
గట్టుప్పల్ మండలం కోసం యువతి ఆత్మహత్య
నల్లగొండ జిల్లాలోని గట్టుప్పల్ గ్రామాన్ని మండలం చేయాలనే డిమాండ్ రోజు రోజుకు ఎక్కువవుతోంది.

అట్టుడుకుతున్న గట్టుప్పల
గట్టుప్పలను మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ బుధవారం ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన వివరాలు.. గట్టుప్పల గ్రామానికి చెందిన ఏర్పుల యూదయ్య ఉదయం స్థానికంగా నిర్వహిస్తున్న దీక్ష స్థలానికి చేరుకున్నాడు. తొలుత గట్టుప్పలను మండలంగా ప్రకటించి ముసాయిదాలో ఆ విషయాన్ని ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ.. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. సీఐ రమేష్‌కుమార్ స్థానికులతో కలిసి మంటలు ఆర్పించి ఆస్పత్రికి తరలించారు. 30 శాతానికి పైగా కాలిపోయిన యూదయ్యను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నేతల ఆధిపత్య పోరుతో ప్రజలకు నష్టం
జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కలిసి ఉద్యమాన్నినీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని గట్టుప్పల స్థానికులు ఆరోపిస్తున్నారు. గట్టుప్పలను మండల కేంద్రంగా చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఆ వెంటనే పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసింది. అయితే చివరి నిమిషంలో ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తూ ముసాయిదాలో గట్టుప్పల పేరును మండలాల జాబితాలో చేర్చకపోవడంతో ప్రజలు దసరా పండుగను కూడా నిర్వహించుకోలేదు.
ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల ఆధిపత్య పోరు నల్గొండ డివిజన్ లోని గట్టుప్పలకు శాపంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. అన్ని అర్హతలతో మండలం చేస్తున్నట్లు ప్రకటన రావడంతో, అన్ని ఆఫీసులు సిద్ధం చేశారు. కానీ, అర్ధరాత్రి ప్రకటించిన ముసాయిదాలో మండలాల జాబితాలో గట్టుప్పల పేరును మాయం చేశారని ఆరోపిస్తూ దసరా పండుగ రోజు నుంచి ఇక్కడి ప్రజలు నిరసన చేస్తూ సీఎం కేసీఆర్ దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

