
‘సర్జికల్ స్ట్రైక్స్‌తో...ప్రపంచ ఖ్యాతి
పీఓకేలో సర్జికల్ స్ట్రైక్స్ విజయవంతం కావడంతో ప్రపంచ దేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఖ్యాతి మరింత పెరిగిందని బీజేపీ
►దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు ఎదురుగాలి
►రాష్ట్రంలోనూ అదే పరిస్థితి
► బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బి.ఎస్.యడ్యూరప్ప
►బీజేపీలో చేరిన మాజీ ఐఏఎస్ అధికారి కె. శివరామ్
బెంగళూరు: పీఓకేలో సర్జికల్ స్ట్రైక్స్ విజయవంతం కావడంతో ప్రపంచ దేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఖ్యాతి మరింత పెరిగిందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బి.ఎస్.యడ్యూరప్ప పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడి నేషనల్ కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి కె.శివరామ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఆయన బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప మాట్లాడుతూ... ‘శివరామ్‌ను బీజేపీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కాంగ్రెస్ ఇచ్చే అబద్ధపు హామీలపై ప్రజల్లో చైతన్యం కలుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతలు సైతం ఆ పార్టీని వదిలే పరిస్థితి ఏర్పడిందని అని అన్నారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని బీఎస్‌వై అన్నారు. నవంబర్ 27న రాయచూరులోని లింగసగూరులో భారీ ఎత్తున ఓబీసీల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. బీజేపీలో చేరిన కె.శివరామ్ మాట్లాడుతూ...‘ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ దళితులను మోసం చేస్తూనే వస్తోంది.
69 ఏళ్లుగా కేవలం ఓటు బ్యాంకు గానే దళితులను పరిగణిస్తోంది. రాష్ట్రంలో సీనియారిటీ ఉన్న దళిత ఐఏఎస్ అధికారిణి రత్నప్రభను చీఫ్ సెక్రటరీగా నియమించకుండా కేంద్ర సర్వీసుల్లో ఉన్న అధికారిని తీసుకొచ్చి సీఎం సిద్ధరామయ్య పట్టం కట్టారు. తద్వారా దళితులకు అధికారాన్ని దూరం చేశారు. అలాంటి కాంగ్రెస్ పార్టీని ఇంకా దళితులు ఎందుకు నమ్మాలి’ అని ప్రశ్నించారు. దళితులకు న్యాయం చేసే సిద్ధాంతాలు ఉన్నందునే బీజేపీ చేరినట్లు శివరామ్ ప్రకటించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అనంత్‌కుమార్, సదానంద గౌడ తదితరులు పాల్గొన్నారు.
ఈశ్వరప్ప, జగదీష్ శెట్టర్ గైర్హాజరు
కాగా, శివరామ్ బీజేపీలో చేరిక సందర్భంగా ఆ పార్టీలో అసమ్మతి మరోసారి బయటపడింది. పార్టీలోని సీనియర్లు ఎవరితోనూ సంప్రదించకుండానే కేవలం యడ్యూరప్ప తన సొంత నిర్ణయంతోనే శివరామ్‌ను పార్టీలోకి ఆహ్వానించారంటూ బీజేపీలోని అనేక మంది సీనియర్ నేతలు అలకబూనారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, శాసనసభలో ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్‌తో పాటు శాసనమండలిలో ప్రతిపక్ష నేత కె.ఎస్.ఈశ్వరప్ప ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.