గత పదేళ్లలో ధాన్యం, పత్తి పెద్దమొత్తంలో కొనుగోలు చేశాం. రాష్ట్రంలోని 40 లక్షలకు పైగా రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రయోజనం చేకూరింది..’ అని మోదీ చెప్పారు. నాకు కుటుంబం లేదంటున్నారు.. ‘దేశ ప్రజలు, వారి కుటుంబాలకు ఇచ్చిన హామీలు, గ్యారెంటీల అమలుకు నేను చర్యలు తీసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ, వారి మిత్ర పక్షాలు నన్ను, నా కుటుంబాన్ని తిడుతున్నాయి. శాపనార్థాలు పెడుతున్నాయి. మోదీని, ఆయన కుటుంబాన్ని ఎందుకు తిడుతున్నారు? వాళ్ల కళ్లు ఎందుకు ఎర్రబడుతున్నాయి? నేను వారి రూ.వేలు, లక్షల కోట్ల కుంభకోణాలు, అవినీతి గుట్టును విప్పుతున్నందుకు అంత ఆగ్రహంతో ఉన్నారు. దేశంలో కశీ్మర్ నుంచి తమిళనాడు దాకా కుటుంబ పార్టీల పాలన కొనసాగుతోంది. ఎక్కడెక్కడైతే కుటుంబ పార్టీలు అధికారంలో ఉన్నాయో అక్కడ వారి పరివారాలు ఆర్జనలో బలోపేతమై, రాష్ట్రాలు మాత్రం బలహీనమై పోయాయి. కుటుంబ పార్టీలకు దోచుకోవడానికి ఏమైనా లైసెన్స్ ఉందా? ఒక ముఖ్యమంత్రి కుటుంబం, దగ్గరి బంధువుల్లో 50 మంది ఉన్నతస్థానాల్లో ఆసీనులయ్యారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా నేను గళమెత్తితే...నా ప్రశ్నలకు బదులివ్వకుండా మోదీకి కుటుంబమే లేదంటూ విరుచుకుపడుతున్నారు. వీరి కుటుంబ, పరివారవాద రాజకీయాలకు వ్యతిరేకంగా గట్టిగా గొంతు విప్పి చర్యలు తీసుకోవడం సరైనదేనా? (సభికులు అవును అంటూ కేకలు వేశారు)’ అని మోదీ అడిగారు. 140 కోట్ల ప్రజలే నా కుటుంబసభ్యులు ‘కుటుంబ పార్టీల కారణంగా ప్రతిభ ఉన్నవారికి అన్యాయం జరుగుతోంది. యువతకు ఉపాధి అవకాశాలు దొరకడం లేదు. కాంగ్రెస్ పార్టీ పరివార వాద పార్టీగా మారాక 50 ఏళ్లకు తక్కువ వయస్సు ఉన్న వారిని ముందుకెళ్లకుండా అడ్డుకుంది. ఏదైనా పదవిలో కూర్చోబెట్టాలంటే 80, 85 ఏళ్లు దాటిన వారిని తీసుకొస్తున్నారు. యాభై ఏళ్లలోపు వారు వస్తే తమను ఓవర్టేక్ చేస్తారనే భయం వారిని పట్టుకుంది. వారికి వారి కుటుంబమే సర్వస్వం. దీనికి భిన్నంగా దేశంలోని ప్రతి కుటుంబం నాదే. 140 కోట్ల ప్రజలే నా కుటుంబసభ్యులు. దేశంలోని ప్రతి చెల్లి, ప్రతి తల్లి, యువత నా కుటుంబమే. కాంగ్రెస్, ఇండి కూటమికి ఇది అర్థం కావడంలేదు. వారికి వారి కుటుంబప్రయోజనాలే ముఖ్యమైతే నాకు దేశ హితమే సర్వస్వం. వారు తమ కుటుంబ ప్రయోజనాల కోసం దేశహితాన్ని బలిపీఠం ఎక్కించారు. మోదీ మాత్రం దేశ హితం కోసం తనను తాను సమర్పించుకుంటున్నాడు..’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. నా సంపాదన ప్రజలకే ఖర్చు చేస్తున్నా.. ‘దేశ రాజకీయాల్లోకి నీతివంతమైన యువతను తీసుకురావాల్సిన అవసరం ఉంది. నాకు అవకాశం దొరికినపుడు, గతంలో సీఎంగా ఉన్నపుడు, ఇప్పుడు నా సంపాదన నుంచి ప్రజల కోసం ఖర్చు చేశా. దానాలు చేశా. పేద పిల్లల చదువులకు కేటాయించా. కుటుంబ రాజకీయాలు చేసేవారు అధికారంలో ఉన్నపుడు వచ్చిన బహుమానాలను సొంతంగా వాడుకున్నారు. తాము సంపాదించిన నల్లధనాన్ని చట్టబద్ధం చేసుకునే ప్రయత్నం చేశారు. నేను మాత్రం గుజరాత్ సీఎంగా, దేశ పీఎంగా వచ్చిన ఇలాంటి గిఫ్ట్‌లను ఒక భాండాగారంలో భద్రపరిచి, తర్వాత వేలం వేసి వచ్చిన మొత్తాన్ని గంగమ్మ తల్లి సేవలో ఖర్చు చేస్తున్నా. మీ సేవకుడిగా దాదాపు రూ.150 కోట్లు ప్రజల సేవలో ఖర్చు చేశా. నేను కూడా పరివార వాదిని అయితే ఈ సొమ్మంతటినీ సొంతానికి తీసుకునేవాడిని. మీరు నా కుటుంబసభ్యులు. మీ గౌరవాన్ని తగ్గించి తలదించుకునే పని ఎప్పటికీ చేయను. కొందరు నల్లధనం దాచుకోవడానికి విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. ఓ వర్గం తమ కుటుంబాలకు విలాసవంతమైన భవనాలు కట్టించారు. మోదీ ఇంతవరకు సొంతానికి ఒక్క ఇల్లు కూడా కట్టించుకోలేదు. కానీ దేశంలో పేదలకు మాత్రం 4 కోట్ల ఇళ్లు కట్టించాం. అందుకే కోట్లాది మంది ప్రజలు తాము మోదీ కుటుంబ సభ్యులమని అంటున్నారు..’ అని మోదీ తెలిపారు.