రుణమాఫీ చేయాలని ఆందోళన

రుణమాఫీ చేయాలని ఆందోళన - Sakshi


అర్ధనగ్నంగా రైతుల నిరసన

టీనగర్‌: తమ డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని కోరుతూ చెన్నైలో రైతులు శుక్రవారం ఆందోళన జరిపారు. రాష్ట్రంలో కరువు నెలకొన్నందున రైతుల రుణాలను మాఫీ చేయాలని తదితర డిమాండ్లతో జాతీయ దక్షిణాది నదుల అనుసంధానం రైతుల సంఘం సమన్వయకర్త అయ్యాకన్ను ఇదివరకే ఢిల్లీలో ఆందోళన జరిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలో రెండో విడతగా నిరవధిక ఆందోళన శుక్రవారం ప్రారంభించారు.చేపాక్కం అతిథిగృహం సమీపంలో జరిపిన ఆందోళనలో రైతులు కట్‌ డ్రాయర్లు, కౌపీనాలు ధరించి అర్ధనగ్నంగా పాల్గొన్నారు. అయ్యాకన్ను మాట్లాడుతూ రైతుల రుణాలు మాఫీ చేయాలని కోరుతూ అనేక దఫాలుగా ధర్నాలు జరుపుతున్నామని, కోర్టు ఉత్తర్వులిచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం రైతుల రుణాలు మాఫీ చేయలేదని తెలిపారు. ప్రభుత్వం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాలని డిమాండ్‌ చేశా రు. 60 ఏళ్లు దాటిన రైతులకు పింఛన్‌ అందజేయాలని పదే పదే కోరుతున్నామని, దీనికి ఇంతవరకు సరైన సమాధానం లభించలేదని వాపోయారు.జాతీయ బ్యాంకుల్లో  తీసుకున్న రుణా ల కోసం నగలను వేలం వేసేందుకు బ్యాంకులు చర్యలు తీసుకుంటున్నాయని, ఈ వేలాన్ని ప్రభుత్వం అడ్డుకునేందుకు ముందుకు రావాలని కోరారు. చెరుకు రైతులకు అందజేయాల్సిన బకాయిలను ఇంకా చెల్లించలేదని, వెంటనే చెల్లించే ఏర్పాట్లు చేయాలని కోరారు. తమ డిమాండ్లు పరిష్కారం కానందున మళ్లీ ఆందోళనకు దిగామని, 32 జిల్లాల రైతులు ఆందోళనలో పాల్గొన్నట్లు తెలిపారు. జూలై నెల 10 తేదీ వరకు 32 రోజులపాటు నిరవధికంగా ఆందోళన జరిపేందుకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇందులో అనేక రాజకీయ పార్టీల నిర్వాహకులు పాల్గొని రైతులకు మద్దతుగా ప్రసంగించి వెళ్లారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top