ఉద్యమం మరింత ఉధృతం | ys jagan mohan reddy live chat with NRIs on AP special status issue | Sakshi
Sakshi News home page

ఉద్యమం మరింత ఉధృతం

Sep 26 2016 3:31 AM | Updated on Mar 23 2019 9:10 PM

అబద్ధాలు చెప్పే రాజకీయ నాయకులను నిలదీసే పరిస్థితి రావాలనీ, అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందన్నారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ దారుణ పరిస్థితిలో...

ప్రవాసాంధ్రులతో ముఖాముఖిలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ వెల్లడి
రాబోయే రోజుల్లో ప్రత్యేకహోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ప్రవాసాంధ్రులతో సాక్షి టీవీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ.. అవసరమైతే తమ పార్టీ పార్లమెంట్ సభ్యులతో రాజీనామా చేయించే కార్యక్రమం చేస్తామని చెప్పారు. అసాధ్యమనుకున్న తెలంగాణ వచ్చినపుడు.. పార్లమెంట్‌లో ప్రధాని హామీ ఇచ్చిన ప్రత్యేకహోదాను సాధించుకోవడం గొప్ప విషయమేమీ కాదన్నారు.


అబద్ధాలు చెప్పే రాజకీయ నాయకులను నిలదీసే పరిస్థితి రావాలనీ, అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందన్నారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ దారుణ పరిస్థితిలో ఉందన్నారు. ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు పూర్తి స్థాయిలో రాజీపడిపోయారన్నారు. ప్రత్యేక హోదాపై ప్రవాసాంధ్రులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన వివరణాత్మకంగా సమాధానాలిచ్చారు.

 
రమేష్‌రెడ్డి(అమెరికా): విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్‌లో ప్రధాని హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేయాల్సిన కేంద్రం.. సాధించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మాట మార్చాయి. ప్రతిపక్ష నేతగా హోదా కోసం మీరు పోరాడుతున్నారు. ఈ పోరాటంలో మీ ప్రణాళిక ఏమిటి? అమెరికాలో ప్రవాసాంధ్రుల నుంచి మీకు ఎలాంటి మద్దతు కావాలి?

 
జగన్:
రమేష్ అన్నా.. ప్రత్యేక హోదా ఈ రోజు వస్తుందని.. రేపు వస్తుందని.. సంవత్సరంలో వస్తుందని నేను చెప్పను. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నారు. అలాంటిది పార్లమెంట్‌లో ప్రధాని ఇచ్చిన మాట ప్రత్యేక హోదాను సాధించుకోవడం గొప్ప విషయమేమి కాదు. ఏదో ఒక రోజు మంచి జరుగుతుంది. 2019 ఎన్నికల్లో మాపై ఆధారపడే ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటవుతుంది. అప్పుడు రాష్ట్రానికి హోదా ఎవరిస్తే వారికి మద్దతు ఇస్తాం.
 
వెంకట్,(శాన్‌ఫ్రాన్సిస్‌కో): ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. విభజన చట్టంలో పెట్టారు. కేంద్రం, రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చాక ఏపీకి హోదా ఇవ్వమంటున్నారు. అమెరికాలో ఇలా చేస్తే ప్రభుత్వాన్ని రీకాల్ చేసే అవకాశం ఉంది. మరి భారత్‌లో ఇలాంటిదేమైనా చేయగలమా? అందుకు మీ కార్యాచరణ ఏంటి?

 
జగన్: మీరు చెప్పింది చాలా విలువైన పాయింట్. మన ఖర్మేంటంటే ఎన్నికలప్పుడేమో నాయకులు మాటలు చెబుతారు. అబద్ధాలు చెబుతారు. తర్వాత ప్రజలను మోసం చేస్తారు.  రాబోయే రోజుల్లో గట్టిగా మనందరం కలిసి ఏకం కావాలి. అబద్దాలు చెప్పిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో.. ఎన్నికల తర్వాత మోసం ఎవరు చేస్తున్నారో.. వాళ్లని నిలదీసే పరిస్థితి రావాలి. అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుంది.
 
దిలీప్, (మిలికిటీ స్టేట్): విభజనప్పుడు హోదా అన్నారు తప్ప.. ప్యాకేజీ అని ఏపార్టీ మాట్లాడలేదు. హోదా విషయాన్ని మీరు గట్టిగా జనంలోకి తీసుకెళ్తున్నారు. బాగా పోరాడుతున్నారు. బీజేపీ, టీడీపీలో ఉన్న సోకాల్డ్ పెద్ద మనుషులు ఆ రోజు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. మోదీ లాంటి వ్యక్తి కూడా ఇచ్చిన మాటకు వెనకడుగు వేస్తున్నారు.
 
జగన్:
ఇది నిజంగా దురదృష్టకరం. రాజకీయాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫిలాసఫీ ఏమిటంటే.. ఎన్నాళ్లు బతికామన్నది కాదు.. బతికినంత కాలం ఎలా బతికాం అన్నది ముఖ్యం. ప్రతీ వ్యక్తీ చనిపోతారు. ఇవాళున్నాం. మరో 20, 30 ఏళ్లకు బహుశా నేనుకూడా పోతానేమో. నేను పోయిన తర్వాత.. ఇంకొకళ్లు పోయిన తర్వాత.. ఫలానా వాడు ఏం చేశాడు?.. ఫలానా వాడి క్యారెక్టర్ ఏమిటి? అన్నది మనం పోయిన తర్వాత కూడా భావితరాలు చెప్పుకుంటాయి. ఈ రోజు ఉన్న రాజకీయ వ్యవస్థ ఇంత దారుణమైన పరిస్థితిలోకి పడిపోవడం బహుశా నేను ఎప్పుడూ చూడలేదు. ఎన్నికల సమయంలో అబద్దాలు చెప్పడం, మోసం చేయడం, ఆ తర్వాత ఏమీ జరగనట్టుగా గాలికొదిలేయడం. ఇలాంటి పరిస్థితి చూసినప్పుడే ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించాలనిపిస్తుంది. దీన్ని నిలదీసే కార్యక్రమంలో ముందుండాలి. విప్లవాత్మకంగా ముందుకు తీసుకెళ్లాలి. ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావాలని నమ్మేవాళ్లల్లో మొట్టమొదటి వ్యక్తిని నేను.
 
భాస్కర్‌రెడ్డి(మలేషియా): దుగరాజపట్నం పోర్టు నిర్మిస్తామని విభజన చట్టంలో పేర్కొన్నారు. కానీ అరుణ్ జైట్లీ ప్రకటనను చూస్తే స్పష్టమైన హామీ ఇవ్వలేదు. దుగరాజపట్నం పోర్టు కోసం ఎలాంటి పోరాటాలు చేస్తారు?

 
జగన్: దుగరాజపట్నం వద్ద కొత్త పోర్టును కేంద్రమే నిర్మించాలని.. 2018లోగా పోర్టు తొలి దశను పూర్తి చేయాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. కానీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనలో ఫీజుబులిటీని బట్టి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో దుగరాజపట్నం పోర్టును నిర్మించే అవకాశాన్ని పరిశీలిస్తామనే మాత్రం చెప్తే... ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు అంటూ సీఎం చంద్రబాబు చంకలు గుద్దుకుంటాడు. విభజన చట్టం ద్వారా హక్కుగా సంక్రమించిన వాటి కన్నా ఎక్కువగా చేస్తే దాన్ని ప్యాకేజీ అంటారు. కానీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలకే కోతలు వేసి అరకొరగా అమలు చేస్తున్న ప్రకటిస్తే అది ఎలా ప్రత్యేక ప్యాకేజీ అవుతుంది. అరుణ్ జైట్లీ సెప్టెంబరు 7న ప్రకటన చేసే సమయంలోనే ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చిచెప్పారు. 14వ ఆర్థిక సంఘం నిబంధనలు ప్రత్యేక హోదా ఇవ్వడానికి అడ్డంకిగా మారాయని అబద్ధాలు చెబుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకూడదని 14వ ఆర్థిక సంఘం చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు. జైట్లీ ప్రకటనలో రాష్ట్రాన్ని నిలువునా మోసం చేసినా.. సీఎం చంద్రబాబు స్వాగతించారు కాబట్టే ఆయనకు ఇంగ్లిషు రాదని అన్నా. విభజన చట్టంలో ఉన్న హామీల అమలుతోపాటూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాజీ లేని పోరాటాలు చేస్తాం.
 
స్వాతి(కువైట్): ఎన్నికల సమయంలో ఏవేవో వాగ్దానాలు చేసి ఓట్లు, సీట్లు దక్కించుకుని ఇప్పుడు మోసం చేస్తారా? తమకు సీటు దక్కింది గదాని వాళ్లు హాయిగా కూర్చుంటే మాకు న్యాయం చేసే వాళ్లు ఎవరన్నా? ప్రత్యేక హోదా కల్పించాలి అని తీవ్రమైన క్షోభతో, బాధతో అడుగుతున్నాం. ప్రవాసాంధ్రులు పరిశ్రమలు పెట్టాలంటే ప్రత్యేక హోదా లేకుండా ఎలా?

 
జగన్: ప్రత్యేక హోదాతో ముడిపడిన ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. పరిశ్రమలు పెట్టబోయే ముందు ఎవరైనా.. అక్కడ పెడితే తమకు ఏమి మేలు అని పారిశ్రామిక వేత్తలు ఆలోచిస్తారు. చంద్రబాబు మొహం చూసో, జగన్‌మోహన్‌రెడ్డి మొహం చూసే పారిశ్రామిక వేత్తలు రారు. హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి 65 ఏళ్లు పట్టింది. ప్రత్యేక హోదా వస్తే చాలా ప్రయోజనాలున్నాయి. అదో విధానం.. ఈశాన్య రాష్ట్రాలకు ఇప్పటికీ ఈ ఆర్ధిక ప్రయోజనాలు పొందుతున్నాయి. 1997 నుంచి 2007 దాకా అప్పటి నుంచి మరో పదేళ్లు అంటే 2017 దాకా అవి అమల్లో ఉంటాయి. హోదా ఉంటే వంద శాతం ఆదాయపన్ను కట్టాల్సిన పని లేదు. ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు ఉంటుంది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చినా ఇవి ఉంటాయి. ఇప్పుడు అరుణ్‌జెట్లీ మన రాష్ట్రానికి ప్రకటించిన ప్రోత్సాహకాలు ఏవీ శనక్కాయలు, బెల్లానిక్కూడా సరిపోవు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఇవి మనకు మాత్రమే ఇచ్చారని అబద్దాలు చెబుతున్నారు. తెలంగాణతో కలిపి ఇచ్చినవి అవి. ఇటువంటి ప్రయోజనాలు రాజస్తాన్‌లో కూడా ఉన్నాయి.
 
సురేందర్(లండన్): రోగి కోరుకున్నది ప్రత్యేక ప్యాకేజీయే, డాక్టర్ ఇచ్చిందీ ప్యాకేజీయే అన్నట్లుంది ప్రస్తుత పరిస్థితి. కానీ రాష్ట్రం బాగుపడాలన్నా, ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నా, పారిశ్రామికవేత్తలకు మేలు జరగాలన్నా కావలసింది ప్రత్యేక హోదా మాత్రమే. చంద్రబాబు, వారి మీడియా ప్రత్యేక ప్యాకేజీతోనే మేలు అంటూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయి. చంద్రబాబును, ఆ మీడియాను చూస్తుంటే వారు ‘మెగలోమేనియా’ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని తానే కనిపెట్టానని, తానే చేశానని చంద్రబాబు చె బుతూ భ్రమల్లో బతకడమే కాదు ప్రజలను భ్రమల్లో ఉంచాలని చూస్తున్నారు. బాబు ఇలా చెప్పడం, తరువాతి రోజు ఆ మీడియా దాన్నే ప్రజల్లో ప్రచారం చేయడం చూస్తుంటే ప్రజల్ని ఎంతగా మోసం చేస్తున్నారో అర్థమవుతోంది. దీనిపై ప్రజల్లో చైతన్యం పెరగాలి.
 
జగన్: ఇలాంటి వారు మనరాష్ట్రానికి ఉండడం మన ఖర్మ. చంద్రబాబుకు అల్జీమర్సో లేదా మెగలోమేనియా వ్యాధి ఉన్నట్టుగా అనుమానం వస్తోంది. ప్రపంచంలో ఫోన్లు తానే కనిపెట్టానని ప్రజల చెవుల్లో కాలీఫ్లవర్లు పెడుతున్నారు. పీహెచ్‌డీ చేశానని, షికాగో యూనివర్సిటీ తనకు గౌరవ డాక్టరేట్ కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చిందని చెబుతారు. సత్యా నాదెళ్లను మైక్రోసాఫ్ట్ సీఈఓగా తానే చేశానని అంటాడు. చివరకు రోజుకు 24 గంటలుంటే విద్యుత్తును రోజుకు 27 గంటలు ఇచ్చానంటాడు. నమ్మేవాళ్లుంటే చంద్రబాబు ఎన్ని అబద్ధాలైనా చెబుతాడు. మీరంటున్న మాటలైనా విని చంద్రబాబు అర్థం చేసుకుంటాడో లేదు చూడాలి.    - సాక్షి, హైదరాబాద్
 
స్టేలు తెచ్చుకోవడంలో గిన్నిస్ రికార్డ్..
రమేష్(వాషింగ్టన్): మన రాష్ట్రం అవినీతిలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్టు నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్ సర్వేలో తేలింది. రాజధాని, పోలవరం, పట్టిసీమ నిర్మాణంలో, రాజధానికి భూ సేకరణ విషయంలో పారదర్శకత లోపించిందని, అంచనాలు పెంచి నిధులు కాజేస్తున్నారని తేలింది. స్విస్ చాలెంజ్ అంటూ అంకెల్ని చూపకపోవడం కూడా జరుగుతోంది. మరోపక్క చంద్రబాబు మాత్రం స్టేలు తెచ్చుకోవడం నెంబర్ వన్‌గా నిలిచి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కారు. (అక్కడ గుమికూడిన వారి నుంచి పెద్దపెట్టున హర్షధ్వానాలు) దీనిపై మీ కామెంట్ ఏమిటి? ప్రజా పోరాటాలను ఎలా ముందుకు తీసుకువెళతారు, శాసనసభలో వ్యూహమేమిటి? న్యాయ పోరాటం ఎలా చేయబోతున్నారు? (ఈ సందర్భంలో మోడరేటర్ కొమ్మినేని జోక్యం చేసుకుంటూ ‘పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామని జగన్ గారు చెప్పారు. అది మీకు నచ్చిందా? మీరందరూ అంగీకరిస్తారా? అని అడిగినప్పుడు అక్కడున్న వాళ్లందరూ చప్పట్లు చరిచి హర్షధ్వానాలు తెలియజేశారు.)


 
జగన్: పోరాటం చేయాల్సిందే. ఇది చాలా ముఖ్యం కూడా. 2019 దాకా ఈ సమస్య సజీవంగా ఉండేలా చూస్తాం. అందుకోసం పోరాటం చేస్తూనే పోతాం. వాస్తవానికి అరుణ్‌జెట్లీ ప్రకటన చేసిన రోజే మా పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిద్దామనిపించింది. అలా చేస్తే సభలోకి వెళ్లి మాట్లాడే వారే లేకుండా పోయే పరిస్థితి. వాస్తవానికి కొట్లాడుతున్నది ఎవరన్నా ఉంటే వైఎస్సార్‌సీపీ ఎంపీలే. అలాంటి వాళ్లు రాజీనామా చేస్తే కొట్లాడే పరిస్థితి కూడా ఉండదు. ఏదిఏమైనా దశలవారీగా పోరాడుతూనే ఉంటాం. సరైన సమయంలో రాజీనామా బ్రహ్మాస్రాన్ని ఉపయోగిస్తాం. ఉద్యమాన్ని మరింత ముందుకు ఎలా తీసుకువెళ్లాలనే దానిపై మేధావులతో చర్చించాలి. మొన్న ఢిల్లీలో కమ్యూనిస్టులతో కూడా చర్చించా. సూచనలు, సలహాలు ఇమ్మన్నాం. అందరం కలిసికట్టుగా పోదాం అని చెప్పా.
 
రాజేందర్‌రెడ్డి,(మలేషియా): ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అని ఎల్లో మీడియా హైలెట్ చేస్తోంది. దీన్ని మీరు ఎలా తిప్పికొడతారు?
 
వాసుదేవరెడ్డి,(అమెరికా): హోదా కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. ఇంకా చేస్తున్నారు. టీడీపీ, బీజేపీ కుమ్మక్కయి ప్యాకేజీ ప్రకటించాయి. దీన్ని అడ్డుకోవడానికి, ప్రత్యేక హోదా సాధించడానికి మీ ప్రణాళిక ఎలా ఉండబోతోంది? తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన విధంగా మీరు కూడా అలుపెరగని పోరాటం చేసే ఉద్ధేశం ఉందా?

 
జగన్: తప్పకుండా. అసలు అరుణ్ జైట్లీ స్టేట్‌మెంట్ చూసిన ఎవరైనా ఆయనకు థ్యాంక్యూ చెప్పే పరిస్థితి ఉండనే ఉండదు. కానీ చంద్రబాబు పూర్తిగా ఏస్థాయికి రాజీపడ్డాడు అంటే.. మన హక్కు ప్రకారం మనకు రావాల్సిందే ఇవ్వకపోయినా సరే అనేంత. రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు ఏదైతే ఇస్తామని చెప్పారో అవే అరకొరగా ఇచ్చే పరిస్థితుల్లో వాళ్లు మాట్లాడుతూ ఉన్నప్పుడు, అదనంగా వాళ్లు ఎలాంటిదీ ఏమీ ఇవ్వనప్పుడు, పాలసీల మార్పుల ప్రకారం మిగిలిన రాష్ట్రాలకు ఏదైతే ఇస్తున్నారో అవి మాత్రమే మనకూ వస్తున్నప్పుడు.. ఏ రకంగా దీన్ని ప్యాకేజీ అని చెప్పగలుగుతారు? ప్యాకేజీ అంటే రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి హక్కు ప్రకారం ఏదైతే రావాలో అవి ఇస్తూ.. అంతకన్నా ఎక్కువేదైనా ఇస్తే దాన్ని ప్యాకేజీ అనొచ్చు. అంతేకానీ ఆ హక్కును కొద్దోగొప్పో తగ్గించి ఇచ్చే పరిస్థితి కల్పిస్తున్నప్పుడు, మరో పక్క అదే పార్లమెంట్ సాక్షిగా హోదా ఇస్తామన్న హామీని పూర్తిగా పక్కనపెడుతున్నాము అని వాళ్లు మాట్లాడుతున్నప్పుడు దీన్ని ఏ రకంగా ప్యాకేజీ అనగలుగుతారు? ఆశ్చర్యం ఏమిటంటే ఇలాంటిది ఫలానా చేస్తామని కూడా ఆయన చెప్పలేదు. చంద్రబాబు మాత్రం థ్యాంక్యూ చెప్పడం. అదేదో మనకు చాలా ఇచ్చినట్టు చెప్పడం ఆశ్చర్యమేస్తోంది.

 
కేంద్రాన్ని నిలదీయాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా రాజీపడ్డాడు. కేంద్రంలో తన మంత్రులను ఉపసంహరించుకుంటూ అల్టిమేటం ఇవ్వాల్సిన పరిస్థితి. కేంద్రంలో ఉన్నవాళ్లకు పార్లమెంట్‌నే సాక్షిగా చేస్తూ మీరు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీయాల్సిన ఈ వ్యక్తి రాజీపడ్డ పరిస్థితుల్లో మన పోరాటం కొనసాగుతోంది.
 
మనం బంద్‌లు చేస్తే బంద్ రోజు బలవంతంగా బస్సులు తిప్పుతాడు చంద్రబాబు. మోదీ రాకముందు మనం 8 రోజులు నిరాహార దీక్ష చేస్తే.. మోదీ మరో రెండు మూడు రోజుల్లో వస్తున్నాడనగా ఈయనే దీక్షను బలవంతంగా భగ్నం చేస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనం పోరాటం చేస్తున్నాం. రాష్ట్రానికి అనుకూలంగా లేని కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నాం. వాళ్లు ఇవ్వకపోయినా ఫర్వాలేదని, వాళ్లను వెనకేసుకొస్తున్న చంద్రబాబుతోనూ పోరాటం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ పోరాటం కొనసాగుతుంది.
 
యువభేరీలు చేస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతం చేస్తాం. సరైన సమయంలో పార్లమెంట్ సభ్యుల చేత కూడా రాజీనామా చేయించే కార్యక్రమం కూడా చేస్తాం.(వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తారా? అన్న ప్రశ్నకు). పార్లమెంట్‌లో వెల్‌లోకి కూడా పోయే పరిస్థితి ఉండదు కాబట్టి ఇవాళ రాజీనామా చేయడం లేదు. కానీ ఇప్పటికే రెండున్నరేళ్లు అయిపోయింది. ఇప్పట్లో పార్లమెంట్ సమావేశాలు కూడా ఏమీ లేవు. కొన్ని రోజులు చూస్తాము. చంద్రబాబులో, కేంద్రంలో మార్పులు రాకపోతే.. ఈ విషయాన్ని ఇంకా హైలెట్ చేసేందుకు మరో నాలుగు అడుగులు ముందుకు తీసుకుపోయేదానికి పోరాటం కచ్చితంగా చేస్తాం. నాతో నిలబడ్డ ప్రతీ పార్లమెంట్ సభ్యుడు కూడా రాజీనామా చేస్తారు. చేసి మళ్లీ ఎన్నికలకు పోతాం. ప్రజలిచ్చే తీర్పుతో కేంద్రానికి కూడా అర్థమయ్యేలా చేస్తాం. చంద్రబాబుకు కూడా అర్థమయ్యేలా చేస్తాం. పోరాటం వివిధ దశల్లో జరుగుతూ పోతుంది. ఇప్పటి వరకూ అనేక ధర్నాలు, బంద్‌లు, నిరాహార దీక్షలు చేశాం. యువభేరీ కార్యక్రమాన్ని ఇప్పటి దాకా చేశాం. వచ్చే రోజుల్లో ఇంకా ఉధృతం చేస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement